Career Oriente People
-
భారీగా దొరికితే మరణశిక్షే
► డ్రగ్స్ ఉంటేనే పెడ్లర్ కాదు! ► భారీ మొత్తం ఉంటేనే, విక్రయించి ఉంటేనే పెడ్లర్ ► మార్పునకూ ఆస్కారం ఇస్తున్న ఎన్డీపీఎస్ యాక్ట్ ► భారీ మొత్తంలో దొరికితే మరణశిక్షకూ ఆస్కారం ఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) యామాదకద్రవ్యాల కేసుల్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎన్డీపీక్ట్–1985 కింద నమోదు చేస్తారు. ఈ చట్టం డ్రగ్స్, వాటి పరిమాణం, వినియోగదారులు, విక్రేత (పెడ్లర్).. ఇలా అనేక నిర్వచనాలు ఇచ్చింది. ఇదే చట్టం మాదకద్రవ్యాలకు బానిసలైన వారు మారేందుకు అవకాశం కల్పిస్తోంది. భారీ మొత్తంలో డ్రగ్‌తో దొరికితే మరణశిక్ష విధించడానికీ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆస్కారం ఉంది. ►ప్రాథమికంగా డ్రగ్‌ను కలిగి ఉండో, విక్రయిస్తోనో, సేవిస్తూనో చిక్కిన వారిని మాత్రమే అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ►తక్కువ పరిమాణంలో మాదకద్రవ్యంతో చిక్కిన వారిని వినియోగదారులుగా పరిగణించే అవకాశం ఉంది. ఏ డ్రగ్, ఎంత మొత్తంలో దొరికితే వినియోగదారుడిగా పరిగణించాలి అనేది దర్యాప్తు అధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ► మాదకద్రవ్య వినియోగదారులపై ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 27 కింద కేసు నమోదు చేస్తారు. ఈ నిందితులు న్యాయస్థానంలో హాజరైనప్పుడు తాము బానిసలయ్యామని, మార్పునకు అవకాశం ఇవ్వమని కోర్టును కోరే ఆస్కారం ఉంది. ►ఇలా వేడుకున్న సందర్భాల్లో న్యాయస్థానం ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 64 (ఏ) కింద వారికి ఓ అవకాశం ఇస్తుంది. తద్వారా రీహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్ళి మారడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ► రక్తం, మెదడుపై మాత్రమే ప్రభావం చూపించే వాటిని నార్కోటిక్స్ అంటారు. ఈ తరహాకు చెందిన కన్నాబీస్ (గంజాయి మొక్క) ఉత్పత్తులతో చిక్కిన వారిపై అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 20 కింద కేసు నమోదు చేస్తారు. గంజాయి, హాష్, భంగు, ఆశిష్, చెరస్ ఇవన్నీ కన్నాబీస్ నుంచే వస్తాయి. ►వీటితోపాటు సహజ ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే కొకైన్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్, మార్ఫిన్ వంటి వాటినీ నార్కోటిక్ డ్రగ్స్ కిందే పరిగణిస్తారు. వీటికి సంబంధించి అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 21 కింద కేసు నమోదు చేస్తారు. ► ఏ డ్రగ్స్ ప్రభావమైతే మనిషి నాడీ వ్యవస్థపై ఉంటుందో వాటిని సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్గా పేర్కొంటారు. ఎండీఎంఏ (ఎక్స్టసీ), ఎల్ఎస్డీ, ఎల్ఎస్ఏ ఇవన్నీ వీటి పరిధిలోని వస్తాయి. దాదాపు రసాయనాలతో సమానమైన, ప్రయోగశాలల్లో తయారయ్యే ఇలాంటి ఉత్పత్తులతో చిక్కిన వారిపై అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 22 కింద కేసు నమోదు చేస్తారు. ► కొకైన్ 500 గ్రాములు అంత కంటే ఎక్కువ, నల్లమందు 10 కేజీలు అంతకంటే ఎక్కువ, హెరాయిన్, మార్ఫిన్‌లు కేజీ అంతకంటే ఎక్కువ మోతాదుతో చిక్కిన వారికి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మరణశిక్ష పడటానికీ ఆస్కారం ఉంది. – కామేశ్ -
షాక్ మీద షాక్
హైదరాబాద్‌లో పదేళ్ల కిందటే డ్రగ్స్ స్కూల్ కాంపౌండ్‌లోకి అడుగుపెట్టాయి. అంతా అయిపోయాక నెత్తీనోరు కొట్టుకునే బదులు మొదట్లోనే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. డ్రగ్స్ ఎలా మార్కెట్లోకి వస్తాయి.. పిల్లలకు ఎలా అలవాటు అవుతాయి లాంటివన్నీ తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ని ఇలాంటి అవేర్‌నెస్‌కు ఉపయోగించుకోవాలి. అన్నిటికన్నా ముందు పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వకూడదు. వాళ్లు ఏది అడిగినా మనమే తెచ్చివ్వాలి తప్ప వాళ్ల చేతికి డబ్బు ఇవ్వకూడదు. అలాగే స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అరాచకశక్తులు ఎలాంటి తినుబండారాలు అమ్మకుండా.. అసలు వాళ్లు ఆ సరౌండింగ్స్లోకి అడుగుపెట్టకుండా స్కూల్ మేనేజ్మెంట్ తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి. లేకపోతే తల్లిదండ్రులకు కడుపుకోతే! అందుకు నిదర్శనం నవ్రిత్కౌర్ అనే తల్లి (పేరు మార్చాం) ఆవేదన. ‘సాక్షి’ ప్రతినిధికి ఆమె చెప్పిన దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆమె మాటల్లోనే చదవండి. మాది ఉత్తరప్రదేశ్. మావారు మిలిటరీలో పనిచేసి రిటైరయ్యారు. మేము ఇక్కడే హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాకు ట్విన్స్. ఒక పాప, బాబు. మా బాబు మా ఆడపడచు దగ్గర ఢిల్లీలో పెరిగాడు. అక్కడే చదివాడు. పాప మా దగ్గర. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే విషయం పదేళ్ల నాటిది. అప్పుడు నా పిల్లల వయసు పద్నాలుగేళ్లు. పాప సికింద్రాబాద్‌లోని పేరున్న స్కూల్లోనే చదివింది. బాబునూ అంతే. ఢిల్లీలోని పెద్ద స్కూల్లోనే వేశారు. వీళ్లిద్దరూ తొమ్మిదో తరగతిలో ఉన్నారు... మా పాపకు చాకొలెట్స్ అంటే చాలా ఇష్టం. రోజూ స్కూల్‌కి చాక్లెట్స్ తీసుకెళ్లేది. ఒకరోజు.. మా పాప ఫ్రెండ్.. ‘ఇండియన్ చాకొలెట్స్ ఏం తింటావ్? మా కజిన్ ఫారిన్ చాకొలెట్స్ తెచ్చిచ్చాడు.. చూడు ఎంత టేస్టీగా ఉన్నాయో!’ అంటూ ఆ చాక్లెట్స్ ఇచ్చింది. ఆ రోజు నుంచి వరుసగా వారం రోజుల దాకా రోజుకో చాకొలెట్ ఇచ్చిందట. మా పాపకు బాగా నచ్చాయి. వారం తర్వాత కూడా అవే చాకొలెట్స్ కావాలని పట్టుబట్టింది. వాళ్ల నాన్న తెప్పించాడు. కాని అవి అమ్మాయికి నచ్చలేదు. ‘మా ఫ్రెండ్ దగ్గరున్న చాకొలెట్స్ లాంటివే కావాలని పట్టుబట్టింది. ఆ ఫ్రెండ్ ఏమో అవి తన దగ్గర అయిపోయాయి. మా కజిన్ అడుగుతాను ఇంకా ఉన్నాయేమో అని అందిట. వాళ్ల కజిన్‌ను అడిగితే.. ‘డబ్బులిస్తే తెప్పిచ్చిస్తా’ అని చెప్పాడట. తన పాకెట్ మనీ ఇచ్చి చాకొలెట్స్ తెప్పించుకుంది. అది ఓ అలవాటుగా మారింది. ఆర్నెల్లు గడిచాయి. ఆ చాకొలెట్స్కి ఎంతగా అలవాటు పడిందంటే మా అమ్మాయి.. తిండిలేకపోయినా ఉండేది కాని చాకొలెట్స్ లేకపోతే ఉండేది కాదు. ఆ చాకొలెట్స్ ధర పెరిగిందని పాకెట్ మనీ ఎక్కువ అడిగేది. ఇవ్వకపోతే.. ఆ రోజు చాకొలెట్స్ దొరక్కపోతే.. ఇంట్లో వస్తువులను పగలగొట్టేసేది.. దిండు గలీబులు చించేసేది.. జుట్టు పీక్కునేది.. చివరకు ఎవరు అడ్డు వస్తే వాళ్లను కొట్టడం, రక్కడం కూడా చేసేది. చదువులో కూడా చాలా వెనకబడింది. క్లాస్‌లో ఎప్పుడూ నిద్రపోయే ఉంటోందని కంప్లయింట్స్ రావడం మొదలుపెట్టాయి. తిండి తినడమూ మానేసింది. ఎప్పుడూ నీరసంగా కనిపించేది. ఏమైందోనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. రొటీన్ టెస్ట్‌ల్లో భాగంగా బ్లడ్‌టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు బయటపడింది. కాని అప్పటికే మా చేయి దాటి పోయింది. రెగ్యులర్ కౌన్సిలింగ్ అమ్మాయి విషయంలో పనిచేయలేదు. డీ ఎడిక్షన్ సెంటర్లో చేర్పించమని సలహా ఇచ్చారు సన్నిహితులు, ఫ్యామిలీ డాక్టర్. అందుకే ఢిల్లీ తీసుకెళ్లాం పాపను. మరో షాక్ ఢిల్లీ వెళ్లాక మాకు ఇంకో షాక్. మా పాప విషయం చెప్పగానే మా ఆడపడచు బాబు విషయం చెప్పింది. వాడికి రోజూ మా ఆడపడచు పాకెట్ మనీ కింద పదిరూపాయలు ఇచ్చేది. వాడికి ప్రూట్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ ముందు జామకాయలు, యాపిల్స్ అమ్మడానికి వచ్చేవట. వీడు మామూలుగా యాపిల్‌నే ఇష్టపడేవాడు. కాని ఒకరోజు యాపిల్స్ రాకపోతే జామకాయ కొనుక్కున్నాడట. అంతే ఆ రోజు ప్రతిరోజూ జామకాయే తినడం మొదలుపెట్టాడట. నిజానికి మా అబ్బాయికి జామకాయంటే అంత ఇష్టం ఉండదు. ఒకరోజు.. స్కూల్లో తినడమే కాక ఇంటికి వస్తూ కూడా ఒకటి కొనుక్కొని తీసుకొచ్చి తింటుంటే.. మా ఆడపడచు.. ‘ఒరేయ్.. నీకు జామకాయ ఇష్టం ఉండదు కదా.. అది తింటున్నావేంటి?’ అని అడిగిందట. ‘మా స్కూల్ దగ్గర అమ్మే జామకాయలు చాలా బాగుంటున్నాయ్.. కట్ చేసి సాల్ట్ లాంటిది పెట్టి ఇస్తాడు ఎంత బాగుంటుందో ’ అని చెప్పాడట. ‘అబ్బా.. అయితే రేపు నాకూ ఒకటి పట్రారా..’ అందిట మా ఆడపడచు నవ్వుతూ. సరేనని వాడు తెల్లవారి ఆమె దగ్గర 21 రూపాయలు తీసుకెళ్లి స్కూల్లో ఒకటి, వస్తూ వస్తూ మరో రెండూ జామకా యలు కొనుక్కొని వచ్చాడు. అది తిన్న మా ఆడపడచుకి ఏదో తేడా అనిపించి... ‘ఒరేయ్.. రేపు జామకాయ కోయకుండా ఇవ్వమని చెప్పు’ అందిట. తెల్లవారి జామకాయ లేకుండానే వచ్చాడట మావాడు. ‘ఏరా.. పండు తేలేందేంటి?’ అని అడిగింది ఆమె. ‘‘కోయకుండా, సాల్ట్ చల్లకుండా ఇవ్వరట. అలా కోయకుండా ఇవ్వమన్నందుకు నన్ను తిట్టాడు వాడు.‘ రేపటి నుంచి నీకు జామకాయలు అమ్మను’ అని నాతో దెబ్బలాడాడు’’ అని చెప్పాడట మావాడు బాధగా. దాంతో అందులో వాడు డ్రగ్స్ పౌడర్ చల్లిస్తున్నాడన్న మా ఆడపడచు అనుమానం నిజమే అయిందిట. స్కూల్ మేనేజ్మెంట్కి కంప్లయింట్ చేసింది. బాబు విషయంలో ఆమె త్వరగా కనిపెట్టింది కాబట్టి వాడు ఎడిక్ట్ అయ్యేదాకా పోలేదు పరిస్థితి. కాని పాప విషయంలో మేం కనిపెట్టలేకపోయాం. అందుకే తను ఎడిక్ట్ అయి డీ ఎడిక్షన్ సెంటర్లో చేర్పించాల్సి వచ్చింది. రెండేళ్ల చదువు పోయింది. కాని తర్వాత పరిపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంది. సైకియాట్రిమెడిసిన్ చదువుతోంది. – శరాది, సాక్షి ప్రతినిధి మరో ఫ్యామిలీ ఇలా బాధ పడకూడదు! ‘‘డ్రగ్స్‌కు అడిక్ట్ అయి మా అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాక మేము పడిన బాధ ఎవ్వరికీ రాకూడనిది. మరో ఫ్యామిలీ అలా బాధపడకూడదనే నేను ఈ కథను అందరికీ చెబుతున్నా’’ అంటూ లోరా వేన్స్ తన అన్న డేవిడ్ లాహోన్ గురించి చెప్పిన కథ డ్రగ్స్‌కు అడిక్ట్ అయితే ఎన్నెన్ని జీవితాలు కుదేలైపోతాయో చెప్పే మరో పాఠం.2013లో 41 ఏళ్ల డేవిడ్ డ్రగ్స్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. డేవిడ్‌కు ఓ మంచి భర్తగా, తండ్రిగా పేరుంది. తన వాళ్లు అనుకునేవారికి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న డేవిడ్ జీవితంలోకి డ్రగ్స్ రావడం మొత్తాన్నీ మార్చేసింది. ముందు సరదాగానే డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత మెంటల్ ప్రెజర్ అన్న పేరుతో స్థాయి పెంచాడు. ఆ తర్వాత ఒంటి నొప్పులు ఉంటే దానికీ డ్రగ్స్‌నే నమ్ముకున్నాడు. డ్రగ్స్ అతడి జీవితంలోకి పూర్తిగా వచ్చేశాయి. ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. బతుకు మీద ఆసక్తి తగ్గింది. కుటుంబం గుర్తు రాలేదు. ఎవ్వరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. డేవిడ్ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో కళ పోయింది. పిల్లలు అనాథలయ్యారు. లోరాకు అన్నయ్య అనే ఓ అండ లేకుండా పోయింది. ‘‘డేవిడ్ జీవితంలోకి డ్రగ్స్ వచ్చిన విషయం మాకెవ్వరికీ తెలియలేదు. కానీ ఏదో విషయాన్ని పట్టుకొని బాధపడుతున్నాడని మాత్రం అర్థమయ్యేది. ముఖమంతా పేలిపోయినట్లు కనిపించేది. ఏ విషయమ్మీదా ఆసక్తి చూపేవాడు కాదు. అప్పుడే కాస్త ఆలోచించి ఉంటే మాకు దక్కేవాడేమో! డేవిడ్ బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఒక్కోరోజు 800 డాలర్ల వరకూ తీశాడని తెలిసింది. అతడి జీవితంలో ఇంత జరుగుతున్నా మాకేదీ తెలియలేదు. మా అన్నలా ఇంకెవరి జీవితం కావొద్దన్నదే నేను కోరుకునేది. మమ్మల్ని చూసైనా ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు మారతారనే నేనిది చెప్తున్నా’’ – లోరా డ్రగ్స్... నా కొడుకు ప్రాణం తీశాయి! అది డిసెంబర్ 12, 2016. అమెరికాలోని నోర్వాక్ కమ్యూనిటీ ప్రాంతంలో జోవొన్ మార్కీ బ్రౌన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడొక డ్రగ్ అడిక్ట్. చనిపోయిన నాటికి అతడి వయస్సు 24 సంవత్సరాలు. జొవొన్ చిన్నప్పట్నుంచే అన్నింట్లో ముందుండేవాడు. స్కూల్లో ఏ టీచర్‌ను పట్టుకొని అడిగినా జొవొన్ బెస్ట్ స్టూడెంట్ అని చెబుతూ ఉంటారు. అందంగా ఉంటాడు. అందంగా నవ్వుతాడు. స్కూల్లో బెస్ట్ స్మైల్ అవార్డు కూడా వచ్చింది అతడికి. 18 ఏళ్లు వచ్చేవరకూ జొవొన్ జీవితమంతా అద్భుతంగా గడిచింది. అప్పుడే డ్రగ్స్ పరిచయమయ్యాయి. మెల్లిగా దానికి బానిస అయిపోయాడు. 22 ఏళ్లు వచ్చేసరికి అతడి జీవితమంతా తల్లకిందులైంది. డ్రగ్స్ లేకుంటే బతకలేని స్థితికి చేరిపోయాడు. రెండు సంవత్సరాలు నరకం చూశాడు. 24 ఏళ్లు వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే రోజు జొవొన్ రాసిన ఓ లెటర్‌ను జొవొన్ తల్లి లిండా స్టబ్స్ రోజూ చదువుతూ ఉంది. ‘‘డ్రగ్స్ పరిచయం కాకముందు నా లైఫ్ అద్భుతంగా ఉండింది. మంచి కారు, మంచి ఉద్యోగం, నన్నెంతో ఇష్టపడే గర్ల్‌ఫ్రెండ్. ఇప్పుడు మొత్తం కోల్పోయా. నాకింక మిగిలిందేమీ లేదనిపిస్తోంది.’’ కొడుకు రాసిన ఉత్తరంలోని ఈ వాక్యాలు చదివినప్పుడల్లా తన కష్టం ఏ తల్లికీ రాకూడదని కోరుకుంటోంది లిండా స్టబ్స్.‘‘నేనొక డ్రగ్ అడిక్ట్ తల్లిని. రోజూ నేను ఆ దేవుడ్ని కోరుకునేది ఒక్కటే.. మార్పు త్వరలోనే రావాలని’’ – లిండా రాసిన ఓ కవితలోని చివరి లైన్ డ్రగ్స్‌కి విరుగుడు ప్రేమ అది 2015. పంజాబ్‌లోని టరంటరన్ ప్రాంతానికి చెందిన రాహుల్ (పేరు మార్చాం) అనే ఓ యువకుడు రాయ్కోట్లోని డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. రాహుల్‌తో అక్కడి డాక్టర్లు రోజూ డైరీ రాయిస్తూ ఉంటారు. ఆ డైరీలో, ‘‘నాన్నా! నన్ను క్షమించు. నేను నిన్ను ఎంతగానో తిట్టా. అయినా నువ్వు నాకు ఇంకో జీవితాన్ని ఇస్తున్నావు. థ్యాంక్ గాడ్! నువ్వున్నావ్. నువ్వు ఉండడం వల్లే నేను బతికున్నా’’ అని రాస్తున్నాడు రాహుల్. అతడు అప్పుడు తనని తాను అర్థం చేసుకున్న మనిషి. ఈ రోజుకి పూర్తిగా మారిన మనిషి. 11 ఏళ్ల వయసున్నప్పుడు రాహుల్ తండ్రితో కలసి తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్ ఒత్తిడి చేస్తే మందు కొట్టాడు. మెల్లిగా అది అలవాటు అయిపోయింది. పద్నాలుగేళ్లు ఉన్నప్పుడు స్కూల్లోకి తాగొచ్చి మరీ గొడవ చేశాడు. ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. గంజాయి పరిచయం అయింది. హెరాయిన్ అనే డ్రగ్ ఒకటి పరిచయం అయింది. ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతూ వస్తోంది. దేనిమీదా దృష్టి ఉండడం లేదు. ఓ రోజు తండ్రితో కలసి పొలంలో పనిచేస్తున్నాడు. అప్పటికే పూర్తిగా మత్తులో ఉన్నాడు. గడ్డికోసే యంత్రంలో రాహుల్ చెయ్యి పడి తెగింది. ఆసుపత్రికి తీసుకెళ్తే బయటపడిందిదీ.. రాహుల్ ఒక డ్రగ్ అడిక్ట్‌గా మారిపోయాడని! కొడుక్కి నయమవ్వాలని ఏడ్చాడు. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాడు. రాహుల్ ఇప్పుడు మళ్లీ తన పని తాను చేసుకుంటూ, ఓ కొత్త జీవితం మొదలుపెట్టాడు.‘‘డ్రగ్స్‌కు అలవాటయ్యే రోజుల్లో నాకేదీ తెలిసేది కాదు. సరదాకే మొదలుపెట్టింది నా చావు దాకా వచ్చింది. నాన్నే లేకుంటే బతికేవాణ్ణి కాదు. అదొక మాయలా కనిపించింది. నాలా ఆ మాయలో పడొద్దనే అందరికీ చెబుతుంటా.’’ అంటున్నాడు రాహుల్. ‘‘డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న వారిని డ్రగ్స్‌కు దూరం చేయాలంటే వారికి చూపించాల్సింది ప్రేమొక్కటే! వాళ్లకు ప్రేమ కావాలి.. డ్రగ్స్ కాదు.’’ – డాక్టర్ మధుమిత బెనర్జీ, రాహుల్‌కు చికిత్సను అందించిన డాక్టర్ మారాలన్న పట్టుదలే మార్చింది! అహ్మద్ హుస్సేన్ ముంబైలోని మున్సిపల్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తనతోపాటు తల్లి, అక్క, తమ్ముడు ఉన్న ఇంటిని అహ్మద్ పోషించాల్సిన సమయమది. కానీ అతడికి తండ్రిపై కోపమొచ్చింది. మందుకు అలవాటుపడ్డాడు. సిగరెట్‌కు బానిస అయ్యాడు. తనలా అల్లరి చిల్లరిగా తిరిగే ఫ్రెండ్స్‌తో ఒక గ్రూప్ ఏర్పరచుకున్నాడు. డ్రగ్స్ పరిచయమయ్యాయి. మొదట్లో ఫ్రెండ్స్ ఫ్రీగానే డ్రగ్స్ అందించేవారు. రాను రాను దానికి డబ్బులు అవసరమయ్యాయి. అందుకోసం దొంగతనం మొదలుపెట్టాడు. మోసాలు నేర్చుకున్నాడు. ఏం చేసినా డబ్బు సంపాదించడం ఒక్కటే పని. ఆ డబ్బుతో డ్రగ్స్ కొనాలి. కొన్నాళ్లకు అహ్మద్ పూర్తిగా డ్రగ్స్ ఉచ్చులో కూరుకుపోయాడు. బయటకొచ్చే దారేదీ కనిపించలేదు. మరోపక్క ప్రేమ విఫలమైంది. ఇక ఆత్మహత్య ఒక్కటే మిగిలిందని అనుకున్నాడు. అదే సమయంలో ముంబై సెంట్రల్ డ్రాప్ ఇన్ సెంటర్లో డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడిన వ్యక్తి ఒకతను పరిచయమయ్యాడు. తనూ అలా మారగలడన్న నమ్మకాన్ని తెచ్చుకున్నాడు అహ్మద్. మొదట్లో కష్టమైనా మెల్లిగా డ్రగ్స్ ఆలోచనను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు అహ్మద్ డ్రగ్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఓ కొత్త జీవితం మొదలుపెట్టాడు. కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు. చిన్న ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అతడిప్పుడు మారిన మనిషి. ‘‘మారాలన్న నా ఆలోచనే నన్ను ఇప్పుడిలా మార్చేసింది. చెల్లి, అమ్మతో మాట్లాడాలని ఉంది. అమ్మకు నాపై కోపం ఉంది. అయినా నేను మళ్లీ వాళ్లకు దగ్గరవుతానన్న నమ్మకం ఉంది’’ – అహ్మద్ – వి. మల్లికార్జున్ -
మీ పిల్లలేం చేస్తున్నారో మీకు తెలుసా?
అవును... మీ పిల్లలేం చేస్తున్నారు? వాళ్ల పాకెట్ మనీతో ఏం చేస్తున్నారు? వాళ్ల ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నారు? వాళ్ల టైంతో ఏం చేస్తున్నారు? కనిపెట్టండి. మీరు మంచి పేరెంట్స్. మీ పేరెంటింగ్ మంచిదే! కానీ, అది సరిపోదేమో! మీ మంచి వలయాన్ని ఛేదించుకుని డ్రగ్స్ రావచ్చు. జాగ్రత్త! పిల్లల్ని కనిపెట్టుకుని ఉండండి. పేరెంట్స్‌కి ఇప్పుడు డ్రగ్స్ భయం పట్టుకుంది! పిల్లల జీవితాలను కబళిస్తున్న డ్రగ్స్ వ్యసనం.. అసలు ఎలా మొదలౌతుందనే విషయమై తల్లిదండ్రులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలకు సమాధానంగా సాక్షి ‘ఫ్యామిలీ’ కొన్ని కేస్ స్టడీస్ సంపాదించింది. 'వినీత' అసలు పట్టించుకోనందుకు వినీతకు 19 ఏళ్లు. ఎప్పుడూ మూడీగా ఉంటోంది. ఒక్కో రోజు చేతికి అందిన వస్తువుని నేలకేసి కొడుతోంది. ఆమె ప్రవర్తనలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తండ్రికి పట్టించుకునే తీరిక లేదు, తల్లికీ లేదు. ఓ రోజు వాళ్లింటికి వచ్చిన చిన్నాన్న ఆమెను డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. వినీతతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అక్కడివాళ్లు నిర్ధారణకు వచ్చేశారు.. ఆమెకు డ్రగ్స్ తీసుకోవడం అలవాటైందని. ఇంటి వాతావరణం గురించి వివరాల్లోకి వెళ్లారు కౌన్సెలర్. వినీత తండ్రి ఆల్కహాలిక్, వివాహేతర సంబంధాలూ ఉన్నాయి. ఓ రోజు తండ్రి మరో మహిళతో గదిలో ఉండడం చూసి వినీత షాక్ అయింది! ఆమెకు ఒకటి అర్థమైంది. తల్లి, తండ్రి ఒక కప్పు కింద మాత్రమే ఉన్నారు. ఎవరి జీవితం వారిది. డబ్బుకు ఇబ్బంది లేదు. తన గురించి పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలన్న ధ్యాస ఆ ఇద్దరిలోనూ లేవు. ఇంట్లో దేనికీ కొదవ ఉన్నట్లు కనిపించదు కానీ మనుషుల మధ్య ఉండాల్సిన బంధమే కొరవడింది. దాంతో వినీతకు డ్రగ్స్ తీసుకోవడం అలవాటైంది. 'వరుణ్' అతిగా పట్టించుకున్నందుకు వరుణ్ అమ్మానాన్న ఇద్దరూ జిల్లా స్థాయి అధికారులు. ఇద్దరూ కెరీర్ ఓరియెంటెండ్ పీపుల్. వరుణ్ ఉదయం స్కూలుకి వెళ్తాడు. స్కూలు నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్ ఉంటుంది. మాస్టారు ఇంటికే వచ్చి పాఠాలు చెప్తారు. ఆయన వెళ్లాక హోమ్‌వర్క్. అది పూర్తయ్యేసరికి తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. ఆ రోజు ఏమేమి చేసిందీ తెలుసుకుంటారు. పిల్లవాడి పెర్ఫార్మెన్స్ తగ్గకుండా మానిటర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాతావరణంలోనూ వరుణ్ గంజాయికి బానిసయ్యాడు! ‘‘పేరెంట్స్‌గా మేమెంత బిజీగా ఉన్నా పిల్లల గురించి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఇంతగా పర్యవేక్షిస్తున్నా పిల్లలు వ్యసనాల బారిన పడతారా?’’ ఇదీ కౌన్సెలర్ దగ్గర వరుణ్ తల్లిదండ్రులు వెలిబుచ్చిన సందేహం. నిజమే! వరుణ్ని సివిల్స్ ర్యాంకర్‌గా చూడడానికి, తమలాగే ఉన్నతమైన హోదాలో నిలపడానికి చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. అయితే ఇరవై నాలుగ్గంటల్లో తనకు ఇష్టమైన సమయం, తాను ఇష్టంగా గడిపే ఒక గంట ఏది అనడిగితే పేరెంట్స్ ముఖముఖాలు చూసుకున్నారు! నో ఆన్సర్ . 'కార్తీక్' కొత్త కొత్త స్నేహాలు కార్తీక్‌ది సూర్యాపేట. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. అప్పటి వరకు అందరిలాగానే మంచబ్బాయే. క్రమంగా కొత్త స్నేహితులు పరిచయం కాసాగారు. ఎప్పుడూ కాలనీలో కనిపించని కుర్రాళ్లు కొందరు కార్తీక్‌తో కనిపించేవారు. వాళ్లంతా బాహాటంగానే సిగరెట్ కాల్చేవాళ్లు. పేరెంట్స్ సిగరెట్ గురించి కోప్పడ్డారు. తర్వాత తేలిగ్గా తీసుకున్నారు. కొన్నాళ్లకు సిగరెట్ మాత్రమే కాక మరేదో అందుతోందనే అనుమానం వచ్చి, కార్తీక్ సిగరెట్లను విప్పి చూశారు, గంజాయి పొడి. ఈ కండిషన్లో ఉన్న పిల్లవాడిని మామూలు స్థితికి తీసుకురావడానికి కౌన్సెలింగే మార్గమని ఓరోజు ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లారు. కార్తీక్ అప్పటికే చదువులో వెనుకపడ్డాడు. కారణాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు, వాళ్లకు ఒకరి మీద ఒకరికి అనుమానం, ఇంట్లో ఎప్పుడూ హ్యాపీ ఎట్మాస్ఫియర్ లేదన్నాడు. ఆ స్థితిలో ఉన్న పిల్లలు చెప్పుడు మాటలకు బొమ్మల్లా తలలూపుతారు. తొలిదశలోనే తెలుసుకోవడంతో మందుల అవసరం లేకనే కౌన్సెలింగ్‌తో దారికొచ్చాడు కార్తీక్. త్వరగానే పిల్లవాడు గాడిలో పడ్డాడు. 