అమ్మకోసం..
దేవుడు ఎక్కడో లేడు.. నిన్ను కన్న అమ్మ రూపంలోనే..అనుక్షణం నిన్ను కాపాడుతూ.. నీ వెంటే అమ్మ రూపంలో ఉంటాడట.. అలాంటి అమ్మకు కష్టమొచ్చింది.. నాకు ప్రాణం పోసిన అమ్మ ప్రాణాల మీదకు వచ్చింది.. ఎలాగైనా అమ్మను కాపాడుకోవాలి.. రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆయువును తిరిగి పోయాలి.. అవసరమైతే.. అమ్మ కోసం అంగట్లోనైనా అమ్ముడుపోవాలి..
చైనాలోని గాజౌవ్కు చెందిన కావో మెంగ్‌యాన్ అనే 19 ఏళ్ల అమ్మాయి ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. కేన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ‘వుయ్‌చాట్’ అనే సోషల్ మీడియా సైట్లో తాను అమ్మకానికి సిద్ధమని ఇటీవల ప్రకటించింది. మెంగ్‌యాన్ తల్లి రైతు కూలి.. ఆమెకు ఇటీవల చర్మ కేన్సర్ వచ్చింది. చికిత్సకు వైద్యులు రూ.35 లక్షలు అవసరమని చెప్పడంతో.. ఐదుగురు పిల్లల్లోని పెద్దదైన మెంగ్‌యాన్ తల్లిని బతికించుకోవడం కోసం ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. తనను కొనుక్కున్న యజమాని ఎక్కడ పనిచేయమంటే.. తానక్కడ పనిచేస్తానని.. ఇది బోగస్ ప్రకటన కాదని మెంగ్‌యాన్ తెలిపింది. ఆన్లైన్లో మెంగ్‌యాన్ ప్రకటన సంచలనమైంది. పలువురు సానుభూతి ప్రకటించగా.. మెంగ్‌యాన్ దీన స్థితి కొందరు యువకులకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా తెలిసిన విషయమేమిటంటే.. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మెంగ్యాన్ను కలసి తాము ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారట.