ఆ అవార్డు గ్రహీతగా టీఎం కృష్ణ చెప్పుకోరాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దిగ్గజ కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా ప్రకటించుకోరాదని కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్ సుబ్బులక్ష్మిని గతంలో టీఎం కృష్ణ తీవ్ర పదజాలంతో అవమానించి అప్రతిష్ట పాల్జేశారంటూ ఆమె మనవడు వి.శ్రీనివాసన్ వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎం కృష్ణ ఇప్పటికే ఈ అవార్డును స్వీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు తెలిపింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ, ది హిందూ గ్రూప్లను ఆదేశించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఏటా ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డును అందజేస్తుంటుంది.