మల్టీటాస్కింగ్‌ బొటాక్స్‌... | Multi-tasking botaks ... | Sakshi
Sakshi News home page

మల్టీటాస్కింగ్‌ బొటాక్స్‌...

Published Thu, Jan 26 2017 12:20 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

మల్టీటాస్కింగ్‌ బొటాక్స్‌... - Sakshi

మల్టీటాస్కింగ్‌ బొటాక్స్‌...

ఒక మందు ఎన్నో వ్యాధులకు చికిత్సగా మారింది. ఒకప్పుడు అందానికి వాడే కాస్మటిక్‌ డ్రగ్‌గా వీరవిహారం చేసిన బొటాక్స్‌... ఇప్పుడు మల్టీటాస్కింగ్‌ చేస్తూ ఆరోగ్యానికి సంజీవని అయ్యింది. పాము కాటుకు పాము విషమే పనిచేసినట్టు ఎన్నో వ్యాధులకు ఈ విషం
అమృతంలా పనిచేస్తోంది.

బొటాక్స్‌ కేవలం ముఖం మీద ముడుతలను తగ్గించడానికి పనికి వస్తుందనే మాట ఒకనాటి మాట. ఇప్పుడు అది మైగ్రేన్, డిప్రెషన్, కళ్లు పదే పదే చికిలించడం, మాటిమాటికీ మూత్రం వస్తుండటం, కాళ్లు చేతులకు అతిగా చెమటలు పట్టడం... ఇలాంటి ఎన్నో సమస్యలకు దివ్యౌషధం అయ్యింది. నమ్మశక్యం కాని విధంగా  ఎన్నెన్నో సమస్యలకు బొటాక్స్‌ పరిష్కారమవుతోంది. అది ఎలాగో చూద్దాం రండి.
తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాడొక పేషెంట్‌. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు అతడి మాటిమాటికీ వస్తోంది. అలా అతడు ఆ ధోరణిలో ఉండటం మొదటిసారి కాదు. ఎన్నో డోసుల యాంటీడిప్రెసెంట్‌ మందులు అతడి విషయంలో పనిచేయలేదు. ఇక  ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ నార్మన్‌ రోసెంథెల్‌కు విభిన్నంగా ఓ ప్రయత్నం చేద్దామని అనిపించింది. ‘‘బొటాక్స్‌ ఇచ్చి చూద్దాం’’ అన్నారు డాక్టర్‌ నార్మన్‌.
ఇది ఒక చిత్రమైన ఆలోచన. జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ నార్మన్‌ రోసెంథెల్, జార్డ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన సైకియాట్రీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎరిక్‌ ఫింజీ 2014లో ఒక అధ్యయన ఫలితాలను వెలువరిచారు. ఆ అధ్యయన సారాంశం చాలా విచిత్రంగా ఉంది.

కొందరు రోగుల విషయంలో రోగులకు భరోసా కలిగించేందు ఉత్తుత్తి మందు వాడతారు. ఈ ఉత్తుత్తి మందును ‘ప్లాసెబో’ అంటారు. దీని వల్ల ఏదైనా ఫలితం కనిపిస్తే దాన్ని ప్లాసెబో ఎఫెక్ట్‌ అని చెబుతారు. ఏదో మందు వాడామంటూ రోగులకు భరోసా ఇచ్చేందుకు ఉపయోగించే మందుకాని మందూ, ఉత్తుత్తి మందూ అయిన ప్లాసెబోను తీసుకున్న వారి కంటే ... బొటాక్స్‌ ఇంజెక్షన్‌పై ఉంచిన రోగుల్లో డిప్రెషన్‌ లక్షణాలు గణనీయంగా తగ్గాయి. అదీ ఆరు వారాల్లో! ‘‘ఇది చాలా అసాధారణం. డిప్రెషన్‌కు బొటాక్స్‌ పనిచేస్తుంది. కానీ ఇంకా ఇది ప్రధాన (మెయిన్‌ స్ట్రీమ్‌) చికిత్స మాత్రం కాదు’’ అంటారు నార్మన్‌. పైగా ఔషధాల వాడకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే  యూఎస్‌ ఫుండ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) దీన్ని ఆమోదించలేదు. అయితే ఇలాంటి లేబుల్‌ చేయని మందులను అత్యున్నత పరిశోధన స్థాయి సంస్థల్లో  కేవలం  ప్రయోగాత్మకంగా వాడటం కాస్త అసాధారణంగా జరిగేదే అయినా అసాధ్యమేమీ కాదు. కానీ ఒకసారి గనక ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే ప్రతి లైసెన్స్‌డ్‌ ప్రాక్టీషనర్‌ దాన్ని ఇక అవసరం ఉన్నా లేకపోయినా వాడేస్తూ ఉంటాడు. ఇలాంటి ఆఫ్‌ లేబుల్‌ (అంటే ప్రిస్క్రయిబ్‌ చేయడానికి ఇంకా అనుమతించని) మందుతో ఈ ప్రయోజనం ఉందని తెలిసింది. కేవలం దీన్ని ప్రయోగాత్మకమైన దశలోనే ఉంది. మరిన్ని అధ్యనాయనాలు ఇంకా చేయాల్సి ఉంది. నిజానికి దాన్ని ప్రధానంగా నరాలకు సంబంధించిన చికిత్సల పాటు ముఖంపై ముడుతలను తగ్గించడానికి కాస్మటిక్‌ ప్రయోజనం కోసం ఉపయోగిస్తుంటారు. అది డిప్రెషన్‌కూ పనిచేసినట్లు తేలింది.

మరెన్నో రకాల సమస్యలకూ...
కేవలం డిప్రెషన్‌ను తగ్గించడం కోసమే కాదు... ఇంకా 793 రకాల జబ్బులకు బొటాక్స్‌తో చికిత్స సాధ్యమవుతోంది. అరచేతులూ, అరికాళ్లూ బాగా తడిసిపోయినట్లుగా చెమటలు పట్టే వారిలో చెమటలు తగ్గించడం కోసం, మైగ్రేన్‌కు చికిత్సగానూ, మెడ ఇరుకుపట్టేసినప్పుడు (నెక్‌ స్పాజమ్స్‌) దాన్ని వదిలించడానికీ బొటాక్స్‌ ఉపయోగపడుతోంది. అంతేకాదు... గుండె లయ సరిగా లేనివారిలో (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ / అరిథ్మియా కండిషన్స్‌లో) దాన్ని సరిచేయడానికి గుండెకు శస్త్రచికిత్స చేశాక కలిగే గుండెసంబంధిత ప్రమాదాల నివారణ కోసమూ బొటాక్స్‌ను ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. ఇవన్నీ స్పష్టంగా నిరూపితమై ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే... ఇక మందుల్లో అదో బ్లాక్‌బస్టర్‌ ఔషధంగా నిలుస్తుంది.

బొటాక్స్‌ అంటే...
బొటాక్స్‌ అంటే క్లాస్ట్రీడియమ్‌ బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా నుంచి లభ్యమయ్యే ఒక విషం. ఈ గరళం నరాల మీద పనిచేస్తుంది. ఇలా నరాల మీద పనిచేసే విషాలను న్యూరోటాక్సిన్స్‌ అంటారు. ఒకవేళ ఈ విషంతో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటే దానివల్ల పక్షవాతం వచ్చినట్లుగా మన ప్రధాన కండరాలన్నీ చచ్చుబడిపోతాయి. ఒక్కోసారి మరణం సైతం సంభవించవచ్చు. కొన్ని దేశాలు రసాయన యుద్ధం కోసం దీన్ని నిల్వ చేసుకున్నట్లు కొన్ని దృష్టాంతాలు లభ్యమయ్యాయి. అంతటి ప్రమాదకరమైనదీ విషం. ముడుతల ఉన్న చోట శరీరానికి అనుసంధానితమైన ఉన్న కండరాలకు దీన్ని ఇచ్చినప్పుడు నరాల నుంచి వచ్చే సిగ్నళ్లకు ఈ విషం అడ్డంకిగా నిలుస్తుంది. దాంతో ఆ ముడుతలు తెరచుకుంటాయి. అలా ఇది ముడుతలను నివారిస్తుంది. దాంతో ముఖం సాఫీగా మారి యౌవనంతో కనిపిస్తుంది.

శక్తి అపారం..అభియోగాలూ అపరిమితం
బొటాక్స్‌లోని శక్తి అపారం. అయితే దీన్ని ఉపయోగించడం పూర్తిగా రిస్క్‌ లేని వ్యవహారమేమీ కాదు. నిపుణులుంతా చెప్పేదేమిటంటే చాలా చిన్న మోతాదులో ఇది సురక్షితం. కేవలం నిపుణులైన లైసెన్స్‌డ్‌ ప్రొఫెషనల్స్‌ మాత్రమే దీన్ని ఉపయోగించాలన్నది అందరూ అంగీకరించే మాట. కానీ కేవలం వారు మాత్రమే అందునా దీన్ని ఉపయోగించాల్సిన ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నారా అన్నది సందేహమే. రష్యాలో దీన్ని బార్బర్‌ షాపుల్లోనూ ఫేషియల్‌గా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. అలా దీన్ని ఆఫ్‌ లేబుల్‌ ప్రయోజనాలకు దీన్ని ఉపయోగిస్తున్నారన్నది పరమ వాస్తవం. అందుకే దీన్ని ఉత్పాదనలో పాలుపంచుకుంటున్న అలెర్గాన్‌ ఫార్మస్యూటికల్స్‌పై ఇటీవల కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి.

మైగ్రేన్‌కూ ఉపయోగకరమని తెలిసిన తీరు విచిత్రం...
బొటాక్స్‌ ఉత్పాదన సంస్థ అయిన అలెర్గాన్‌ దీన్ని మైగ్రేన్‌కు చికిత్సగా కనుగొన్న తీరు విచిత్రం. అలెర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రసిడెంట్, ఆ కంపెనీ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అయిన డాక్టర్‌ మిట్చెల్‌ బ్రిన్‌ మాటల్లో చెప్పాలంటే... ‘‘తొలుత మైగ్రేన్‌కు బొటాక్స్‌ మందును క్లినికల్‌ ట్రయల్స్‌గా వాడినప్పుడు ఎన్నో సార్లు విఫలమయ్యాం. ఆ తర్వాత ఎంత సునిశితత్వంతో ఎంత మోతాదులో ఇస్తే అది మందుగా పనిచేస్తుందో అన్న విషయం అనేక వైఫల్యాల తర్వాతే తెలిసింది’’ అని అన్నారు. ‘‘బీవర్లీహిల్స్‌కు చెందిన ప్లాస్టిక్‌ సర్జన్లు దీన్ని ముఖం ముడుతలకు మందుగా ఇచ్చే సమయంలో కొంతమంది రోగుల్లో తలనొప్పి కూడా తగ్గినట్లు తెలియడంతో దీనిపై మరిన్ని అధ్యయనాలు జరిగాయి. దాంతో ఇది తలనొప్పులనూ తగ్గిస్తోందని తేలింది’’ అని పేర్కొన్నారు డాక్టర్‌ బ్రిన్‌. అయితే ఇప్పుడు దీన్ని మైగ్రేన్‌ నివారణ కోసం దాదాపు ముఖం, మెడ భాగాల్లో 31 చోట్ల దీన్ని ఇంజెక్షన్‌గా నమ్మకంతో తీసుకుంటున్నారు. అయితే ఆయా కేసుకు అనుగుణంగా దీని ప్రభావం మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉంటుందన్నది వాస్తవం.

