సారీ.. కేసు సీరియస్!
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : ‘ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలి. మాతాశిశు మరణాలను పూర్తిగా తగ్గించాలి.. అక్కడే తల్లి, బిడ్డ క్షేమం..’ అంటూ వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేకుండాపోయింది.. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ గ్రామీణ స్థాయిలో, పరిసర ప్రాంతాల్లో ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎక్కడికక్కడే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉన్నా ‘సారీ... కేసు సీరియస్ ప్రసవం ఇక్కడ చెయ్యలేం. జిల్లా ఆస్పత్రికి వె ళ్లండి..’ అని ఉచిత సలహా ఇచ్చి కాలక్షేపానికి వచ్చి ఆస్పత్రికి వచ్చిపోతూ గ్రామీణస్థాయి ఆస్పత్రుల సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లా పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలోని ఏ ఆస్పత్రికి ప్రసవానికి గర్భిణిని తీసుకెళ్లినా సరిగా చూడటంలేదు. ‘కేసు క్రిటికల్‌గా ఉంది. ఇక్కడుంటే తల్లి, బిడ్డకు ప్రమాదం.. మీరు జిల్లా ఆస్పత్రికి వెళ్లండి..’ అంటూ ఉచిత సలహా ఇవ్వడం మామూలైపోయింది. దీంతో అందరూ అక్కడే ప్రసవానికి ఎగబడటంతో బాలింతలకు వివిధ రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొందరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా ఆస్పత్రికి తరలివెళుతుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సంద ర్భాల్లో వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ప్రసవాలపై పూర్తి సమాచారం సేకరించింది. 2014 ఏప్రిల్ నుంచి గత నెల వరకు( ఏడాది కాలం) జిల్లా ఆస్పత్రిలో సహజ ప్రసవాలు 2,883 జరగగా, ఆపరేషన్ల ద్వారానే 1,377 నమోదయ్యాయి. ఈ లెక్కన ఇక్కడ ప్రతిరోజూ పది నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక ఐదు నుంచి ఎనిమిది వరకు ఆపరేషన్ల ద్వారానే డెవలివరీ అవుతున్నాయి. ఇలా జిల్లా ప్రధాన ఆస్పత్రికి ఎక్కువగా కేసులు వస్తుండటంతో వైద్య సిబ్బంది, వైద్యులకు ఇబ్బందిగా మారింది.