మే 15 కల్లా రాజధాని మాస్టర్‌ప్లాన్!
హైదరాబాద్: రాజధాని మాస్టర్‌ప్లాన్ డిజైన్ వ్యవహారాలపై రాష్ట్రప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మే 15 కల్లా రాజధాని మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను ఇస్తామని సింగపూర్ కన్సల్టెన్సీ చెప్పినట్టు తెలిసింది. ఈలోగా భూసమీకరణ ప్రక్రియను పూర్తిచేసి, జూన్ మొదటివారంలో రాజధాని నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకూ 23వేల ఎకరాల భూసమీకరణ చేసిన ప్రభుత్వం.. మిగతా ఏడువేల ఎకరాలను సైతం సమీకరించడంపై దృష్టిపెట్టింది. రాజ ధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో తొలిదశలో 180 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డు పనులు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. నివాసయోగ్యంగా రాజధాని ఉండేలా రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ప్రాంతవాసులకు తాగునీటి అవసరాలు.. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలపై ఇరురాష్ట్రాలు త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి తొలిదశలో 4 స్మార్ట్ సిటీలకు కేంద్రం అంగీకరించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. వీటికోసం విశాఖ, విజయవాడ-గుంటూరు, నెల్లూరు-కృష్ణపట్నం, తిరుపతి నగరాలను ప్రతిపాదించారు.