ఇండోర్: పార్లమెంటులో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్యాంటీన్లను నిర్వహించినందుకు గానూ రూ.16.43 కోట్లు చెల్లించాలని ఉత్తర రైల్వే లోక్‌సభ సెక్రటేరియట్‌ను డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణం, పార్లమెంటు రిసెప్షన్, లైబ్రరీ బిల్డింగ్ వద్ద క్యాంటీన్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. వీటి నిర్వహణకు 2017–18 కాలానికి రూ.16,43,90,598 ఖర్చయిందనీ, దీన్ని వెంటనే చెల్లించాలని బిల్లును పంపింది. 2019, జనవరి 16 నాటికి కూడా ఈ మొత్తాన్ని చెల్లించలేదని పేర్కొంది. ఈ మొత్తం ఖర్చును ఉత్తర రైల్వే ‘సబ్సిడీ క్లెయిమ్–సిబ్బంది ఖర్చుల’ కింద చూపింది. కాగా, ఈ బిల్లును పరిశీలించేందుకు నోట్‌ను కేంద్ర ఆర్థికశాఖకు పంపినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment