గౌస్ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు?
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన లెక్చరర్ గౌస్ కేసును నీరుగార్చేందుకు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. గౌస్ కేసును సీఐడీకి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హుటాహుటిన సీఐడీ అదనపు డీజీకి గౌస్ కేసు ఫైళ్లను అప్పగించాలని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో కేసు ఫైళ్లన్నింటినీ పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు సీఐడీ డీజీకి అప్పగించారు.
ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారులతో గౌస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేసును సీఐడీకి బదలాయించడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో లెక్చరర్ గౌస్ మొహిద్దీన్ అరెస్టయ్యి రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. గౌస్ దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్‌పై కోర్టులో బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది.