విద్యార్థికి మార్గదర్శి.. కెరీర్ కౌన్సెలర్
అప్‌కమింగ్ కెరీర్: గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది.. తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలా? లేక ఏదైనా కొలువు కోసం ప్రయత్నించాలా? ఫలానా కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? నచ్చిన కోర్సు చదవాలంటే ఏ కాలేజీలో చేరాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఉన్నత విద్యకు స్వదేశమా? విదేశమా? ఏది మేలు? ఏ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుంది?... ఇలా ఒక విద్యార్థి మదిలో లెక్కలేనన్ని సందేహాలు. వీటికి సరైన సమాధానాలు చెప్పి, బంగారు భవిష్యత్తుకు మార్గం చూపే ఒక గురువు కావాలి. అతడే.. కెరీర్ కౌన్సెలర్.
మనదేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న ప్రొఫెషన్.. కెరీర్ కౌన్సెలర్. విద్యార్థులు తమ శక్తిసామర్థ్యాలకు తగిన స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోలేక అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కెరీర్ పరంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించి, భవిష్యత్తువైపు విజయవంతంగా అడుగులేసేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే కెరీర్ కౌన్సెలర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.
మనుషుల మనస్తత్వాలను చదవాలి:
కెరీర్ కౌన్సెలర్‌గా వృత్తిలో రాణించాలంటే మానసిక శాస్త్రం(సైకాలజీ)పై గట్టి పట్టు ఉండాలి. మనుషుల మనస్తత్వాలను చదవగలగాలి, వారి ప్రవర్తనను, శక్తిసామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడే వారికి సరైన సలహాలు ఇచ్చేందుకు వీలుంటుంది. కౌన్సెలర్లకు మంచి పరిశీలనా, పరిశోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.
కౌన్సెలర్లకు భారీ డిమాండ్:
మన దేశంలో కౌన్సెలింగ్‌పై ఆసక్తి ఉన్న కొందరు దీన్ని పార్టటైమ్ ప్రొఫెషన్‌గా మాత్రమే ఎంచుకుంటున్నారు. నిజానికి భారత్‌లో కెరీర్ కౌన్సెలర్ల అవసరం ఎంతో ఉంది. డిమాండ్‌కు సరిపడా కౌన్సెలర్లు అందుబాటులో లేరు.
ఇది కెరీర్ కాదు.. బాధ్యత!
‘‘కెరీర్ కౌన్సెలింగ్ స్కూల్, కాలేజీ స్థాయిల్లో ఉంటుంది. విద్యార్థుల మనసు చదివి వారి ఇష్టాయిష్టాలను, నైపుణ్యం, దృక్పథం తదితర వ్యక్తిగత సామర్థ్యాలను అంచనా వేయగలగాలి. రాబోయే 5-10 ఏళ్లలో జాబ్‌మార్కెట్ ఎలా ఉంటుందనేది అంచనావేయగలగటం ముఖ్యం. కెరీర్ కౌన్సిలర్‌కు ఓర్పు, మనస్తత్వాలను అంచనా వేయగలగటమే అర్హతలు. సోషల్‌వర్క్, సైకాలజీ, హెచ్.ఆర్ కోర్సులు చేసిన వారికి ఇది కెరీర్‌గా సరిపోతుంది. స్కూల్స్, ప్రముఖ కాలేజీల్లో కె రీర్ కౌన్సెలర్స్గా అవకాశాలున్నాయి. సొంతగా సంస్థను ఏర్పాటుచేసి విద్యార్థులకు దిశానిర్ధేశం చేయటం ద్వారా ఉద్యోగ సంతృప్తి లభిస్తుంది. దీన్ని కెరీర్‌గా కాకుండా బాధ్యతగా స్వీకరించాలి’’
-మురళీధరన్, సీఈవో
సీ అండ్ కే మేనేజ్మెంట్ లిమిటెడ్,
హైదరాబాద్
వేతనాలు: ప్రారంభంలో జూనియర్ కౌన్సెలర్‌కు నెలకు రూ.15 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. సీనియర్ కౌన్సెలర్ తన అనుభవాన్ని బట్టి దాదాపు రూ.2.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
కెరీర్ కౌన్సెలింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఎన్సీఈఆర్టీ-న్యూఢిల్లీ, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు
వెబ్సైట్: http://www.ncert.nic.in/
యూనివర్సిటీ ఆఫ్ ముంబై
వెబ్సైట్: http://www.mu.ac.in/
పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్
వెబ్సైట్: http://puchd.ac.in/
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై
వెబ్సైట్: http://www.tiss.edu/
అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చదవాలి. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ కోర్సులో చేరొచ్చు. కెరీర్ కౌన్సెలర్లకు సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వృత్తిలో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది.
కావాల్సిన లక్షణాలు: విద్యార్థులకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలనే బలమైన ఆసక్తి మాటలతో ఇతరులను ప్రభావితం చేసే నైపుణ్యం స్వతంత్రంగా లేదా ఇతరులతో కలిసి బృందంగా పని చేసే నేర్పు కౌన్సెలర్‌గా కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రతిభకు ఎప్పటికప్పుడు సాన పెట్టుకునే అలవాటు.