ప్రమాదాలూ ఎన్నోన్నో...
బొటాక్‌ అన్నది కేవలం ప్రయోజనకారిగానే కాదు... నిర్దిష్టంగా ఇవ్వాల్సిన కండరానికి కాకుండా ఇతర కండరాలకు ఇచ్చినప్పుడు ప్రమాదకారిగా కూడా పరిణమించింది. దీన్ని ఉపయోగించిన వారిలో చూపు అస్పష్టంగా మారడం (బ్లర్‌డ్‌ విజన్‌), మింగడంలో ఇబ్బందుల వంటివి కనిపించాయి. అయితే ఇవి చాలా అరుదు. దీని తీవ్రతను గుర్తించిన కొన్ని దేశాలు దీన్ని ఒక జీవరసాయన ఆయుధంగా కూడా వాడవచ్చని గుర్తించాయంటే దీని వల్ల  ప్రమాదం ఎంతో గ్రహించవచ్చు. ఇప్పటికీ డిప్రెషన్‌కు దీన్ని వాడటంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. మెదడు నుంచి నరాల ద్వారా కండరానికి అందే సంకేతాలకు అడ్డంకి (బ్లాక్‌)గా ఇది పనిచేస్తుంది కాబట్టి దీని వల్ల చాలా అవాంఛిత ఫలితాలూ  వచ్చే అవకాశం ఉందన్న విషయంలో ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. అయితే దీన్ని సురక్షితంగా వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలపై గత 25 ఏళ్లలలో దాదాపు 3,200కు పైగా అధ్యయనాలు ఉన్నందున అనేక ఆఫ్‌–లేబుల్‌ అంశాలకు అధికారికంగా ఆమోదం ఇవ్వాలన్నది అలెర్గాన్‌ సంస్థ వాదన. మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10,000 యూనిట్ల బొటాక్స్‌ను వాడటం జరుగుతోంది.

ఏయే చికిత్సల్లో ఎఫ్‌డీఏ ఆమోదం ఉందంటే...
∙మెల్లకన్ను ∙కనురెప్ప మూసుకుపోయే బ్లెఫరోస్పాజమ్‌కు చికిత్సగా ∙ముఖంలో సగభాగంలోని కండరాలు బిగుసుకుపోవడం ∙మెడను బలవంతంగా ఒకవైపు వంకరంగా ఉంచే సర్వికల్‌ డిస్టోనియా చికిత్స కోసం ∙అరచేతులు, అరిపాదాల్లో  ఎక్కువ చెమట స్రవించడానికి చికిత్సగా ∙చేతులు, కాళ్లలో కండరాలు బాగా బిగుతైపోవడం  (స్పాస్టిసిటీ) ∙దీర్ఘకాలిక మైగ్రేన్‌కు నివారణ కోసం ∙ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌ ∙ముఖంపై ముడుతలను తగ్గించేందుకు. ∙నిత్యం నోటి నుంచి లాలాజలం ఊరే కండిషన్‌లలో
∙కొందరు దీన్ని చిన్న పిల్లల్లో వచ్చే సెరెబ్రల్‌ పాల్సీ వంటి లక్షణాల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు.

ఎఫ్‌డీఏ ఆమోదం లేకపోయినా
వాడుతున్న సందర్భాలు...

మందుల ఉపయోగానికి అనుమతి ఇచ్చే ఎఫ్‌డీఏ అనుమతి లేకపోయినా  ఆఫ్‌–లేబుల్‌ డ్రగ్‌గా వాడుతున్న సమస్యలివి... దవడ ఎముకలో పట్టేయడంతో నోరు తెరవలేని ‘లాక్‌ జా’ కేసుల్లో  వెన్నునొప్పి కోసం సెక్స్‌ సమయంలో తీవ్రమైన నొప్పి వచ్చే సందర్భాల్లో డిప్రెషన్‌కు మందుగా  మలద్వారం చీరుకుపోయే యానల్‌ ఫిషర్‌ కేసుల్లో   నిత్యం పళ్లు కొరుకుతూ ఉండే కేసుల్లో

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి
సీనియర్‌ న్యూరాలజిస్ట్‌
సిటీ న్యూరో సెంటర్,
రోడ్‌ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement