కలసిపోతాను... కలుపుకుంటాను... | Soliloquy rivers article | Sakshi
Sakshi News home page

కలసిపోతాను... కలుపుకుంటాను...

Published Mon, Feb 16 2015 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

కలసిపోతాను...  కలుపుకుంటాను...

కలసిపోతాను... కలుపుకుంటాను...

గమనం
నదుల స్వగత కథనం

 
నేను నిరంతర ప్రవాహాన్ని. భారతదేశ జీవన విధానం నా గమనంతో మమేకమై పోయింది. భరతమాతకు కీర్తికిరీటం వంటి హిమాలయాలే నా పుట్టిల్లు. భారతీయుల జీవనంలో నేనో భాగాన్ని. అయినా సరే... తొలివేద కాలం నాటి గ్రంథాల్లో నా ఊసే కనిపించదు. అప్పట్లో సింధు, సరస్వతి నదులే ప్రముఖంగా కనిపించాయి. ఆర్యులు అప్పటికి నా వైపుగా రాకపోవడంతో నాకు పెద్దగా ప్రాచుర్యం రాలేదు. మలివేదకాలం నాటికి నేను కీలకమయ్యాను. కాశీ పట్టణం నా తీరానే ఉంది.
 
పేర్లు గుర్తు పెట్టుకుంటూ...

పుట్టినప్పటి నుంచి సాగరంలో కలిసే వరకు నేను నేనుగా ఉండను. పేర్లు మార్చుకుంటూ ప్రయాణిస్తాను. విష్ణుప్రయాగలో ధౌలిగంగ, అలకనంద కలుస్తాయి. నందప్రయాగలో నందాకిని తోడవుతుంది. కర్ణప్రయాగలో పిండార్ వచ్చి చేరుతుంది. ఇవన్నీ కలిసి వచ్చి దేవప్రయాగలో నాలో కలిసిన తర్వాత నాకు ‘గంగ’ అనే అసలు పేరు వస్తుంది. అప్పటి వరకు భాగీరథినే.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి హిమానీనదంలో పుట్టి, ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టిన నా ప్రయాణంలో ఋషికేశ్ ఓ మైలురాయి. మంచు పర్వతాలను దాటి కొండల ఆసరాతో పయనించిన నేను నేల మీద అడుగుపెట్టేదిక్కడే. అప్పటివరకు నైరుతిదిశగా సాగిన నా ప్రయాణం హరిద్వార్ దగ్గర ఆగ్నేయదిక్కుకు మారుతుంది. నేను అలహాబాద్ చేరేలోపు ‘రామగంగ’ పలకరిస్తుంది. యమున దగ్గరలోనే ఉందని చెప్పి ముందుకు సాగుతానో లేదో అంతలోనే యమున కనిపిస్తుంది నా కోసమే ఎదురు చూస్తున్నట్లు. యమున పేరుకి నాకు ఉపనదే కానీ, నా ప్రవాహం కంటే యమున ప్రవాహమే మిన్న. యమునకు నాతో కలవాలనే ఉత్సాహం ఉంది కానీ తన మనుగడను కోల్పోవడం ఇష్టం లేదు కాబోలు. అంత త్వరగా కలవదు. ఒక ఒడ్డున నేను ఎరుపు వర్ణాన్ని కలుపుకున్నట్లు, మరో ఒడ్డున యమున, నేను నీల మేఘపు ఛాయలాగా ప్రవహిస్తుంటాం. పది మైళ్ల ప్రయాణం తర్వాత కానీ నా పెద్దరికాన్ని ఆమోదించదు యమున. అక్కడి నుంచి నా ప్రయాణం ‘తామస’ను కలుపుకుని తూర్పు ముఖంగా సాగిపోతుంది. తీరా కాశీ పట్టణం చేరేసరికి ఒక్కసారిగా ఉత్తరానికి తిరుగుతాను. గోమతి, ఘాఘ్రా నదులను స్వాగతించి బీహార్ దారి పట్టి పాటలీపుత్రాన్ని చూస్తూ చంద్రగుప్తుల కాలాన్ని తలుచుకుంటూ సోన్, గండకీ, కోసీ నదులతో చెలిమి చేస్తూ ఝార్ఖండ్‌లో అడుగుపెట్టి ‘పాకుర్’ చేరానో లేదో... ఓ హఠాత్పరిణామం! నా దేహం నుంచి గుండెను వేరుచేసిన భావన. నా ప్రవాహంలో పెద్ద చీలిక.

హుగ్లీ పేరుతో ఓ పక్కగా వెళ్లిపోతుంది. నా అంశగా కోల్‌కతా దాహం తీరుస్తుందిలే అని సర్దిచెప్పుకుంటాను. నా నీటిని నిల్వ చేసుకోవడానికి కట్టిన ఫరక్కా బ్యారేజ్‌ను చూస్తూంటే... ఇండో- పాక్ జల వివాదాలు, ‘భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన నీటి సంధి’ జ్ఞాపకాలు కందిరీగల్లా చుట్టుముడతాయి. ఈ లోపు ‘పద్మ’ అనే పలకరింపు... అంటే బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టానన్నమాట. అది ఒకప్పటి భారతావనే. బ్రహ్మపుత్ర నుంచి చీలిన ఓ పాయ ‘జమున’ను నాకు  తోడుగా తీసుకుని ముందుకెళ్తూ ఉంటే అలాంటిదే మరో పాయ ‘మేఘన’ నేనూ కలుస్తానని నా అంగీకారంతో పనిలేకనే చేరిపోతుంది. మేఘన నాతో కలుస్తుంది అనడం కంటే మేఘన వచ్చి నన్ను తనలో కలుపుకుంటుంది - అనడం సబబేమో. ఎందుకంటే ఆ క్షణం నుంచి ‘పద్మ’ అనే పేరును కూడా నాకు మిగల్చకుండా తన పేరుతోనే పిలిపించుకుంటుంది. నన్ను అందరూ ‘మేఘన’ అంటూ ఉంటే ఇక నేను లేనా అనిపించి మనసు కలుక్కుమంటుంది కూడా. ఏమైనా మనుషుల్లో స్వార్థంతోపాటు కొంచెం ఉదార స్వభావం కనిపిస్తుంటుంది. బంగాళాఖాతంలో కలిసే చోటుకు గంగా (గంగ- బ్రహ్మపుత్ర) డెల్టా అంటూ... నేను మర్చిపోయిన నా పేరును గుర్తు చేసి మురిపిస్తారు.
 
ఎన్ని భాషలో... ఎన్నెన్ని యాసలో!


కపిల మహర్షి మాట మేరకు స్వర్గంలో ఉన్న నన్ను భూమ్మీదకు తీసుకువచ్చే బాధ్యతను కోసల రాజ్యాన్ని పాలించిన సూర్యవంశ రాజు భగీరథుడు చేపట్టాడని పురాణోక్తి. అలా ఆవిర్భావ దశలో నా పేరు భాగీరథి అయింది. గంగోత్రికి నాలుగు కి.మీ.ల దూరంలో తపోవన్... భగీరథుడు తపస్సు చేసినట్లు చెప్పే ప్రదేశం ఉంది. ఇక్కడ 18వ శతాబ్దంలో నాకో ఆలయం కట్టారు. అక్కడ అందరూ ‘గంగామాత’ అంటూ పూజిస్తారు. సముద్రమట్టానికి దాదాపు పదమూడు వేల అడుగుల ఎత్తులో పుట్టిన నన్ను, 2525 కిలోమీటర్ల ప్రయాణంలో అందరూ అక్కున చేర్చుకునేవారే. నా తీరాన్ని ఆసరాగా చేసుకుని జీవనం సాగిస్తున్న మనుషులను చూస్తూ హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, ఘాజీపూర్, భాగల్‌పూర్, మీర్జాపూర్‌ల మీదుగా ప్రయాణిస్తుంటే ఎన్నెన్ని భాషలో, యాసలో. రకరకాల ఆహారపుటలవాట్లు, వస్త్రధారణలు. ఈ మధ్యలో సుందర్‌బన్స్ టైగర్ రిజర్వ్‌లో బెంగాల్ టైగర్‌ను చూస్తూ, రాజ్‌మహల్ కొండల్లో ప్రయాణిస్తూ నా నీటికి ఖనిజలవణాలను సమకూరుస్తుంటాను. అక్కడి ‘సంథాల్’ గిరిపుత్రుల వ్యవసాయాన్ని చూసి తీరాల్సిందే. నా తీరాన ఉన్న నేల సారం అంతా ఇంతా కాదు.

నేలను నమ్ముకున్న రైతు, నీటిని నమ్ముకున్న జాలరి సంతోషంగా జీవిస్తుంటే నా మది పులకించిపోతుంటుంది. వలలో డాల్ఫిన్‌లు పడితే జాలరికి పండగే. పొట్టపోసుకోవడానికి చేపలు పట్టే జాలరి పొట్టకొడుతూ కొందరు అత్యాశపరులు భారీవ్యాపారం కోసం డాల్ఫిన్‌లను విచక్షణరహితంగా తోడేస్తుంటే నాకు గుండె పిండేసినట్లు ఉంటుంది. నేను ఎన్ని ఇచ్చినా మనిషికి ఇంకా ఏదో కావాలనే ఆశ. ఆ అత్యాశతోనే నన్నూ కలుషితం చేస్తున్నారు. దాంతో మిగిలి ఉన్న జలచరాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నన్నే నమ్ముకుని పుట్టిపెరుగుతున్న ఆ ప్రాణులను కాపాడుకోవాలంటే నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. అందుకు మీరూ ఓ చెయ్యి వేస్తారా? నా నీటిని గొంతులో పోస్తే పోయే ప్రాణం నిలుస్తుందని ఒకప్పటి విశ్వాసం, నా నీరు తాగితే ఉన్న ప్రాణం ప్రమాదంలో పడుతుందనేది నేటి నిజం. నా నీటిలో ఆమ్లజని శాతం చాలా ఎక్కువ. స్వయంగా ప్రక్షాళన చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న నదిని. అలాంటి నన్ను ప్రపంచంలోకెల్లా కలుషితమైన నదుల్లో ముందంజలో చేర్చారు. రోజూ గంగాహారతి ఇస్తూ నా ఔన్నత్యాన్ని కీర్తించే ప్రతి పెదవినీ అడుగుతూనే ఉన్నాను. నన్ను నేను ప్రక్షాళన చేసుకోలేని అసహాయతలో చిక్కిన నా కోసం సాయం చేసే చేతులు ఉన్నాయా అని ఎదురు చూస్తూనే ఉన్నాను.
 - వాకా మంజులారెడ్డి
 
పుట్టింది: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి (14 వేల అడుగుల ఎత్తు)
{పవాహదూరం: 2525కి.మీ.లు
సాగర సంగమం: గంగ- బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర (బంగాళాఖాతంలో)
గంగానది ప్రక్షాళన కోసం 1986 జనవరి 14వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘గంగా యాక్షన్ ప్లాన్’కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ అదే ప్రయత్నంలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement