
మాఘమాసంలో మహాశివరాత్రికి కాశీ యాత్ర
కాశీ... కాశీ... కాశీ... అని మూడుసార్లు పలికితే చాలు మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని చెబుతుంది ‘కాశీ ఖండం’. అంతటి మహిమాన్వితమైన నగరాన్ని జన్మలో ఒక్కసారి సందర్శిస్తే చాలు అనుకోని భక్తులు ఉండరు. సాక్షాత్తూ కైలాసనాథుడే కొలువుదీరిన క్షేత్రంగా భాసిల్లుతున్న కాశీకి మరో పేరే – వారణాసి. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే దీన్ని ‘వారణాసి’ అని అంటారు. మన దేశపు సాంస్కృతిక రాజధానిగా, అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి, ప్రపంచంలోనే అతి పురాతన నగరంగా పేరొందింది – వారణాసి. ఈ నగరం శివుని త్రిశూలంపై ఏర్పడిందని చెబుతుంటారు. ఈ నగరం నడిబొడ్డునే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఉంది.
భూ కైలాసం... కాశి
ప్రళయకాలంలో కూడా నాశనం చెందని ఏకైక దివ్య క్షేత్రంగా కాశీకి పేరుంది. ఇది ఆనంద కాననం, కాలభైరవ దర్శనం, విశాలాక్షి వీక్షణం, విశ్వనాథుడి విన్యాసం, అన్నపూర్ణమ్మ అనుగ్రహం, మోక్షపురి, మహాశ్మశానం, పంచక్రోశ క్షేత్రం అనే నామాలతో పూర్వకాలం నుంచి మహాఖ్యాతి పొందిన నగరం. భూలోక కైలాసంగా, భువిలోన కొలువైన పరమేశ్వరుడి నివాసంగా పేరొందిన కాశీ క్షేత్ర దర్శనాన్ని ప్రతీ భక్తుడి దగ్గరకు తీసుకురావాలన్నదే ‘ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంకల్పం.
దేవతల నివాసం
తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలంలాగే వారణాశిలో తొమ్మిది రోజుల నిద్ర ఒక మనిషిలో అంతటి పవిత్రతను చేకూరుస్తుందని కాశీ ఖండం చెబుతోంది. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు వాదన జరిగిందట. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకున్నారట. అప్పుడు భూమిపై ఒక పెద్ద అగ్ని ఉద్భవించిందట. దానికి అంతం లేదట. గర్వంతో ఉన్న బ్రహ్మ దాని ఊపిరి తీయడానికి బయలుదేరాడట. విష్ణువు భూమి లోపలికి వెళ్లారట. ఇలా ఎన్నో వేల సంవత్సరాలు వెతికారట. ఎక్కడా ఆ జ్యోతి కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు. శివుడి రూపం ఆ జ్యోతిర్లింగాలలో కనపడిందట. ఆ జ్యోతిర్లింగమే ఇక్కడి విశ్వనాథ మందిరంలో ప్రతిష్ఠించబడిందట. దేశంలోని అన్ని తీర్థస్థల క్షేత్రాలన్నీ కాశీలో కొలువయ్యాయి. అందుకే కాశీ దర్శనం సర్వదేవతా దర్శనం అంటారు. కాశీలో పవిత్ర గంగానదిలో స్నానం, సూర్య నమస్కారం చేశాక గంగాఘాట్ నుంచి యాత్ర మొదలవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి, విశాలాక్షి దేవాలయాలలో పూజలు, గంగానదికిచ్చే హారతులు, ఒడ్డునే అనేక శ్మశాన వాటికలు, హోరెత్తే శివ పంచాక్షరీ మంత్రాలు... యాత్రికులకు ఆధ్యాత్మికానందాన్ని కలుగజేస్తాయి.
గంగానదీ తీరంలో...
గంగానది తీర ప్రాంతంలో 64 ఘాట్లు ఉన్నాయి. ఇవన్నీ పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. దశాశ్వమేథఘాట్‌లో స్నానం చేస్తే దశ అశ్వమేథయాగాలు చేసినంత పుణ్యం వస్తుందంటారు. ఇక్కడ ఉన్న ఘాట్లలో హరిశ్చంద్ర ఘాట్, సంకట ఘాట్, మున్షీఘాట్, నారఘాట్, తులసీ ఘాట్ ముఖ్యమైనవి. మత్స్యపురాణం ప్రకారం 5 విశేష తీర్థాలైన దశాశ్వమేథ, లోలక్, కేశవ్, బిందు మాధవ్, మణికర్ణికా ఘాట్ ఇక్కడ స్నాన జపాలు అత్యంత పుణ్యాన్ని ఇస్తాయని ప్రతీతి. విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేథ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనది. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకం దారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేథ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. కాశీలో పితృ పక్షాలప్పుడు పిండప్రదానం చేయడం వల్ల పితృదేవతలకు వెయ్యేళ్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
కాల భైరవుని అనుమతి
విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కాబట్టి భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వరగంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఆలయ సమీపంలో ఉన్న బావి బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుంచి నీరు ఊరుతుందని, ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు. ఏ కోణంలో చూసినా వారణాసి హిందువులందరికీ పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షలాదిమందికి పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు.
ఇంతటి మహిమాన్వితమైన కాశీ యాత్ర ఫలాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలనే దృఢసంకల్పంతో తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ‘ఆర్.వి.టూర్స్ అండ్ ట్రావెల్స్’ మాఘ మాసం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్యాకేజీలతో కాశీలో 9 రోజుల నిద్రతో పాటు, కాశీలో తప్పకుండా దర్శించాల్సిన దేవాలయాల దర్శనభాగ్యం మీ అందరికీ కల్పిస్తోంది. ఇలాంటి చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేవదేవుని కృపకు పాత్రులవ్వాని కోరుకుంటున్నాం.