రాజస్థాన్, చిత్తోర్‌ఘర్... పేరు వినగానే మేవార్‌రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్‌ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్‌ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది.
త్యాగమయి పన్నా
రాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్‌ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్‌సింగ్‌ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్‌లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది.
జోవార్ గద్దె
రాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్‌లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్‌లు, గార్డెన్‌లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment