బ్యాక్టీరియా ఆదేశిస్తుంది... మనం పాటిస్తాం!
దేవుడు శాసిస్తాడు.. మనం పాటిస్తాం.. చాలామంది విశ్వాసం ఇది. అయితే.. తిండి విషయంలో మాత్రం మన కడుపులో ఉండే బ్యాక్టీరియానే మనకు దేవుడట. అది ఎలా ఆదేశిస్తే మనం అలాంటి ఆహారాన్నే ఎంచుకుంటామట! తమ పెరుగుదలకు ఏ ఆహారం అయితే బాగుంటుందో అలాంటి ఆహారాన్నే మనచేత తినిపించేందుకు పేగుల్లోని బ్యాక్టీరియా ప్రయత్నిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్త కార్లో మాలే అంటున్నారు మరి. మనిషి పేగుల్లో లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయని, వాటిలో ఎక్కువమొత్తంలో మేలు చేసేవేనన్న సంగతి తెలిసిందే.
అయితే పేగుల్లోని బ్యాక్టీరియా తన ఇష్టాలకు అనుగుణంగా రసాయన అణువులను విడుదలచేస్తుందని, ఆ సంకేతాలు నాడీవ్యవస్థ ద్వారా మెదడుకు చేరి.. మనం ఆ ఆహారాన్నే ఎంచుకునేలా ప్రేరణ పొందుతామని కార్లో వెల్లడించారు. కానీ.. అంతిమంగా మనం తినే ఆహారాన్ని బట్టే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. మంచి బ్యాక్టీరియాను పేగుల్లోకి పంపితే.. స్థూలకాయం, అనారోగ్యపూరిత ఆహారపు అలవాట్లను సైతం అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. అన్నట్టూ.. రేపు మాంసం తినాలనో లేదా ఇంకేదైనా తినాలనో అని అనుకున్నప్పుడు పేగుల్లోని బ్యాక్టీరియా అందుకు ముందుగానే సిద్ధమైపోతుందట కూడా!