పెట్టుబడి రాయితీగా రూ.137 కోట్లు విడుదల
{పకృతి వైపరీత్యాలబాధిత రైతులకు ఊరట
2.77 లక్షల మందికి ప్రయోజనం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 137,76,58,120 విడుదల చేసింది. 2009 నుంచి గత ఏడాది వరకూ పలుమార్లు సంభవించిన భారీ వర్షాలు, వరదలు, వడగండ్ల వానలవల్ల 2.96 లక్షల ఎకరాల్లో 50 శాతం మించి పంట నష్టం జరిగింది. 2012లో నీలం తుపాను, కరువు వల్ల 50 శాతం మించి పంట దెబ్బతిన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చినెలల్లో వడగండ్ల వర్షం, పెనుగాలుల వల్ల 1.09 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇలా మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, అనంతపురం, విశాఖపట్నం, కడప, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం , కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 4.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
దీనివల్ల 2,77,019 మంది రైతులు నష్టపోయారు. వీరికి పెట్టుబడి రాయితీ కింద ప్రభుత్వం రూ. 137.76 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి అకౌంట్లలో ఆన్లైన్ ద్వారా జమ చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసే బాధ్యతను ఉద్యాన, వ్యవసాయ శాఖల కమిషనర్లకు అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.