కార్పొరేట్ స్థాయిలో గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతాం
తాడేపల్లిగూడెం రూరల్ :
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మండలంలోని ఆరుగొలను ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల జోన్–2 క్రీడామహోత్సవం–2016 కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని ప్రపంచ స్థాయిలో క్రీడా కళాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నాబార్డు ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారి అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఆరుగొలను గురుకుల పాఠశాల అభివద్ధికి రూ.30 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆరుగొలను సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 650 మంది విద్యార్థులు ఐదు నుంచి ఇంటర్ వరకు ఉన్నారని, నూతనంగా భవనం నిర్మాణం చేపట్టి 1500మంది విద్యార్థులు చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాత భవనాలు మరమ్మత్తులు నిమిత్తం రూ38కోట్లు కేటాయించినట్ల చెప్పారు. ఇటీవల రజిత పతకాన్ని సాధించిన సింధూ ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ విద్యార్థి భారతదేశం గర్వించదగ్గ మహోన్నత స్థాయికి ఎదగాలని అభిలషించారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్ మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకుని పేరు తెచ్చుకోవాలన్నారు. ఆరుగొలను గురుకుల, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ మూడ్రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో పశ్చిమ, తూర్పు, కష్ణా జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. గతంలో జరిగిన ఎన్నో పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు అవార్డులు సాధించినట్లు తెలిపారు. తొలుత మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కబడ్డీ ఆడి పోటీలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపిపి గన్నమని దొరబాబు, సర్పంచ్ మలకా వెంకట్రావు, ఎమ్పీటిసి సహదేవుడు, కొత్తూరు సర్పంచ్వెంకటలక్ష్మి, ఆరుగొలను సొసైటి అధ్యక్షులు నూకల బుల్లియ్య, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎస్కె.సోమయాజులు, కైండ్‌నెస్ సొసైటి అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు, బిజేపి ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, తహసిల్దార్ పాశం నాగమణి, గురుకుల సంస్థ ఓఎస్డి పి.రాజారావు, బిజేపి యువ నాయకులు నవీన్, పేరిచర్ల మురళీకష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.