మీ పిల్లలేం చేస్తున్నారో మీకు తెలుసా? | Do you know what your child is doing? | Sakshi
Sakshi News home page

మీ పిల్లలేం చేస్తున్నారో మీకు తెలుసా?

Published Mon, Jul 24 2017 10:50 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

మీ పిల్లలేం చేస్తున్నారో మీకు  తెలుసా? - Sakshi

మీ పిల్లలేం చేస్తున్నారో మీకు తెలుసా?

అవును... మీ పిల్లలేం చేస్తున్నారు?
వాళ్ల పాకెట్‌ మనీతో ఏం చేస్తున్నారు?
వాళ్ల ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నారు?
వాళ్ల టైంతో ఏం చేస్తున్నారు?
కనిపెట్టండి. మీరు మంచి పేరెంట్స్‌.
మీ పేరెంటింగ్‌ మంచిదే!
కానీ, అది సరిపోదేమో!
మీ మంచి వలయాన్ని
ఛేదించుకుని డ్రగ్స్‌ రావచ్చు. జాగ్రత్త!
పిల్లల్ని కనిపెట్టుకుని ఉండండి.


పేరెంట్స్‌కి ఇప్పుడు డ్రగ్స్‌ భయం పట్టుకుంది! పిల్లల జీవితాలను కబళిస్తున్న డ్రగ్స్‌ వ్యసనం.. అసలు ఎలా మొదలౌతుందనే విషయమై తల్లిదండ్రులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలకు సమాధానంగా సాక్షి ‘ఫ్యామిలీ’ కొన్ని కేస్‌ స్టడీస్‌ సంపాదించింది.   

'వినీత' అసలు పట్టించుకోనందుకు
వినీతకు 19 ఏళ్లు. ఎప్పుడూ మూడీగా ఉంటోంది. ఒక్కో రోజు  చేతికి అందిన వస్తువుని నేలకేసి కొడుతోంది. ఆమె ప్రవర్తనలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తండ్రికి పట్టించుకునే తీరిక లేదు, తల్లికీ లేదు. ఓ రోజు వాళ్లింటికి వచ్చిన చిన్నాన్న ఆమెను డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌కు తీసుకెళ్లాడు. వినీతతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అక్కడివాళ్లు నిర్ధారణకు వచ్చేశారు.. ఆమెకు డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటైందని. ఇంటి వాతావరణం గురించి వివరాల్లోకి వెళ్లారు కౌన్సెలర్‌. వినీత తండ్రి ఆల్కహాలిక్, వివాహేతర సంబంధాలూ ఉన్నాయి. ఓ రోజు తండ్రి మరో మహిళతో గదిలో ఉండడం చూసి వినీత షాక్‌ అయింది! ఆమెకు ఒకటి అర్థమైంది. తల్లి,  తండ్రి ఒక కప్పు కింద మాత్రమే ఉన్నారు. ఎవరి జీవితం వారిది. డబ్బుకు ఇబ్బంది లేదు. తన గురించి పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలన్న ధ్యాస ఆ ఇద్దరిలోనూ లేవు. ఇంట్లో దేనికీ కొదవ ఉన్నట్లు కనిపించదు కానీ మనుషుల మధ్య ఉండాల్సిన బంధమే కొరవడింది. దాంతో వినీతకు డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటైంది.

'వరుణ్‌' అతిగా పట్టించుకున్నందుకు
వరుణ్‌ అమ్మానాన్న ఇద్దరూ జిల్లా స్థాయి అధికారులు. ఇద్దరూ కెరీర్‌ ఓరియెంటెండ్‌ పీపుల్‌. వరుణ్‌ ఉదయం స్కూలుకి వెళ్తాడు. స్కూలు నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్‌ ఉంటుంది. మాస్టారు ఇంటికే వచ్చి పాఠాలు చెప్తారు. ఆయన వెళ్లాక హోమ్‌వర్క్‌. అది పూర్తయ్యేసరికి తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. ఆ రోజు ఏమేమి చేసిందీ తెలుసుకుంటారు. పిల్లవాడి పెర్‌ఫార్మెన్స్‌ తగ్గకుండా మానిటర్‌ చేస్తూ ఉంటారు. అలాంటి వాతావరణంలోనూ వరుణ్‌ గంజాయికి బానిసయ్యాడు! ‘‘పేరెంట్స్‌గా మేమెంత బిజీగా ఉన్నా పిల్లల గురించి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఇంతగా పర్యవేక్షిస్తున్నా పిల్లలు వ్యసనాల బారిన పడతారా?’’ ఇదీ కౌన్సెలర్‌ దగ్గర వరుణ్‌ తల్లిదండ్రులు వెలిబుచ్చిన సందేహం. నిజమే! వరుణ్‌ని సివిల్స్‌ ర్యాంకర్‌గా చూడడానికి, తమలాగే ఉన్నతమైన హోదాలో నిలపడానికి చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. అయితే ఇరవై నాలుగ్గంటల్లో తనకు ఇష్టమైన సమయం, తాను ఇష్టంగా గడిపే ఒక గంట ఏది అనడిగితే పేరెంట్స్‌ ముఖముఖాలు చూసుకున్నారు! నో ఆన్సర్‌ .

'కార్తీక్‌' కొత్త కొత్త స్నేహాలు
కార్తీక్‌ది సూర్యాపేట. ఇంజనీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌. అప్పటి వరకు అందరిలాగానే మంచబ్బాయే. క్రమంగా కొత్త స్నేహితులు పరిచయం కాసాగారు. ఎప్పుడూ కాలనీలో కనిపించని కుర్రాళ్లు కొందరు కార్తీక్‌తో కనిపించేవారు. వాళ్లంతా బాహాటంగానే సిగరెట్‌ కాల్చేవాళ్లు. పేరెంట్స్‌ సిగరెట్‌ గురించి కోప్పడ్డారు. తర్వాత తేలిగ్గా తీసుకున్నారు. కొన్నాళ్లకు సిగరెట్‌ మాత్రమే కాక మరేదో అందుతోందనే అనుమానం వచ్చి, కార్తీక్‌ సిగరెట్‌లను విప్పి చూశారు, గంజాయి పొడి. ఈ కండిషన్‌లో ఉన్న పిల్లవాడిని మామూలు స్థితికి తీసుకురావడానికి కౌన్సెలింగే మార్గమని ఓరోజు ఫ్యామిలీ కౌన్సెలర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. కార్తీక్‌ అప్పటికే చదువులో వెనుకపడ్డాడు. కారణాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు, వాళ్లకు ఒకరి మీద ఒకరికి అనుమానం, ఇంట్లో ఎప్పుడూ హ్యాపీ ఎట్మాస్ఫియర్‌ లేదన్నాడు. ఆ స్థితిలో ఉన్న పిల్లలు చెప్పుడు మాటలకు బొమ్మల్లా తలలూపుతారు. తొలిదశలోనే తెలుసుకోవడంతో మందుల అవసరం లేకనే కౌన్సెలింగ్‌తో దారికొచ్చాడు కార్తీక్‌. త్వరగానే పిల్లవాడు గాడిలో పడ్డాడు.

'రవళి' పుష్కలంగా డబ్బు!
రవళి మణిపాల్‌లో ఎంబిబిఎస్‌ థర్డ్‌ ఇయర్‌. తండ్రి పెద్ద వ్యాపారవేత్త. కూతురికి కాలేజ్‌లో ఎలాంటి ఖర్చులుంటాయోనని డబ్బు ఎక్కువగానే ఇచ్చేవాడు. ఆ డబ్బంతా వెంటవెంటనే ఖర్చయిపోవడం ఆశ్చర్యంగానే ఉండేది పేరెంట్స్‌కి. హాలిడేస్‌కి రవళి ఇంటికొచ్చింది. మనిషిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. డైలీ రొటీన్‌లోనూ తేడా వచ్చింది. ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటోంది. ఎవరితోనో వాదన, కోపం, గొడవ పడడం వంటి ఎప్పుడూ లేని లక్షణాలతోపాటు కాళ్లు చేతులు వణకడం కూడా. సైకోసిస్‌ దశకు చేరింది. అత్యవసరంగా వైద్యుని సంప్రదించారు. బ్లడ్‌టెస్ట్‌లో రవళి కొకైన్, గంజాయి, ఎంబిఎమ్‌ఎ వంటి డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది. ట్రీట్‌మెంట్‌కు ఆమె సహకరించే పరిస్థితి లేదు. తనకు ఏ మందులూ అక్కరలేదని చెబుతూ తాను తీసుకునే డ్రగ్స్‌ పేర్లు చెప్పి వాటిని ఇస్తే తాను మామూలైపోతానని గొడవపడేది. ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టడానికి మరికొన్ని పరీక్షలు చేశారు. అందరూ హతాశులయ్యే రిజల్ట్‌ వచ్చింది. ఆమె రెండవ నెల ప్రెగ్నెంట్‌. జస్ట్‌ ఆరు వారాలు. ఆ సంగతి అప్పటికి ఆమెకీ తెలియదు. ఫ్రెండ్స్‌ ఒత్తిడి వల్లనే డ్రగ్స్‌ తీసుకున్నానని మాత్రం చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.

'రాజేశ్‌'  పాత అలవాటు
రాజేశ్‌ వయసు 32. పెళ్లయింది. కన్‌స్ట్రక్షన్‌ రంగంలో పెద్ద వ్యాపారం. కోట్ల రూపాయల వెంచర్‌లు. ఆ కుటుంబంలోనే డిప్రెషన్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి రాజేశ్‌ డైలీ రొటీన్‌ మారిపోయింది.  కన్‌స్ట్రక్షన్‌ దగ్గరకు వెళ్లిన వాడు కాస్తా మధ్యాహ్నం మూడింటికే డ్రైవర్‌ను పంపించేసి కారు తీసుకుని వెళ్లిపోయేవాడు. ఆ వెళ్లిన వాడు ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండయ్యేది. ఒక్కోసారి తెల్లవారి మూడు గంటలకు వచ్చేవాడు. ఎర్రబడిన కళ్లు, ఉబ్బిన ముఖంతో వచ్చేవాడు. ఆల్కహాల్‌ అలవాటైందేమో, నైట్‌ పార్టీలకెళ్తున్నాడేమోనని సందేహించారు తల్లిదండ్రులు.

ఓ రోజు అతడి భార్య తనకేదో అసౌకర్యం అని తోడు రమ్మని చెప్పి డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లింది. కౌన్సెలింగ్‌లోనే అతడు ఓపెన్‌ అయిపోయాడు. మత్తునిచ్చే దగ్గుమందు, నిద్రమాత్రలు, గంజాయి తీసుకుంటున్నట్లు చెప్పాడు. గంజాయి తప్ప మిగిలినవన్నీ మెడికల్‌ షాపులోనే కొనేవాడు. నిజానికి ఈ అలవాటు అతడికి కాలేజ్‌ రోజుల్లోనే అయింది. అయితే అదృష్టవశాత్తూ రాజేశ్‌ తాను మత్తు మందులతో పొందే ఆనందంలోనే ఉండిపోతాననే మొండితనంలో లేడు. ట్రీట్‌మెంట్‌తో బాగవ్వాలని ఉందతడికి. వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసి పదిరోజులపాటు దేహాన్ని డీటాక్సిఫికేషన్‌ చేశారు. కౌన్సెలింగ్‌లు ఇప్పించారు. త్వరగా మామూలయ్యాడు.

'రాకేశ్‌' అతి గారాబం
రాకేశ్‌ తల్లిదండ్రుల అతి గారంతో జీవితంలో భారీ మూల్యం చెల్లించుకున్న కుర్రాడు. తండ్రి వ్యాపారరీత్యా  రోజులో ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. దాంతో రాకేశ్‌కి పదవ తరగతిలోనే సిగరెట్, గుట్కా అలవాటయ్యాయి. ఇంటర్‌లో గంజాయి తోడైంది. ఇంజనీరింగ్‌కొచ్చేసరికి గంజాయి మోతాదు పెరిగిపోయింది. ఈ స్థితిలో తొలిసారి గుర్తించింది తల్లే. కానీ అదుపు చేయడం ఆమెకు చేతకాలేదు. రాకేశ్‌కి అవసరానికి మించిన డబ్బు ఇవ్వకుండా టైట్‌  చేసింది. చివరికి  భయపడుతూనే కొడుకు విషయం భర్తకు చెప్పింది. ఆయన షాక్‌ తిన్నాడు. ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టించాడు. కానీ రాకేశ్‌ డినైల్‌ స్టేజ్‌లో ఉన్నాడు, విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ కూడా ఎక్కువగా ఉండేవి. ఆరు నెలలకు మామూలయ్యాడు. కానీ తల్లి పోయింది, చేతిలో ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదు. అది మానేసి ఆర్ట్స్‌ గ్రూప్‌ చదువుతానని చేరాడు, దానినీ డిస్‌కంటిన్యూ చేశాడు. అలా నాలుగైదు కోర్సుల్లో చేరడం, స్థిరత్వం లేక మానేయడంతో తండ్రి ఓ నిర్ణయానికొచ్చాడు. పిల్లవాడు కంటి ముందే ఉంటే మళ్లీ డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో తన వ్యాపారంలోకే తీసుకుని పని నేర్పించాడు. రాకేశ్‌ ఇప్పుడు పెళ్లి చేసుకుని నార్మల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నాడు, కానీ తల్లిని కోల్పోవడం జీవితమంతా బాధించే వేదన.

'రమేశ్‌' చదువు ఒంటబట్టక
రమేశ్‌కు 17 ఏళ్లు. తండ్రి ట్రాలీ డ్రైవర్‌. చదువు ఒంటబట్టలేదు. ఎనిమిదవ తరగతితో ఆపేశాడు. వీధిలో పిల్లలతో కలిసి గుట్కా, వైటెనర్, గంజాయికి అలవాటు పడ్డాడు. అల్లరి చిల్లరగా మారుతున్నాడని గమనించిన తండ్రి రమేశ్‌ని బ్యాటరీ రీచార్జ్‌ కంపెనీలో ఉద్యోగంలో పెట్టాడు. తండ్రి చేసిన ఆ పని రమేశ్‌ని కాపాడింది. రమేశ్‌ పనిలో చురుగ్గా ఉండేవాడు. గంజాయి తీసుకున్నప్పుడు అతడి శక్తికి మించి రెండింతలు పని చేసేవాడు. గంజాయి లేకపోతే రోడ్డు దాటాలన్నా భయమే. స్టూలు ఎక్కి అటక మీదనున్న చిన్న వస్తువు దించాలన్నా భయపడేవాడు. అతడిలో తేడా గమనించిన యజమాని రమేశ్‌ ఏదో మత్తుమందులు తీసుకుంటుండవచ్చనే సందేహాన్ని వెలిబుచ్చాడు. అయితే ఇంట్లో పేరెంట్స్‌ ఏం చెప్పినా రమేశ్‌ వినేవాడు కాదు. దాంతో యజమాని, కంపెనీ ఉద్యోగులే తొలి కౌన్సెలర్‌లయ్యారు. అయితే అప్పటికే రమేశ్‌కి ఆకలి పూర్తిగా మందగించింది. గుట్కా వల్ల నోరు పాడైంది. క్యాన్సర్‌ పేషెంట్‌లా తయారయ్యాడు. మూడు నెలల ట్రీట్‌మెంట్‌తో ఇప్పుడు గంజాయి, గుట్కా, వైటెనర్‌ వంటివి మానేశాడు. ఆకలి పెరిగింది, ఎనిమిది కిలోల బరువు పెరిగాడు. క్యాన్సర్‌ లక్షణాల నుంచి బయట పడడానికి ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది.

గుర్తించేదెలా?
ఎప్పుడూ దిగాలుగా ఉండడం ∙చిన్న విషయానికే కోపం రావడం ∙ఆకలి, బరువు తగ్గిపోవడం ∙వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం ∙కళ్లు ఎర్రగా ఉండడం ∙ఏదైనా ప్రశ్నిస్తే సహించలేకపోవడం∙అబద్ధా్దలాడడం ∙డబ్బు అవసరం పెరగడం ∙స్కూల్‌/ కాలేజ్‌లో అది కావాలన్నారు ఇది కావాలన్నారంటూ డబ్బు అడగడం ∙కొత్త స్నేహాలు ∙చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లడం ∙గంటలో వస్తానని బయటకు వెళ్లి వెంటనే ఫోన్‌ స్విచాఫ్‌ చేయడం ∙బాత్‌రూమ్‌ లేదా తమ గదిలో ఎక్కువగా గడపడం ∙చిన్నప్పటి ఫ్రెండ్స్‌ అంటే పేరెంట్స్‌కి తెలిసిన ఫ్రెండ్స్‌కి దూరంగా మసలడం.

బయటపడేసేదెలా?
టీనేజ్‌ పిల్లలున్న పేరెంట్స్‌ ఈ విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. ∙డ్రగ్స్‌ ప్రభావంతో పగటి కలలు కంటుంటారు. ఆ కలల నుంచి వారిని బయటకు తేవాలి ∙పేరెంట్స్‌ పై వ్యతిరేకత ఉంటే దానిని తొలగించాలి.∙ సైకియాట్రిస్ట్‌ లేదా సైకాలజిస్ట్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. ∙సైకియాట్రిస్ట్‌ దగ్గరకు అనగానే పిల్లలు రావడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మొదట ఫ్యామిలీ కౌన్సెలర్‌ను సంప్రదించాలి. ∙ఇలాంటి పిల్లలకు డ్రగ్స్‌తో వచ్చే నష్టాలను స్నేహపూర్వకంగా వివరిస్తారు. డీటాక్సిఫికేషన్‌ మెడిసిన్‌ ఇస్తారు. ∙తీవ్రతను బట్టి సిట్టింగ్స్‌ ఉంటాయి. కొందరు నెల రోజుల్లో మామూలవుతారు. ∙కొందరికి ఆరు నెలలు కూడా పట్టవచ్చు.

ఇన్‌పుట్స్‌: రాజేశ్వరీ లూథర్, డ్రగ్‌ డీ అడిక్షన్‌ – రీ హ్యాబిలిటేషన్‌ సెంటర్‌ హైదరాబాద్, డా. కల్యాణ్‌ చక్రవర్తి, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌

- డా.వై.జయరామిరెడ్డి. టొబాకో కంట్రోలర్‌ – డీ– అడిక్షన్‌ స్పెషలిస్ట్, డా.వై.జె.ఆర్‌. డీ – అడిక్షన్‌ క్లినిక్, హైదరాబాద్‌
– వాకా మంజులారెడ్డి , (డీ–అడిక్షన్‌ సెంటర్‌ల నుంచి సేకరించిన కేస్‌ స్టడీల ఆధారంగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement