సీఎం సైకిల్ ర్యాలీ
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో గురువారం సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఎర్రకోట నుంచి ప్రారంభమైన ఈ కార్ ఫ్రీ ర్యాలీలో వివిధ మంత్రులు, ప్రభుత్వ అధికారులు సహా సుమారు వందమంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీ నరాజధాని నగరంలో వాహనాల రద్దీని అరికట్టాల్సిన అవసరం చాలా ఉందన్నారు. విష వాయువులను విడుదల చేస్తున్న కార్లను వదిలిపెట్టి పైకిళ్లను వాడాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందనీ, ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. వణికిస్తున్న వాతావరణ కాలుష్యంనుంచి కాపాడుకోవడానికి ఢిల్లీ వాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుమారు 84 లక్షల వాహనాలు ఢిల్లీ రోడ్లమీద తిరుగుతున్నాయని దీనిమూలంగా గాలి విపరీతంగా కలుషిత మవుతోందన్నారు. అందుకే సాధ్యమైనంతవరకే ప్రతి ఒక్కరు ప్రజా రవాణా వ్యవస్థ ను ఉపయోగించుకోవాలని, ఎక్కువగా సైకిళ్లను వినియోగించడానికి ముందుకు రావాలని సూచించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న నాలాంటి వాళ్లకు బాగా ఉపయోగపడుతుందన్నారు.
అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. కానీ ఇలాంటి అవగాహనా ర్యాలీలు ఆదివారం రోజు నిర్వహిస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.