121 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ విజయం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టులో భారత ‘ఎ’ ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. 307 పరుగుల విజయలక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో సఫారీ జట్టు 121 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను నెగ్గింది. ఈ ఫలితంతో సిరీస్ 1-1తో సమమైంది. అజింక్యా రహానే (156 బంతుల్లో 86; 10 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (183 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. హెండ్రిక్స్ ఆరు వికెట్లు తీయగా, హార్మన్ మూడు వికెట్లు తీశాడు.
అంతకుముందు 3/1 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు తొలి బంతికే కెప్టెన్ పుజారా వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్లో నదీమ్, కార్తీక్ వికెట్లను తీయడంతో పాటు ఆ తర్వాతి తన ఓవర్లోనే రాయుడును హెండ్రిక్స్ పెవిలియన్కు పంపడంతో భారత్ 18 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దారుణ స్థితిలో పడిపోయింది. ఈ సమయంలో రహానే, సాహా క్రీజులో నిలిచారు. అడపాదడపా బంతిని బౌండరీలకు బాదుతూ స్కోరును పెంచారు. ఆరో వికెట్కు 160 పరుగులు జోడించాక రహానే అవుటయ్యాడు. అనంతరం భారత్ టపటపా వికెట్లను కోల్పోయింది. ఐదు ఓవర్లలోనే చివరి ఐదు వికెట్లు చేజార్చుకొని ఓడిపోయింది.