Casey
-
మాఘమాసంలో మహాశివరాత్రికి కాశీ యాత్ర
కాశీ... కాశీ... కాశీ... అని మూడుసార్లు పలికితే చాలు మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని చెబుతుంది ‘కాశీ ఖండం’. అంతటి మహిమాన్వితమైన నగరాన్ని జన్మలో ఒక్కసారి సందర్శిస్తే చాలు అనుకోని భక్తులు ఉండరు. సాక్షాత్తూ కైలాసనాథుడే కొలువుదీరిన క్షేత్రంగా భాసిల్లుతున్న కాశీకి మరో పేరే – వారణాసి. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే దీన్ని ‘వారణాసి’ అని అంటారు. మన దేశపు సాంస్కృతిక రాజధానిగా, అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి, ప్రపంచంలోనే అతి పురాతన నగరంగా పేరొందింది – వారణాసి. ఈ నగరం శివుని త్రిశూలంపై ఏర్పడిందని చెబుతుంటారు. ఈ నగరం నడిబొడ్డునే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఉంది. భూ కైలాసం... కాశి ప్రళయకాలంలో కూడా నాశనం చెందని ఏకైక దివ్య క్షేత్రంగా కాశీకి పేరుంది. ఇది ఆనంద కాననం, కాలభైరవ దర్శనం, విశాలాక్షి వీక్షణం, విశ్వనాథుడి విన్యాసం, అన్నపూర్ణమ్మ అనుగ్రహం, మోక్షపురి, మహాశ్మశానం, పంచక్రోశ క్షేత్రం అనే నామాలతో పూర్వకాలం నుంచి మహాఖ్యాతి పొందిన నగరం. భూలోక కైలాసంగా, భువిలోన కొలువైన పరమేశ్వరుడి నివాసంగా పేరొందిన కాశీ క్షేత్ర దర్శనాన్ని ప్రతీ భక్తుడి దగ్గరకు తీసుకురావాలన్నదే ‘ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంకల్పం. దేవతల నివాసం తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలంలాగే వారణాశిలో తొమ్మిది రోజుల నిద్ర ఒక మనిషిలో అంతటి పవిత్రతను చేకూరుస్తుందని కాశీ ఖండం చెబుతోంది. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు వాదన జరిగిందట. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకున్నారట. అప్పుడు భూమిపై ఒక పెద్ద అగ్ని ఉద్భవించిందట. దానికి అంతం లేదట. గర్వంతో ఉన్న బ్రహ్మ దాని ఊపిరి తీయడానికి బయలుదేరాడట. విష్ణువు భూమి లోపలికి వెళ్లారట. ఇలా ఎన్నో వేల సంవత్సరాలు వెతికారట. ఎక్కడా ఆ జ్యోతి కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు. శివుడి రూపం ఆ జ్యోతిర్లింగాలలో కనపడిందట. ఆ జ్యోతిర్లింగమే ఇక్కడి విశ్వనాథ మందిరంలో ప్రతిష్ఠించబడిందట. దేశంలోని అన్ని తీర్థస్థల క్షేత్రాలన్నీ కాశీలో కొలువయ్యాయి. అందుకే కాశీ దర్శనం సర్వదేవతా దర్శనం అంటారు. కాశీలో పవిత్ర గంగానదిలో స్నానం, సూర్య నమస్కారం చేశాక గంగాఘాట్ నుంచి యాత్ర మొదలవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి, విశాలాక్షి దేవాలయాలలో పూజలు, గంగానదికిచ్చే హారతులు, ఒడ్డునే అనేక శ్మశాన వాటికలు, హోరెత్తే శివ పంచాక్షరీ మంత్రాలు... యాత్రికులకు ఆధ్యాత్మికానందాన్ని కలుగజేస్తాయి. గంగానదీ తీరంలో... గంగానది తీర ప్రాంతంలో 64 ఘాట్లు ఉన్నాయి. ఇవన్నీ పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. దశాశ్వమేథఘాట్లో స్నానం చేస్తే దశ అశ్వమేథయాగాలు చేసినంత పుణ్యం వస్తుందంటారు. ఇక్కడ ఉన్న ఘాట్లలో హరిశ్చంద్ర ఘాట్, సంకట ఘాట్, మున్షీఘాట్, నారఘాట్, తులసీ ఘాట్ ముఖ్యమైనవి. మత్స్యపురాణం ప్రకారం 5 విశేష తీర్థాలైన దశాశ్వమేథ, లోలక్, కేశవ్, బిందు మాధవ్, మణికర్ణికా ఘాట్ ఇక్కడ స్నాన జపాలు అత్యంత పుణ్యాన్ని ఇస్తాయని ప్రతీతి. విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేథ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనది. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకం దారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేథ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. కాశీలో పితృ పక్షాలప్పుడు పిండప్రదానం చేయడం వల్ల పితృదేవతలకు వెయ్యేళ్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని చెబుతారు. కాల భైరవుని అనుమతి విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కాబట్టి భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వరగంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఆలయ సమీపంలో ఉన్న బావి బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుంచి నీరు ఊరుతుందని, ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు. ఏ కోణంలో చూసినా వారణాసి హిందువులందరికీ పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షలాదిమందికి పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. ఇంతటి మహిమాన్వితమైన కాశీ యాత్ర ఫలాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలనే దృఢసంకల్పంతో తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ‘ఆర్.వి.టూర్స్ అండ్ ట్రావెల్స్’ మాఘ మాసం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్యాకేజీలతో కాశీలో 9 రోజుల నిద్రతో పాటు, కాశీలో తప్పకుండా దర్శించాల్సిన దేవాలయాల దర్శనభాగ్యం మీ అందరికీ కల్పిస్తోంది. ఇలాంటి చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేవదేవుని కృపకు పాత్రులవ్వాని కోరుకుంటున్నాం. -
కలసిపోతాను... కలుపుకుంటాను...
గమనం నదుల స్వగత కథనం నేను నిరంతర ప్రవాహాన్ని. భారతదేశ జీవన విధానం నా గమనంతో మమేకమై పోయింది. భరతమాతకు కీర్తికిరీటం వంటి హిమాలయాలే నా పుట్టిల్లు. భారతీయుల జీవనంలో నేనో భాగాన్ని. అయినా సరే... తొలివేద కాలం నాటి గ్రంథాల్లో నా ఊసే కనిపించదు. అప్పట్లో సింధు, సరస్వతి నదులే ప్రముఖంగా కనిపించాయి. ఆర్యులు అప్పటికి నా వైపుగా రాకపోవడంతో నాకు పెద్దగా ప్రాచుర్యం రాలేదు. మలివేదకాలం నాటికి నేను కీలకమయ్యాను. కాశీ పట్టణం నా తీరానే ఉంది. పేర్లు గుర్తు పెట్టుకుంటూ... పుట్టినప్పటి నుంచి సాగరంలో కలిసే వరకు నేను నేనుగా ఉండను. పేర్లు మార్చుకుంటూ ప్రయాణిస్తాను. విష్ణుప్రయాగలో ధౌలిగంగ, అలకనంద కలుస్తాయి. నందప్రయాగలో నందాకిని తోడవుతుంది. కర్ణప్రయాగలో పిండార్ వచ్చి చేరుతుంది. ఇవన్నీ కలిసి వచ్చి దేవప్రయాగలో నాలో కలిసిన తర్వాత నాకు ‘గంగ’ అనే అసలు పేరు వస్తుంది. అప్పటి వరకు భాగీరథినే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి హిమానీనదంలో పుట్టి, ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టిన నా ప్రయాణంలో ఋషికేశ్ ఓ మైలురాయి. మంచు పర్వతాలను దాటి కొండల ఆసరాతో పయనించిన నేను నేల మీద అడుగుపెట్టేదిక్కడే. అప్పటివరకు నైరుతిదిశగా సాగిన నా ప్రయాణం హరిద్వార్ దగ్గర ఆగ్నేయదిక్కుకు మారుతుంది. నేను అలహాబాద్ చేరేలోపు ‘రామగంగ’ పలకరిస్తుంది. యమున దగ్గరలోనే ఉందని చెప్పి ముందుకు సాగుతానో లేదో అంతలోనే యమున కనిపిస్తుంది నా కోసమే ఎదురు చూస్తున్నట్లు. యమున పేరుకి నాకు ఉపనదే కానీ, నా ప్రవాహం కంటే యమున ప్రవాహమే మిన్న. యమునకు నాతో కలవాలనే ఉత్సాహం ఉంది కానీ తన మనుగడను కోల్పోవడం ఇష్టం లేదు కాబోలు. అంత త్వరగా కలవదు. ఒక ఒడ్డున నేను ఎరుపు వర్ణాన్ని కలుపుకున్నట్లు, మరో ఒడ్డున యమున, నేను నీల మేఘపు ఛాయలాగా ప్రవహిస్తుంటాం. పది మైళ్ల ప్రయాణం తర్వాత కానీ నా పెద్దరికాన్ని ఆమోదించదు యమున. అక్కడి నుంచి నా ప్రయాణం ‘తామస’ను కలుపుకుని తూర్పు ముఖంగా సాగిపోతుంది. తీరా కాశీ పట్టణం చేరేసరికి ఒక్కసారిగా ఉత్తరానికి తిరుగుతాను. గోమతి, ఘాఘ్రా నదులను స్వాగతించి బీహార్ దారి పట్టి పాటలీపుత్రాన్ని చూస్తూ చంద్రగుప్తుల కాలాన్ని తలుచుకుంటూ సోన్, గండకీ, కోసీ నదులతో చెలిమి చేస్తూ ఝార్ఖండ్‌లో అడుగుపెట్టి ‘పాకుర్’ చేరానో లేదో... ఓ హఠాత్పరిణామం! నా దేహం నుంచి గుండెను వేరుచేసిన భావన. నా ప్రవాహంలో పెద్ద చీలిక. హుగ్లీ పేరుతో ఓ పక్కగా వెళ్లిపోతుంది. నా అంశగా కోల్‌కతా దాహం తీరుస్తుందిలే అని సర్దిచెప్పుకుంటాను. నా నీటిని నిల్వ చేసుకోవడానికి కట్టిన ఫరక్కా బ్యారేజ్‌ను చూస్తూంటే... ఇండో- పాక్ జల వివాదాలు, ‘భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన నీటి సంధి’ జ్ఞాపకాలు కందిరీగల్లా చుట్టుముడతాయి. ఈ లోపు ‘పద్మ’ అనే పలకరింపు... అంటే బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టానన్నమాట. అది ఒకప్పటి భారతావనే. బ్రహ్మపుత్ర నుంచి చీలిన ఓ పాయ ‘జమున’ను నాకు తోడుగా తీసుకుని ముందుకెళ్తూ ఉంటే అలాంటిదే మరో పాయ ‘మేఘన’ నేనూ కలుస్తానని నా అంగీకారంతో పనిలేకనే చేరిపోతుంది. మేఘన నాతో కలుస్తుంది అనడం కంటే మేఘన వచ్చి నన్ను తనలో కలుపుకుంటుంది - అనడం సబబేమో. ఎందుకంటే ఆ క్షణం నుంచి ‘పద్మ’ అనే పేరును కూడా నాకు మిగల్చకుండా తన పేరుతోనే పిలిపించుకుంటుంది. నన్ను అందరూ ‘మేఘన’ అంటూ ఉంటే ఇక నేను లేనా అనిపించి మనసు కలుక్కుమంటుంది కూడా. ఏమైనా మనుషుల్లో స్వార్థంతోపాటు కొంచెం ఉదార స్వభావం కనిపిస్తుంటుంది. బంగాళాఖాతంలో కలిసే చోటుకు గంగా (గంగ- బ్రహ్మపుత్ర) డెల్టా అంటూ... నేను మర్చిపోయిన నా పేరును గుర్తు చేసి మురిపిస్తారు. ఎన్ని భాషలో... ఎన్నెన్ని యాసలో! కపిల మహర్షి మాట మేరకు స్వర్గంలో ఉన్న నన్ను భూమ్మీదకు తీసుకువచ్చే బాధ్యతను కోసల రాజ్యాన్ని పాలించిన సూర్యవంశ రాజు భగీరథుడు చేపట్టాడని పురాణోక్తి. అలా ఆవిర్భావ దశలో నా పేరు భాగీరథి అయింది. గంగోత్రికి నాలుగు కి.మీ.ల దూరంలో తపోవన్... భగీరథుడు తపస్సు చేసినట్లు చెప్పే ప్రదేశం ఉంది. ఇక్కడ 18వ శతాబ్దంలో నాకో ఆలయం కట్టారు. అక్కడ అందరూ ‘గంగామాత’ అంటూ పూజిస్తారు. సముద్రమట్టానికి దాదాపు పదమూడు వేల అడుగుల ఎత్తులో పుట్టిన నన్ను, 2525 కిలోమీటర్ల ప్రయాణంలో అందరూ అక్కున చేర్చుకునేవారే. నా తీరాన్ని ఆసరాగా చేసుకుని జీవనం సాగిస్తున్న మనుషులను చూస్తూ హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, ఘాజీపూర్, భాగల్పూర్, మీర్జాపూర్ల మీదుగా ప్రయాణిస్తుంటే ఎన్నెన్ని భాషలో, యాసలో. రకరకాల ఆహారపుటలవాట్లు, వస్త్రధారణలు. ఈ మధ్యలో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్‌లో బెంగాల్ టైగర్‌ను చూస్తూ, రాజ్‌మహల్ కొండల్లో ప్రయాణిస్తూ నా నీటికి ఖనిజలవణాలను సమకూరుస్తుంటాను. అక్కడి ‘సంథాల్’ గిరిపుత్రుల వ్యవసాయాన్ని చూసి తీరాల్సిందే. నా తీరాన ఉన్న నేల సారం అంతా ఇంతా కాదు. నేలను నమ్ముకున్న రైతు, నీటిని నమ్ముకున్న జాలరి సంతోషంగా జీవిస్తుంటే నా మది పులకించిపోతుంటుంది. వలలో డాల్ఫిన్లు పడితే జాలరికి పండగే. పొట్టపోసుకోవడానికి చేపలు పట్టే జాలరి పొట్టకొడుతూ కొందరు అత్యాశపరులు భారీవ్యాపారం కోసం డాల్ఫిన్లను విచక్షణరహితంగా తోడేస్తుంటే నాకు గుండె పిండేసినట్లు ఉంటుంది. నేను ఎన్ని ఇచ్చినా మనిషికి ఇంకా ఏదో కావాలనే ఆశ. ఆ అత్యాశతోనే నన్నూ కలుషితం చేస్తున్నారు. దాంతో మిగిలి ఉన్న జలచరాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నన్నే నమ్ముకుని పుట్టిపెరుగుతున్న ఆ ప్రాణులను కాపాడుకోవాలంటే నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. అందుకు మీరూ ఓ చెయ్యి వేస్తారా? నా నీటిని గొంతులో పోస్తే పోయే ప్రాణం నిలుస్తుందని ఒకప్పటి విశ్వాసం, నా నీరు తాగితే ఉన్న ప్రాణం ప్రమాదంలో పడుతుందనేది నేటి నిజం. నా నీటిలో ఆమ్లజని శాతం చాలా ఎక్కువ. స్వయంగా ప్రక్షాళన చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న నదిని. అలాంటి నన్ను ప్రపంచంలోకెల్లా కలుషితమైన నదుల్లో ముందంజలో చేర్చారు. రోజూ గంగాహారతి ఇస్తూ నా ఔన్నత్యాన్ని కీర్తించే ప్రతి పెదవినీ అడుగుతూనే ఉన్నాను. నన్ను నేను ప్రక్షాళన చేసుకోలేని అసహాయతలో చిక్కిన నా కోసం సాయం చేసే చేతులు ఉన్నాయా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. - వాకా మంజులారెడ్డి పుట్టింది: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి (14 వేల అడుగుల ఎత్తు) {పవాహదూరం: 2525కి.మీ.లు సాగర సంగమం: గంగ- బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర (బంగాళాఖాతంలో) గంగానది ప్రక్షాళన కోసం 1986 జనవరి 14వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘గంగా యాక్షన్ ప్లాన్’కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ అదే ప్రయత్నంలో ఉన్నారు. -
కొత్తదనమంటే....
గ్రంథపు చెక్క మధిర సుబ్బన్న దీక్షితుల ‘కాశీమజిలీలు’, ఎర్రమిల్లి మల్లికార్జునుడి ‘చార్ దర్వీషు కథలు’, ‘తాతాచార్యుల కథలు’ వగైరా తెలుగువాళ్లకు కాలక్షేపాన్ని, వినోదాన్ని కలిగించే రోజులలో... గురజాడ కథారచనలలో పరిపూర్ణమైన విప్లవమే కలిగించారు. చిన్నకథ అప్పారావు మానసపుత్రిక. కాశీకి విజయనగరం ఎంత దూరమో, కాశీమజిలీ కథలకు అప్పారావు కథలు అంతదూరం. ముందు మార్గదర్శకుడంటూ ఎవరూ లేకుండా, స్వయంభువులాగా అప్పారావు తెలుగు కథానికను స్వకపోల కల్పితంగా సృష్టించారు. తెలుగు కథకు తనదని చెప్పుకోదగిన మూర్తినీ కల్పించారు. అప్పారావు సూచించిన పరిష్కార మార్గాలు ఈనాటికీ సాహసోపేతాలనిపించేంత కొత్తవి కావడం ఆయన వ్యక్తిత్వానికి ఘనతను ఆపాదింపగల విశేషమే. కొత్తదనమంటే ఇటీవలితనమే కాదు, కొత్తదనమంటే నిజమైన తాత్పర్యం సమకాలికత్వమే. నేటి కథకు విఘ్నేశ్వరపూజ చేసిన వారు శ్రీ గురజాడ అప్పారావు. ఆయన రచించిన ‘దిద్దుబాటు’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా’ అను కథలు ‘ఆంధ్రభారతి’ మాసపత్రికలో ప్రచురితములైనవి. అచ్చపు తెలుగు వాడుకభాష సజీవముగా చిన్నకథలు వ్రాయుటకు తొలుత వాడినవారు శ్రీ గురజాడ. ఆయన కథలన్నీ జీవిత వాస్తవాన్ని ఆశ్రయించుకున్న సామాజిక చిత్రణలు. ‘పెద్దమసీదు’ అనే అతి చిన్న కథ తప్ప తక్కినవన్నీ సమకాలీన జీవితం నుంచి తీసుకున్నవే. కన్నది విన్నదీ కన్నట్లుగా విన్నట్లుగానే కాగితానికెక్కదు. కొందరు రచయితల పాత్ర సృష్టికి యథార్థ జీవితమూలాలు లభిస్తాయి. అప్పారావు పాత్రీకరణ విధానం ఫోటోగ్రాఫు వ్యవహారమేమీ కాదు. కొన్నిచోట్ల అది ‘పెన్సిల్ స్కెచ్’ మరికొన్నిచోట్ల ‘పోర్ట్రేట్’. ఆయన సుగుణమల్లా సూక్ష్మపరిశీలన శక్తి. - కె.వి.ఆర్ ‘మహోదయం’ నుంచి.