cartridges
-
నకిలీ క్యాట్రిడ్జెస్ ప్యాక్ చేసి అమ్మేస్తాడు..!
సాక్షి, సిటీబ్యూరో: అప్పటికే ఓసారి వినియోగించిన, నకిలీ క్యాట్రిడ్జెస్‌ను రీ–ప్యాక్ చేసి బ్రాండెడ్‌విగా పేర్కొంటూ విక్రయిస్తున్న గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఓ నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు భారీగా నకిలీ క్యాట్రిడ్జ్‌లు, వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న ఖాళీ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు శుక్రవారం తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన జగదీష్ అంబాబాయ్ రవారియా పదేళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి పంజగుట్ట ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతడు కొన్నాళ్ల పాటు సికింద్రాబాద్, సీటీసీలోని ఓ కంప్యూటర్ల దుకాణంలో పని చేశాడు. అక్కడే ప్రింటర్లలో వినియోగించే క్యాట్రిడ్జెస్ క్రయ విక్రయాలపై అనుభవం సంపాదించాడు. ఆ ఉద్యోగంలో వచ్చే జీతం చాలకపోవడంతో పాటు తేలిగ్గా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను వినియోగదారులకు బ్రాండెడ్ అంటూ నకిలీ క్యాట్రిడ్జ్‌లు విక్రయించాలని పథకం వేశాడు. రసూల్‌పుర ఓ గోదాము అద్దెకు తీసుకున్న ఇతను ఆ దందా ప్రారంభించాడు. అందుకు అవసరమైన వస్తువులను ముంబైలో ఖరీదు చేసేవాడు. ఓసారి వినియోగించిన, నకిలీ క్యాట్రిడ్జ్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసే ఇతను ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న డబ్బాల్లో ప్యాక్ చేసేవాడు. ఇలాంటి క్యాట్రిడ్జ్‌లను నిజమైనవిగా పేర్కొంటూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం శుక్రవారం గోదాముపై దాడి చేసింది. జగదీష్‌ను పట్టుకోవడంతో పాటు భారీగా నకిలీ క్యాట్రిడ్జ్‌లు, ఖాళీ బాక్సులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
వితంతు పింఛన్ కూడా ఇవ్వని ప్రభుత్వం
ఈ ఫోటోలో ఇద్దరు పిల్లలతో దిగాలుగా ఉన్న మహిళ పేరు పద్మావతి. వారిది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామం. పద్మావతి భర్త, చీనీ(బత్తాయి) రైతు తిరుపాల్‌రెడ్డి అప్పుల భాదతో విష గుళికలు మింగి ఆత్మహత్యచేసుకోవడంతో ఈ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చీనీ తోటను కాపాడుకోవడానికి నాలుగు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఏడు ఎకరాల్లో పప్పుశనగ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రూ.17 లక్షలకు అప్పు పెరిగిపోయింది. అప్పు తీర్చలేనన్న బాధతో 2018 అక్టోబర్ 6న తిరుపాల్‌రెడ్డి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రైతు కుటుంబం అనాథగా మారింది. రెవిన్యూ అధికారులు విచారణ చేసి రూ.17 లక్షలు అప్పు ఉన్నట్లు నిర్థారించారు. అయినా తిరుపాల్‌రెడ్డి కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందలేదు. ప్రభుత్వం ద్వారా చిల్లి గవ్వ రాకపోవడంతో పాటు పద్మావతికి వితంతు పించన్ కూడా మంజూరు చేయలేదు. ‘ఆయన మమ్మల్ని వదిలి వెళ్లాడు. ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కావడం లేద’ని పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం వితంతు పింఛన్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ఆమె కన్నీటి పర్యంతమౌతోంది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. – కాకనూరు హరినాథ్‌రెడ్డి, సాక్షి, పుట్లూరు, అనంతపురం జిల్లా -
చక్కెర గుళికలు నొప్పిని తగ్గిస్తాయా?
పిల్లలు అనుకోకుండా కిందపడ్డారనుకోండి.. నొప్పి ఏమార్చేందుకు బెల్లం ముక్క నోట్లో పెట్టడం మనం చూసే ఉంటాం. గాయం తాలూకూ నొప్పి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ఇది పనికొస్తుందని మనం ఇప్పటివరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే తగిన మెదడు నిర్మాణం, మానసిక స్థితి ఉన్న వారికి ఈ తీపి కాస్తా శక్తిమంతమైన మందుగానూ పనిచేస్తుందని అంటున్నారు నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఈ పరిశోధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంచనా. అనేక దుష్ప్రభావాలను చూపించే రసాయనిక మందుల స్థానంలో ఒట్టి చక్కెర గుళికలు ఇవ్వవచ్చునని, ఫార్మా కంపెనీలు మందుల ప్రభావశీలతను పరీక్షించేందుకు కొంతమందికి ఇచ్చే ఉత్తుత్తి మాత్రలను లేకుండా చేయవచ్చునని, ఆసుపత్రి ఖర్చులూ తగ్గుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వానియా అప్కారియన్ వివరించారు. నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం నొప్పితో బాధపడుతున్న వారికి ఏవో మందులిస్తున్నామని కాకుండా.. చక్కెర గుళికలే ఇస్తున్నాంగానీ.. అది నొప్పి తగ్గిస్తుందని నమ్మబలికితే చాలని వివరించారు. నడుం నొప్పితో బాధపడుతున్న కొందరిపై తాము ప్రయోగాలు నిర్వహించి మరీ ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. -
జేఎన్‌యూలో తుపాకి కలకలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) క్యాంపస్ లో మారణాయుధంతో దొరికిన బ్యాగు కలకలం రేపింది. ఎమ్మెస్సీ బయెటెక్నాలజీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం మిస్టరీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ బ్యాగును స్వాధీనం చేసుకోవడం ఆందోళన రేపుతోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఈ బ్యాగును గుర్తించిన యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నలుపు రంగులో ఉన్న ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.65 పిస్టల్, ఏడు తూటాలు ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ బ్యాగు క్యాంపస్ లోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అక్టోబర్ 15 నుంచి కనిపించకుండాపోయిన నజీబ్ అహ్మద్ కోసం జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. నజీబ్ అదృశ్యంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు.