షాక్ మీద షాక్
హైదరాబాద్‌లో పదేళ్ల కిందటే డ్రగ్స్ స్కూల్ కాంపౌండ్‌లోకి అడుగుపెట్టాయి. అంతా అయిపోయాక నెత్తీనోరు కొట్టుకునే బదులు మొదట్లోనే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. డ్రగ్స్ ఎలా మార్కెట్‌లోకి వస్తాయి.. పిల్లలకు ఎలా అలవాటు అవుతాయి లాంటివన్నీ తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ని ఇలాంటి అవేర్‌నెస్‌కు ఉపయోగించుకోవాలి. అన్నిటికన్నా ముందు పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వకూడదు. వాళ్లు ఏది అడిగినా మనమే తెచ్చివ్వాలి తప్ప వాళ్ల చేతికి డబ్బు ఇవ్వకూడదు. అలాగే స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అరాచకశక్తులు ఎలాంటి తినుబండారాలు అమ్మకుండా.. అసలు వాళ్లు ఆ సరౌండింగ్స్‌లోకి అడుగుపెట్టకుండా స్కూల్ మేనేజ్‌మెంట్ తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి. లేకపోతే తల్లిదండ్రులకు కడుపుకోతే! అందుకు నిదర్శనం నవ్రిత్‌కౌర్ అనే తల్లి (పేరు మార్చాం) ఆవేదన. ‘సాక్షి’ ప్రతినిధికి ఆమె చెప్పిన దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆమె మాటల్లోనే చదవండి.
మాది ఉత్తరప్రదేశ్. మావారు మిలిటరీలో పనిచేసి రిటైరయ్యారు. మేము ఇక్కడే హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాకు ట్విన్స్. ఒక పాప, బాబు. మా బాబు మా ఆడపడచు దగ్గర ఢిల్లీలో పెరిగాడు. అక్కడే చదివాడు. పాప మా దగ్గర. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే విషయం పదేళ్ల నాటిది. అప్పుడు నా పిల్లల వయసు పద్నాలుగేళ్లు. పాప సికింద్రాబాద్‌లోని పేరున్న స్కూల్లోనే చదివింది. బాబునూ అంతే. ఢిల్లీలోని పెద్ద స్కూల్లోనే వేశారు. వీళ్లిద్దరూ తొమ్మిదో తరగతిలో ఉన్నారు... మా పాపకు చాకొలెట్స్ అంటే చాలా ఇష్టం. రోజూ స్కూల్‌కి చాక్‌లెట్స్ తీసుకెళ్లేది. ఒకరోజు.. మా పాప ఫ్రెండ్.. ‘ఇండియన్ చాకొలెట్స్ ఏం తింటావ్? మా కజిన్ ఫారిన్ చాకొలెట్స్ తెచ్చిచ్చాడు.. చూడు ఎంత టేస్టీగా ఉన్నాయో!’ అంటూ ఆ చాక్‌లెట్స్ ఇచ్చింది. ఆ రోజు నుంచి వరుసగా వారం రోజుల దాకా రోజుకో చాకొలెట్ ఇచ్చిందట. మా పాపకు బాగా నచ్చాయి. వారం తర్వాత కూడా అవే చాకొలెట్స్ కావాలని పట్టుబట్టింది. వాళ్ల నాన్న తెప్పించాడు. కాని అవి అమ్మాయికి నచ్చలేదు. ‘మా ఫ్రెండ్ దగ్గరున్న చాకొలెట్స్ లాంటివే కావాలని పట్టుబట్టింది.
ఆ ఫ్రెండ్ ఏమో అవి తన దగ్గర అయిపోయాయి. మా కజిన్ అడుగుతాను ఇంకా ఉన్నాయేమో అని అందిట. వాళ్ల కజిన్‌ను అడిగితే.. ‘డబ్బులిస్తే తెప్పిచ్చిస్తా’ అని చెప్పాడట. తన పాకెట్ మనీ ఇచ్చి చాకొలెట్స్ తెప్పించుకుంది. అది ఓ అలవాటుగా మారింది. ఆర్నెల్లు గడిచాయి. ఆ చాకొలెట్స్‌కి ఎంతగా అలవాటు పడిందంటే మా అమ్మాయి.. తిండిలేకపోయినా ఉండేది కాని చాకొలెట్స్ లేకపోతే ఉండేది కాదు. ఆ చాకొలెట్స్ ధర పెరిగిందని పాకెట్ మనీ ఎక్కువ అడిగేది. ఇవ్వకపోతే.. ఆ రోజు చాకొలెట్స్ దొరక్కపోతే.. ఇంట్లో వస్తువులను పగలగొట్టేసేది.. దిండు గలీబులు చించేసేది.. జుట్టు పీక్కునేది.. చివరకు ఎవరు అడ్డు వస్తే వాళ్లను కొట్టడం, రక్కడం కూడా చేసేది. చదువులో కూడా చాలా వెనకబడింది. క్లాస్‌లో ఎప్పుడూ నిద్రపోయే ఉంటోందని కంప్లయింట్స్ రావడం మొదలుపెట్టాయి. తిండి తినడమూ మానేసింది. ఎప్పుడూ నీరసంగా కనిపించేది. ఏమైందోనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. రొటీన్ టెస్ట్‌ల్లో భాగంగా బ్లడ్‌టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు బయటపడింది. కాని అప్పటికే మా చేయి దాటి పోయింది. రెగ్యులర్ కౌన్సిలింగ్ అమ్మాయి విషయంలో పనిచేయలేదు. డీ ఎడిక్షన్ సెంటర్‌లో చేర్పించమని సలహా ఇచ్చారు సన్నిహితులు, ఫ్యామిలీ డాక్టర్. అందుకే ఢిల్లీ తీసుకెళ్లాం పాపను.
మరో షాక్
ఢిల్లీ వెళ్లాక మాకు ఇంకో షాక్. మా పాప విషయం చెప్పగానే మా ఆడపడచు బాబు విషయం చెప్పింది. వాడికి రోజూ మా ఆడపడచు పాకెట్ మనీ కింద పదిరూపాయలు ఇచ్చేది. వాడికి ప్రూట్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ ముందు జామకాయలు, యాపిల్స్ అమ్మడానికి వచ్చేవట. వీడు మామూలుగా యాపిల్‌నే ఇష్టపడేవాడు. కాని ఒకరోజు యాపిల్స్ రాకపోతే జామకాయ కొనుక్కున్నాడట. అంతే ఆ రోజు ప్రతిరోజూ జామకాయే తినడం మొదలుపెట్టాడట. నిజానికి మా అబ్బాయికి జామకాయంటే అంత ఇష్టం ఉండదు. ఒకరోజు.. స్కూల్లో తినడమే కాక ఇంటికి వస్తూ కూడా ఒకటి కొనుక్కొని తీసుకొచ్చి తింటుంటే.. మా ఆడపడచు.. ‘ఒరేయ్.. నీకు జామకాయ ఇష్టం ఉండదు కదా.. అది తింటున్నావేంటి?’ అని అడిగిందట. ‘మా స్కూల్ దగ్గర అమ్మే జామకాయలు చాలా బాగుంటున్నాయ్.. కట్ చేసి సాల్ట్ లాంటిది పెట్టి ఇస్తాడు ఎంత బాగుంటుందో ’ అని చెప్పాడట.
‘అబ్బా.. అయితే రేపు నాకూ ఒకటి పట్రారా..’ అందిట మా ఆడపడచు నవ్వుతూ. సరేనని వాడు తెల్లవారి ఆమె దగ్గర 21 రూపాయలు తీసుకెళ్లి స్కూల్లో ఒకటి, వస్తూ వస్తూ మరో రెండూ జామకా యలు కొనుక్కొని వచ్చాడు. అది తిన్న మా ఆడపడచుకి ఏదో తేడా అనిపించి... ‘ఒరేయ్.. రేపు జామకాయ కోయకుండా ఇవ్వమని చెప్పు’ అందిట. తెల్లవారి జామకాయ లేకుండానే వచ్చాడట మావాడు. ‘ఏరా.. పండు తేలేందేంటి?’ అని అడిగింది ఆమె. ‘‘కోయకుండా, సాల్ట్ చల్లకుండా ఇవ్వరట. అలా కోయకుండా ఇవ్వమన్నందుకు నన్ను తిట్టాడు వాడు.‘ రేపటి నుంచి నీకు జామకాయలు అమ్మను’ అని నాతో దెబ్బలాడాడు’’ అని చెప్పాడట మావాడు బాధగా. దాంతో అందులో వాడు డ్రగ్స్ పౌడర్ చల్లిస్తున్నాడన్న మా ఆడపడచు అనుమానం నిజమే అయిందిట. స్కూల్ మేనేజ్‌మెంట్‌కి కంప్లయింట్ చేసింది. బాబు విషయంలో ఆమె త్వరగా కనిపెట్టింది కాబట్టి వాడు ఎడిక్ట్ అయ్యేదాకా పోలేదు పరిస్థితి. కాని పాప విషయంలో మేం కనిపెట్టలేకపోయాం. అందుకే తను ఎడిక్ట్ అయి డీ ఎడిక్షన్ సెంటర్‌లో చేర్పించాల్సి వచ్చింది. రెండేళ్ల చదువు పోయింది. కాని తర్వాత పరిపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంది. సైకియాట్రిమెడిసిన్ చదువుతోంది.
– శరాది, సాక్షి ప్రతినిధి
మరో ఫ్యామిలీ ఇలా బాధ పడకూడదు!
‘‘డ్రగ్స్‌కు అడిక్ట్ అయి మా అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాక మేము పడిన బాధ ఎవ్వరికీ రాకూడనిది. మరో ఫ్యామిలీ అలా బాధపడకూడదనే నేను ఈ కథను అందరికీ చెబుతున్నా’’ అంటూ లోరా వేన్స్ తన అన్న డేవిడ్ లాహోన్ గురించి చెప్పిన కథ డ్రగ్స్‌కు అడిక్ట్ అయితే ఎన్నెన్ని జీవితాలు కుదేలైపోతాయో చెప్పే మరో పాఠం.2013లో 41 ఏళ్ల డేవిడ్ డ్రగ్స్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. డేవిడ్‌కు ఓ మంచి భర్తగా, తండ్రిగా పేరుంది. తన వాళ్లు అనుకునేవారికి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న డేవిడ్ జీవితంలోకి డ్రగ్స్ రావడం మొత్తాన్నీ మార్చేసింది. ముందు సరదాగానే డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత మెంటల్ ప్రెజర్ అన్న పేరుతో స్థాయి పెంచాడు. ఆ తర్వాత ఒంటి నొప్పులు ఉంటే దానికీ డ్రగ్స్‌నే నమ్ముకున్నాడు. డ్రగ్స్ అతడి జీవితంలోకి పూర్తిగా వచ్చేశాయి. ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. బతుకు మీద ఆసక్తి తగ్గింది. కుటుంబం గుర్తు రాలేదు. ఎవ్వరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. డేవిడ్ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో కళ పోయింది. పిల్లలు అనాథలయ్యారు. లోరాకు అన్నయ్య అనే ఓ అండ లేకుండా పోయింది.
‘‘డేవిడ్ జీవితంలోకి డ్రగ్స్ వచ్చిన విషయం మాకెవ్వరికీ తెలియలేదు. కానీ ఏదో విషయాన్ని పట్టుకొని బాధపడుతున్నాడని మాత్రం అర్థమయ్యేది. ముఖమంతా పేలిపోయినట్లు కనిపించేది. ఏ విషయమ్మీదా ఆసక్తి చూపేవాడు కాదు. అప్పుడే కాస్త ఆలోచించి ఉంటే మాకు దక్కేవాడేమో! డేవిడ్ బ్యాంక్ స్టేట్‌మెంట్ తీస్తే ఒక్కోరోజు 800 డాలర్ల వరకూ తీశాడని తెలిసింది. అతడి జీవితంలో ఇంత జరుగుతున్నా మాకేదీ తెలియలేదు. మా అన్నలా ఇంకెవరి జీవితం కావొద్దన్నదే నేను కోరుకునేది. మమ్మల్ని చూసైనా ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు మారతారనే నేనిది చెప్తున్నా’’
– లోరా
డ్రగ్స్... నా కొడుకు ప్రాణం తీశాయి!
