
కొత్తదనమంటే....
గ్రంథపు చెక్క
మధిర సుబ్బన్న దీక్షితుల ‘కాశీమజిలీలు’, ఎర్రమిల్లి మల్లికార్జునుడి ‘చార్ దర్వీషు కథలు’, ‘తాతాచార్యుల కథలు’ వగైరా తెలుగువాళ్లకు కాలక్షేపాన్ని, వినోదాన్ని కలిగించే రోజులలో... గురజాడ కథారచనలలో పరిపూర్ణమైన విప్లవమే కలిగించారు. చిన్నకథ అప్పారావు మానసపుత్రిక.
కాశీకి విజయనగరం ఎంత దూరమో, కాశీమజిలీ కథలకు అప్పారావు కథలు అంతదూరం. ముందు మార్గదర్శకుడంటూ ఎవరూ లేకుండా, స్వయంభువులాగా అప్పారావు తెలుగు కథానికను స్వకపోల కల్పితంగా సృష్టించారు. తెలుగు కథకు తనదని చెప్పుకోదగిన మూర్తినీ కల్పించారు.
అప్పారావు సూచించిన పరిష్కార మార్గాలు ఈనాటికీ సాహసోపేతాలనిపించేంత కొత్తవి కావడం ఆయన వ్యక్తిత్వానికి ఘనతను ఆపాదింపగల విశేషమే.
కొత్తదనమంటే ఇటీవలితనమే కాదు, కొత్తదనమంటే నిజమైన తాత్పర్యం సమకాలికత్వమే. నేటి కథకు విఘ్నేశ్వరపూజ చేసిన వారు శ్రీ గురజాడ అప్పారావు. ఆయన రచించిన ‘దిద్దుబాటు’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా’ అను కథలు ‘ఆంధ్రభారతి’ మాసపత్రికలో ప్రచురితములైనవి. అచ్చపు తెలుగు వాడుకభాష సజీవముగా చిన్నకథలు వ్రాయుటకు తొలుత వాడినవారు శ్రీ గురజాడ.
ఆయన కథలన్నీ జీవిత వాస్తవాన్ని ఆశ్రయించుకున్న సామాజిక చిత్రణలు. ‘పెద్దమసీదు’ అనే అతి చిన్న కథ తప్ప తక్కినవన్నీ సమకాలీన జీవితం నుంచి తీసుకున్నవే.
కన్నది విన్నదీ కన్నట్లుగా విన్నట్లుగానే కాగితానికెక్కదు. కొందరు రచయితల పాత్ర సృష్టికి యథార్థ జీవితమూలాలు లభిస్తాయి.
అప్పారావు పాత్రీకరణ విధానం ఫోటోగ్రాఫు వ్యవహారమేమీ కాదు. కొన్నిచోట్ల అది ‘పెన్సిల్ స్కెచ్’ మరికొన్నిచోట్ల ‘పోర్ట్రేట్’. ఆయన సుగుణమల్లా సూక్ష్మపరిశీలన శక్తి.
- కె.వి.ఆర్ ‘మహోదయం’ నుంచి.