జేఎన్‌యూలో తుపాకి కలకలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) క్యాంపస్ లో మారణాయుధంతో దొరికిన బ్యాగు కలకలం రేపింది. ఎమ్మెస్సీ బయెటెక్నాలజీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం మిస్టరీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ బ్యాగును స్వాధీనం చేసుకోవడం ఆందోళన రేపుతోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఈ బ్యాగును గుర్తించిన యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
నలుపు రంగులో ఉన్న ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.65 పిస్టల్, ఏడు తూటాలు ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ బ్యాగు క్యాంపస్ లోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అక్టోబర్ 15 నుంచి కనిపించకుండాపోయిన నజీబ్ అహ్మద్ కోసం జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. నజీబ్ అదృశ్యంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు.