సర్కారు చర్య సిగ్గుచేటు
► ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు బనాయిస్తారా..?
► ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ సీపీ మండిపాటు
► నేడు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు
► విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని పిలుపు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు పక్కనపెట్టి అధికారం, స్వార్ధ ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు.
కృష్ణాజిల్లాలో బుధవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనను నీరుగార్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, పోస్టుమార్టం చేస్తే నిజాలు బయటకొస్తాయన్న భయంతోనే నాటకమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిమంది మృతికి కారకుడైన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయమని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా గురువారం అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దారు కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని బాలినేని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.