అక్షత్.. మరో అద్భుతం...!
న్యూఢిల్లీః ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అక్షత్ మిట్టల్ గుర్తున్నాడా? దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకోసం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశ పెట్టిన సరి బేసి వాహన విధానంతో 13 ఏళ్ళ వయసులోనే తన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన అక్షత్.. అందర్నీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నగరంలో సరి బేసితో ఇబ్బందులు పడుతున్న పౌరులను కష్టాలనుంచీ గట్టెక్కించేందుకు 'ఆడ్ ఈవెన్ డాట్ కామ్' పేరుతో ఓ వైబ్ సైట్ ను రూపొందించి అనూహ్యంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు కార్ పూలింగ్ యాప్ ఓరాహీతో కలసి... ఆ బాల మేధావి.. మరో కొత్త యాప్ ను సృష్టించాడు.
అక్షత్.. 13 ఏళ్ళ వయసులోనే తన సృజనాత్మకతతో అందరికీ చేరువయ్యాడు. వాహనదారులు తన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే.. సరి బేసి సమయాల్లో దగ్గరలోని వాహనదారులతో మాట్లాడి, వారి కార్లలో కార్యాలయాలకు సులభంగా చేరుకునే మార్గాన్ని ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కార్ పూలింగ్ విధానానికి బ్రేక్ వేయడం, అనంతరం తన వెబ్ సైట్ ను ఇతర సంస్థకు అమ్మేసిన అక్షత్.. ఇప్పుడు మరో యాప్ తో ప్రజల ముందుకొచ్చాడు. 15 ఏళ్ళ వయసున్న అక్షత్ మిట్టల్.. ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందకు 'ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్' పేరున కొత్త వెంచర్ ను బుధవారం ఆవిష్కరించాడు. ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ను స్వాధీన పరచుకున్న గుర్గావ్ ఆధారిత సాంకేతిక, డొమైన్ నిపుణులు.. కార్ పూలింగ్ యాప్ 'ఓరాహీ' సలహా బోర్డు తో కలసి కొత్త యాప్ ను ప్రవేశ పెట్టాడు.
దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్ కొత్త యాప్.. ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్.. పని చేయనుంది. భారత్ లో సామాజిక మార్పుకోసం, ప్రజలకు సహాయం అందించే దిశగా తాను ఆలోచిస్తున్న సమయంలోనే తనను... ఆడ్ ఈవెన్ డాట్ కామ్... అశోకా యూత్ ఛేంజ్ మేకర్ గా ఎంపిక చేసిందని అక్షత్ తెలిపాడు. సమాజంలో మార్పును కోరుకునేవారు, అందుకు సహాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలసి, దాదాపు పదిలక్షలమంది సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రస్తుత మిషన్ పనిచేస్తుందని అక్షత్ పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే ప్రజలకు సహాయం అందించేందుకు ఛేంజ్ మై ఇండియా ప్రారంభించినట్లు అక్షత్ మిట్టల్ తెలిపాడు.