అది డిసెంబర్ 12, 2016. అమెరికాలోని నోర్వాక్ కమ్యూనిటీ ప్రాంతంలో జోవొన్ మార్కీ బ్రౌన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడొక డ్రగ్ అడిక్ట్. చనిపోయిన నాటికి అతడి వయస్సు 24 సంవత్సరాలు. జొవొన్ చిన్నప్పట్నుంచే అన్నింట్లో ముందుండేవాడు. స్కూల్లో ఏ టీచర్‌ను పట్టుకొని అడిగినా జొవొన్ బెస్ట్ స్టూడెంట్ అని చెబుతూ ఉంటారు. అందంగా ఉంటాడు. అందంగా నవ్వుతాడు. స్కూల్లో బెస్ట్ స్మైల్ అవార్డు కూడా వచ్చింది అతడికి. 18 ఏళ్లు వచ్చేవరకూ జొవొన్ జీవితమంతా అద్భుతంగా గడిచింది. అప్పుడే డ్రగ్స్ పరిచయమయ్యాయి. మెల్లిగా దానికి బానిస అయిపోయాడు. 22 ఏళ్లు వచ్చేసరికి అతడి జీవితమంతా తల్లకిందులైంది.
డ్రగ్స్ లేకుంటే బతకలేని స్థితికి చేరిపోయాడు. రెండు సంవత్సరాలు నరకం చూశాడు. 24 ఏళ్లు వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే రోజు జొవొన్ రాసిన ఓ లెటర్‌ను జొవొన్ తల్లి లిండా స్టబ్స్ రోజూ చదువుతూ ఉంది. ‘‘డ్రగ్స్ పరిచయం కాకముందు నా లైఫ్ అద్భుతంగా ఉండింది. మంచి కారు, మంచి ఉద్యోగం, నన్నెంతో ఇష్టపడే గర్ల్‌ఫ్రెండ్. ఇప్పుడు మొత్తం కోల్పోయా. నాకింక మిగిలిందేమీ లేదనిపిస్తోంది.’’ కొడుకు రాసిన ఉత్తరంలోని ఈ వాక్యాలు చదివినప్పుడల్లా తన కష్టం ఏ తల్లికీ రాకూడదని కోరుకుంటోంది లిండా స్టబ్స్.‘‘నేనొక డ్రగ్ అడిక్ట్ తల్లిని. రోజూ నేను ఆ దేవుడ్ని కోరుకునేది ఒక్కటే.. మార్పు త్వరలోనే రావాలని’’
– లిండా రాసిన ఓ కవితలోని చివరి లైన్
డ్రగ్స్‌కి విరుగుడు ప్రేమ
అది 2015. పంజాబ్‌లోని టరంటరన్ ప్రాంతానికి చెందిన రాహుల్ (పేరు మార్చాం) అనే ఓ యువకుడు రాయ్‌కోట్‌లోని డ్రగ్ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. రాహుల్‌తో అక్కడి డాక్టర్లు రోజూ డైరీ రాయిస్తూ ఉంటారు. ఆ డైరీలో, ‘‘నాన్నా! నన్ను క్షమించు. నేను నిన్ను ఎంతగానో తిట్టా. అయినా నువ్వు నాకు ఇంకో జీవితాన్ని ఇస్తున్నావు. థ్యాంక్ గాడ్! నువ్వున్నావ్. నువ్వు ఉండడం వల్లే నేను బతికున్నా’’ అని రాస్తున్నాడు రాహుల్. అతడు అప్పుడు తనని తాను అర్థం చేసుకున్న మనిషి. ఈ రోజుకి పూర్తిగా మారిన మనిషి.
11 ఏళ్ల వయసున్నప్పుడు రాహుల్ తండ్రితో కలసి తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్ ఒత్తిడి చేస్తే మందు కొట్టాడు. మెల్లిగా అది అలవాటు అయిపోయింది. పద్నాలుగేళ్లు ఉన్నప్పుడు స్కూల్‌లోకి తాగొచ్చి మరీ గొడవ చేశాడు.
ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. గంజాయి పరిచయం అయింది. హెరాయిన్ అనే డ్రగ్ ఒకటి పరిచయం అయింది. ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతూ వస్తోంది. దేనిమీదా దృష్టి ఉండడం లేదు. ఓ రోజు తండ్రితో కలసి పొలంలో పనిచేస్తున్నాడు. అప్పటికే పూర్తిగా మత్తులో ఉన్నాడు. గడ్డికోసే యంత్రంలో రాహుల్ చెయ్యి పడి తెగింది. ఆసుపత్రికి తీసుకెళ్తే బయటపడిందిదీ.. రాహుల్ ఒక డ్రగ్ అడిక్ట్‌గా మారిపోయాడని! కొడుక్కి నయమవ్వాలని ఏడ్చాడు. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించాడు. రాహుల్ ఇప్పుడు మళ్లీ తన పని తాను చేసుకుంటూ, ఓ కొత్త జీవితం మొదలుపెట్టాడు.‘‘డ్రగ్స్‌కు అలవాటయ్యే రోజుల్లో నాకేదీ తెలిసేది కాదు. సరదాకే మొదలుపెట్టింది నా చావు దాకా వచ్చింది. నాన్నే లేకుంటే బతికేవాణ్ణి కాదు. అదొక మాయలా కనిపించింది. నాలా ఆ మాయలో పడొద్దనే అందరికీ చెబుతుంటా.’’ అంటున్నాడు రాహుల్. ‘‘డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న వారిని డ్రగ్స్‌కు దూరం చేయాలంటే వారికి చూపించాల్సింది ప్రేమొక్కటే! వాళ్లకు ప్రేమ కావాలి.. డ్రగ్స్ కాదు.’’
– డాక్టర్ మధుమిత బెనర్జీ, రాహుల్‌కు చికిత్సను అందించిన డాక్టర్
మారాలన్న పట్టుదలే మార్చింది!
అహ్మద్ హుస్సేన్ ముంబైలోని మున్సిపల్ స్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తనతోపాటు తల్లి, అక్క, తమ్ముడు ఉన్న ఇంటిని అహ్మద్ పోషించాల్సిన సమయమది. కానీ అతడికి తండ్రిపై కోపమొచ్చింది. మందుకు అలవాటుపడ్డాడు. సిగరెట్‌కు బానిస అయ్యాడు. తనలా అల్లరి చిల్లరిగా తిరిగే ఫ్రెండ్స్‌తో ఒక గ్రూప్ ఏర్పరచుకున్నాడు. డ్రగ్స్ పరిచయమయ్యాయి. మొదట్లో ఫ్రెండ్స్ ఫ్రీగానే డ్రగ్స్ అందించేవారు. రాను రాను దానికి డబ్బులు అవసరమయ్యాయి. అందుకోసం దొంగతనం మొదలుపెట్టాడు. మోసాలు నేర్చుకున్నాడు. ఏం చేసినా డబ్బు సంపాదించడం ఒక్కటే పని. ఆ డబ్బుతో డ్రగ్స్ కొనాలి. కొన్నాళ్లకు అహ్మద్ పూర్తిగా డ్రగ్స్ ఉచ్చులో కూరుకుపోయాడు. బయటకొచ్చే దారేదీ కనిపించలేదు. మరోపక్క ప్రేమ విఫలమైంది. ఇక ఆత్మహత్య ఒక్కటే మిగిలిందని అనుకున్నాడు.
అదే సమయంలో ముంబై సెంట్రల్ డ్రాప్ ఇన్ సెంటర్‌లో డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడిన వ్యక్తి ఒకతను పరిచయమయ్యాడు. తనూ అలా మారగలడన్న నమ్మకాన్ని తెచ్చుకున్నాడు అహ్మద్. మొదట్లో కష్టమైనా మెల్లిగా డ్రగ్స్ ఆలోచనను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు అహ్మద్ డ్రగ్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఓ కొత్త జీవితం మొదలుపెట్టాడు. కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు. చిన్న ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అతడిప్పుడు మారిన మనిషి. ‘‘మారాలన్న నా ఆలోచనే నన్ను ఇప్పుడిలా మార్చేసింది. చెల్లి, అమ్మతో మాట్లాడాలని ఉంది. అమ్మకు నాపై కోపం ఉంది. అయినా నేను మళ్లీ వాళ్లకు దగ్గరవుతానన్న నమ్మకం ఉంది’’
– అహ్మద్
– వి. మల్లికార్జున్