'రవళి' పుష్కలంగా డబ్బు! రవళి మణిపాల్‌లో ఎంబిబిఎస్ థర్డ్ ఇయర్. తండ్రి పెద్ద వ్యాపారవేత్త. కూతురికి కాలేజ్‌లో ఎలాంటి ఖర్చులుంటాయోనని డబ్బు ఎక్కువగానే ఇచ్చేవాడు. ఆ డబ్బంతా వెంటవెంటనే ఖర్చయిపోవడం ఆశ్చర్యంగానే ఉండేది పేరెంట్స్‌కి. హాలిడేస్కి రవళి ఇంటికొచ్చింది. మనిషిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. డైలీ రొటీన్‌లోనూ తేడా వచ్చింది. ఎప్పుడూ ఫోన్లోనే ఉంటోంది. ఎవరితోనో వాదన, కోపం, గొడవ పడడం వంటి ఎప్పుడూ లేని లక్షణాలతోపాటు కాళ్లు చేతులు వణకడం కూడా. సైకోసిస్ దశకు చేరింది. అత్యవసరంగా వైద్యుని సంప్రదించారు. బ్లడ్‌టెస్ట్‌లో రవళి కొకైన్, గంజాయి, ఎంబిఎమ్ఎ వంటి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది. ట్రీట్మెంట్కు ఆమె సహకరించే పరిస్థితి లేదు. తనకు ఏ మందులూ అక్కరలేదని చెబుతూ తాను తీసుకునే డ్రగ్స్ పేర్లు చెప్పి వాటిని ఇస్తే తాను మామూలైపోతానని గొడవపడేది. ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి మరికొన్ని పరీక్షలు చేశారు. అందరూ హతాశులయ్యే రిజల్ట్ వచ్చింది. ఆమె రెండవ నెల ప్రెగ్నెంట్. జస్ట్ ఆరు వారాలు. ఆ సంగతి అప్పటికి ఆమెకీ తెలియదు. ఫ్రెండ్స్ ఒత్తిడి వల్లనే డ్రగ్స్ తీసుకున్నానని మాత్రం చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. 'రాజేశ్' పాత అలవాటు రాజేశ్ వయసు 32. పెళ్లయింది. కన్స్ట్రక్షన్ రంగంలో పెద్ద వ్యాపారం. కోట్ల రూపాయల వెంచర్లు. ఆ కుటుంబంలోనే డిప్రెషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి రాజేశ్ డైలీ రొటీన్ మారిపోయింది. కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్లిన వాడు కాస్తా మధ్యాహ్నం మూడింటికే డ్రైవర్‌ను పంపించేసి కారు తీసుకుని వెళ్లిపోయేవాడు. ఆ వెళ్లిన వాడు ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండయ్యేది. ఒక్కోసారి తెల్లవారి మూడు గంటలకు వచ్చేవాడు. ఎర్రబడిన కళ్లు, ఉబ్బిన ముఖంతో వచ్చేవాడు. ఆల్కహాల్ అలవాటైందేమో, నైట్ పార్టీలకెళ్తున్నాడేమోనని సందేహించారు తల్లిదండ్రులు. ఓ రోజు అతడి భార్య తనకేదో అసౌకర్యం అని తోడు రమ్మని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. కౌన్సెలింగ్‌లోనే అతడు ఓపెన్ అయిపోయాడు. మత్తునిచ్చే దగ్గుమందు, నిద్రమాత్రలు, గంజాయి తీసుకుంటున్నట్లు చెప్పాడు. గంజాయి తప్ప మిగిలినవన్నీ మెడికల్ షాపులోనే కొనేవాడు. నిజానికి ఈ అలవాటు అతడికి కాలేజ్ రోజుల్లోనే అయింది. అయితే అదృష్టవశాత్తూ రాజేశ్ తాను మత్తు మందులతో పొందే ఆనందంలోనే ఉండిపోతాననే మొండితనంలో లేడు. ట్రీట్మెంట్తో బాగవ్వాలని ఉందతడికి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి పదిరోజులపాటు దేహాన్ని డీటాక్సిఫికేషన్ చేశారు. కౌన్సెలింగ్‌లు ఇప్పించారు. త్వరగా మామూలయ్యాడు. 'రాకేశ్' అతి గారాబం రాకేశ్ తల్లిదండ్రుల అతి గారంతో జీవితంలో భారీ మూల్యం చెల్లించుకున్న కుర్రాడు. తండ్రి వ్యాపారరీత్యా రోజులో ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. దాంతో రాకేశ్‌కి పదవ తరగతిలోనే సిగరెట్, గుట్కా అలవాటయ్యాయి. ఇంటర్లో గంజాయి తోడైంది. ఇంజనీరింగ్కొచ్చేసరికి గంజాయి మోతాదు పెరిగిపోయింది. ఈ స్థితిలో తొలిసారి గుర్తించింది తల్లే. కానీ అదుపు చేయడం ఆమెకు చేతకాలేదు. రాకేశ్‌కి అవసరానికి మించిన డబ్బు ఇవ్వకుండా టైట్ చేసింది. చివరికి భయపడుతూనే కొడుకు విషయం భర్తకు చెప్పింది. ఆయన షాక్ తిన్నాడు. ట్రీట్మెంట్ మొదలు పెట్టించాడు. కానీ రాకేశ్ డినైల్ స్టేజ్‌లో ఉన్నాడు, విత్‌డ్రాయల్ సింప్టమ్స్ కూడా ఎక్కువగా ఉండేవి. ఆరు నెలలకు మామూలయ్యాడు. కానీ తల్లి పోయింది, చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదు. అది మానేసి ఆర్ట్స్ గ్రూప్ చదువుతానని చేరాడు, దానినీ డిస్కంటిన్యూ చేశాడు. అలా నాలుగైదు కోర్సుల్లో చేరడం, స్థిరత్వం లేక మానేయడంతో తండ్రి ఓ నిర్ణయానికొచ్చాడు. పిల్లవాడు కంటి ముందే ఉంటే మళ్లీ డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో తన వ్యాపారంలోకే తీసుకుని పని నేర్పించాడు. రాకేశ్ ఇప్పుడు పెళ్లి చేసుకుని నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు, కానీ తల్లిని కోల్పోవడం జీవితమంతా బాధించే వేదన. 'రమేశ్' చదువు ఒంటబట్టక రమేశ్‌కు 17 ఏళ్లు. తండ్రి ట్రాలీ డ్రైవర్. చదువు ఒంటబట్టలేదు. ఎనిమిదవ తరగతితో ఆపేశాడు. వీధిలో పిల్లలతో కలిసి గుట్కా, వైటెనర్, గంజాయికి అలవాటు పడ్డాడు. అల్లరి చిల్లరగా మారుతున్నాడని గమనించిన తండ్రి రమేశ్‌ని బ్యాటరీ రీచార్జ్ కంపెనీలో ఉద్యోగంలో పెట్టాడు. తండ్రి చేసిన ఆ పని రమేశ్‌ని కాపాడింది. రమేశ్ పనిలో చురుగ్గా ఉండేవాడు. గంజాయి తీసుకున్నప్పుడు అతడి శక్తికి మించి రెండింతలు పని చేసేవాడు. గంజాయి లేకపోతే రోడ్డు దాటాలన్నా భయమే. స్టూలు ఎక్కి అటక మీదనున్న చిన్న వస్తువు దించాలన్నా భయపడేవాడు. అతడిలో తేడా గమనించిన యజమాని రమేశ్ ఏదో మత్తుమందులు తీసుకుంటుండవచ్చనే సందేహాన్ని వెలిబుచ్చాడు. అయితే ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్పినా రమేశ్ వినేవాడు కాదు. దాంతో యజమాని, కంపెనీ ఉద్యోగులే తొలి కౌన్సెలర్లయ్యారు. అయితే అప్పటికే రమేశ్‌కి ఆకలి పూర్తిగా మందగించింది. గుట్కా వల్ల నోరు పాడైంది. క్యాన్సర్ పేషెంట్లా తయారయ్యాడు. మూడు నెలల ట్రీట్మెంట్తో ఇప్పుడు గంజాయి, గుట్కా, వైటెనర్ వంటివి మానేశాడు. ఆకలి పెరిగింది, ఎనిమిది కిలోల బరువు పెరిగాడు. క్యాన్సర్ లక్షణాల నుంచి బయట పడడానికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. గుర్తించేదెలా? ఎప్పుడూ దిగాలుగా ఉండడం ∙చిన్న విషయానికే కోపం రావడం ∙ఆకలి, బరువు తగ్గిపోవడం ∙వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం ∙కళ్లు ఎర్రగా ఉండడం ∙ఏదైనా ప్రశ్నిస్తే సహించలేకపోవడం∙అబద్ధా్దలాడడం ∙డబ్బు అవసరం పెరగడం ∙స్కూల్/ కాలేజ్‌లో అది కావాలన్నారు ఇది కావాలన్నారంటూ డబ్బు అడగడం ∙కొత్త స్నేహాలు ∙చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లడం ∙గంటలో వస్తానని బయటకు వెళ్లి వెంటనే ఫోన్ స్విచాఫ్ చేయడం ∙బాత్రూమ్ లేదా తమ గదిలో ఎక్కువగా గడపడం ∙చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే పేరెంట్స్‌కి తెలిసిన ఫ్రెండ్స్‌కి దూరంగా మసలడం. బయటపడేసేదెలా? టీనేజ్ పిల్లలున్న పేరెంట్స్ ఈ విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. ∙డ్రగ్స్ ప్రభావంతో పగటి కలలు కంటుంటారు. ఆ కలల నుంచి వారిని బయటకు తేవాలి ∙పేరెంట్స్ పై వ్యతిరేకత ఉంటే దానిని తొలగించాలి.∙ సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇప్పించాలి. ∙సైకియాట్రిస్ట్ దగ్గరకు అనగానే పిల్లలు రావడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మొదట ఫ్యామిలీ కౌన్సెలర్‌ను సంప్రదించాలి. ∙ఇలాంటి పిల్లలకు డ్రగ్స్‌తో వచ్చే నష్టాలను స్నేహపూర్వకంగా వివరిస్తారు. డీటాక్సిఫికేషన్ మెడిసిన్ ఇస్తారు. ∙తీవ్రతను బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. కొందరు నెల రోజుల్లో మామూలవుతారు. ∙కొందరికి ఆరు నెలలు కూడా పట్టవచ్చు. ఇన్పుట్స్: రాజేశ్వరీ లూథర్, డ్రగ్ డీ అడిక్షన్ – రీ హ్యాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్, డా. కల్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ - డా.వై.జయరామిరెడ్డి. టొబాకో కంట్రోలర్ – డీ– అడిక్షన్ స్పెషలిస్ట్, డా.వై.జె.ఆర్. డీ – అడిక్షన్ క్లినిక్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి , (డీ–అడిక్షన్ సెంటర్ల నుంచి సేకరించిన కేస్ స్టడీల ఆధారంగా)