సాక్షి, అమరావతి : ప్రజలకు అతి తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడానికి ఉద్దేశించిన క్యాంటీన్ల కోసం ఒక్క పైసా ఇవ్వకుండా తమపై విమర్శలు చేయటం సిగ్గుచేటని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలను విమర్శించారు. భారీగా ప్రజాధనాన్ని వృథా చేశారు.. ఎన్నికల ముందు హడావుడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ క్యాంటీన్లపై ప్రతిపక్ష పార్టీ వ్యాఖ్యలను, ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం క్యాంటీన్ల పనితీరుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యాంటీన్ల నిర్మాణాలకు సంబంధించి దాదాపు రూ. 50 కోట్లు, పంపిణీ చేసిన ఆహారానికి సంబంధించి ఆరు నెలల బిల్లులు మరో రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉంచారని ధ్వజమెత్తారు.
పేదలపై గత ప్రభుత్వానికి ఉన్న కపట ప్రేమకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, కోట్ల రూపాయాల్లో అప్పుపెట్టి, పంచభక్షపరమాన్నాలు పెట్టినట్టుగా ప్రచారం చేసుకుందని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసి, ప్రతిపక్ష పార్టీ నాయకులు తమను విమర్శించటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కాకుండా అసలు రద్దీలేని చోట్ల, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అన్నట్టుగా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలోని క్యాంటీన్లలో సుమారు 68 క్యాంటీన్లు ప్రస్తుతమున్న చోటే ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు గుర్తించామని, మిగిలినవి ప్రజలకు చేరువగా లేని ప్రదేశాల్లో నిర్మించారని పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో వీటి నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామన్నారు. ప్రజా ప్రయోజనాలతో పాటు, క్యాంటీన్లను వినియోగించే వారికి ఏవి అవసరమో, ఏ ప్రదేశాల్లో వీటి ఆవశ్యకత ఉందో అధ్యయనం చేసి కొత్తపాలసీని తీసుకుని వస్తామని తెలిపారు. క్యాంటీన్లను ప్రజలకు మరింత ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించిందని, వీటి నిర్వహణలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. క్యాంటీన్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, స్థల లభ్యత, నిర్వహణ వెసులుబాటు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment