కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్‌హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది.
దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్‌తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.
జీవితాన్ని చదివేస్తోంది!
సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్.
ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది.
ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.
(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!)
Comments
Please login to add a commentAdd a comment