‘రాజధాని’ భూముల పందేరం కమిటీలో లోకేశ్
ఉపముఖ్యమంత్రి కేఈ, మంత్రి గంటాకు మొండిచేయి
సాక్షి, అమరావతి: రాజధాని రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని భూముల పందేరం కమిటీలో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు స్థానం కల్పించింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును తప్పించింది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఈ కమిటీలో స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో ఉన్న గంటా శ్రీనివాసరావును తాజా పునర్వ్యవస్థీకరణలో పక్కనపెట్టారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధానిలో భూముల పందేరానికి గతేడాది మే 28న ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో కేఈ కృష్ణమూర్తితోపాటు పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కూడా లేరు. కానీ, ఇప్పుడు పంచాయతీరాజ్, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను కమిటీలో నియమించారు.