న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై ఏమాత్రం పట్టువీడడం లేదు. బుధవారం సైతం ఎంపీల నినాదాలు, నిరసనల కారణంగా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రం తీరుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్లదుస్తులతో హాజరయ్యారు. అదానీ ఉదంతంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేశారు. దాంతో సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఉభయ సభల్లో రగడ కొనసాగుతూనే ఉంది.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు జేపీసీ కోసం నినాదాలు ప్రారంభించారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 దాకా వాయిదా వేశారు.
మళ్లీ ప్రారంభమయ్యాక సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్ అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు–2023ను ప్రవేశపెట్టారు. తర్వాత కాంపిటీషన్(సవరణ) బిల్లు–2022 ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి ప్రకటించారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కాగా, పలువురు సభ్యుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం సభ నిర్వహించవద్దని నిర్ణయించారు.
అదానీ–మోదీ భాయి భాయి
రాజ్యసభలోనూ ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ‘మోదీ–అదానీ భాయి భాయి’ అంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణపై విచారణకు జేపీసీకి డిమాండ్ చేశారు. దాంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అటవీ(సంరక్షణ) సవరణ బిల్లు–2023పై జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు అశోక్ బాజ్‌పాయ్, అనిల్ బలూనీ, సమీర్ ఓరావాన్, సీఎం రమేశ్, ఏఐటీసీ ఎంపీ జవహర్ సిర్కార్, బీజేడీ ఎంపీ ప్రశాంత్ నందా, ఎడీఎఫ్ ఎంపీ హిషే లాచూంగ్‌పా, ఏజీపీ ఎంపీ బిరేంద్ర ప్రసాద్ భైష్యాను సభ్యులుగా నియమించారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment