Capital Economics
-
పసిడి రికవరీపై ఆశలు..
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా అమ్మకాల ఒత్తిడితో పన్నెండు నెలల కనిష్ట స్థాయిని తాకిన పసిడి ధరలు మళ్లీ కోలుకోగలవన్న అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా అనిశ్చితి పరిస్థితులు, వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా అంతా పసిడి వైపు చూస్తారని, కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా బంగారం రేటు క్షీణించడం ఆశ్చర్యపరుస్తోందని క్యాపిటల్ ఎకనామిక్స్ సంస్థ విశ్లేషకులు సిమోనా అభిప్రాయపడ్డారు. అయితే, పసిడి ఇప్పటికే ఓవర్‌సోల్డ్ స్థితికి చేరిందని, ఇకపై మళ్లీ క్రమంగా రికవర్ కాగలదని పేర్కొన్నారు. ఔన్సు (31.1 గ్రాములు) ధర 1,250 డాలర్ల స్థాయికి పడిపోయిన నేపథ్యంలో బంగారం ప్రస్తుతం అత్యంత చౌకగా లభిస్తున్నట్లేనని టీడీ సెక్యూరిటీస్ విశ్లేషకులు రయాన్ మెకే తెలిపారు. 1,240 డాలర్ల వద్ద పసిడికి కీలక మద్దతు ఉంటుందని, 1,260–65 నిరోధంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. జూన్ 13న జరిగిన ఫెడరల్ రిజర్వ్ సమావేశం మినిట్స్ ఈ వారంలో వెల్లడి కానుండటం, వ్యవసాయేతర ఉద్యోగాల కల్పన గణాంకాలు విడుదల కానుండటం పసిడిపై ప్రభావం చూపనున్నాయి. ద్రవ్యోల్బణంపై అమెరికా ఫెడ్ ఏ కాస్త ఆందోళన వ్యక్తం చేసినా.. బంగారం ధరల పెరుగుదలకు సానుకూలంగా ఉండగలదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దేశీయంగా చూస్తే.. అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ నేపథ్యంలో స్టాకిస్టులు, ట్రేడర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో వరుసగా రెండో వారం కూడా పసిడి రేట్లు క్షీణించాయి. అంతక్రితం వారంతో పోలిస్తే గత వారంలో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 180 మేర తగ్గింది. అదేవిధంగా మేలిమి బంగారం ధర రూ. 31,420 వద్ద, ఆభరణాల బంగారం రూ. 31,270 వద్ద క్లోజయ్యింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 400 తగ్గి రూ. 40,600 వద్ద ముగిసింది. -
క్యాడ్ ఓకే... అయినా సవాళ్లు తొలగలేదు
సింగపూర్: కరెంట్ ఎకౌంట్ లోటు (సీఏడీ-క్యాడ్)కు సంబంధించి ఒడిదుడుకులు తొలగిపోయినట్లేనని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ క్యాపిటల్ ఎకనమిక్స్ పేర్కొంది. బంగారం దిగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు, విధానాల వల్లే ప్రధానంగా క్యాడ్ తగ్గినట్లు కూడా పేర్కొంది. మొత్తంమీద ఈ పరిస్థితి విదేశీ మారకంలో రూపాయి ఒడిదుడుకులను నివారించడానికి, దేశంలో పెట్టుబడులకు సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడానికి దోహదపడుతుందని నివేదిక విశ్లేషించింది. రెండవ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్యాడ్ 1.2 శాతం (5.2 బిలియన్ డాలర్లకు) కట్టడి జరిగిన నేపథ్యంలో క్యాపిటల్ ఎకనమిక్స్ ఈ తాజా నివేదికను వెలువరించింది. క్యాడ్ కట్టడికి సంబంధించి అంతర్జాతీయ కోణంలో దేశం ఆర్థిక వ్యవస్థ విజయం సాధించినట్లేనని పేర్కొంది. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకపు నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్. సవాళ్లు ఇవీ... క్యాడ్ ఒత్తిడి తగ్గినా, దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం సమస్యలు తొలగిపోలేదని క్యాపిటల్ ఎకనమిక్స్ పేర్కొంది. 10 శాతం వద్ద తీవ్రంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం వల్ల దీనికి హెడ్జ్‌గా బంగారం కొనుగోళ్ల అవకాశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక ద్రవ్యోల్బణంతో పాటు ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి ప్రభుత్వం ఎలా కట్టడి చేయగలుగుతుందన్న అంశం కూడా సందేహాస్పదంగానే ఉందని నివేదిక పేర్కొంది. క్యాడ్ కట్టడి కొనసాగవచ్చు: ఇండియా రేటింగ్స్ కాగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో కూడా క్యాడ్ కట్టడి కొనసాగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తాజాగా అంచనావేసింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు తగ్గడానికి ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడే అంశాలుగా పేర్కొంది.