నగదు రహితం దిశగా..
►వ్యవసాయ శాఖ నుంచి మొదలు
►ఎరువులు, పురుగు మందులు, విత్తనాల షాపుల్లో అమలు
►స్వైప్ మిషన్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పేనియర్ సంస్థ
►జిల్లాలో 229 దుకాణాలు
హన్మకొండ: నగదు రహిత జిల్లాగా మార్చేందుకు వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. నగదుతో నిమిత్తం లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్లో ఖాతాలకు నగదు మార్పిడి, డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా కలెక్టర్ అమ్రపాలి చర్యలు చేపడుతున్నారు. జిల్లా మొత్తం ఒకేసారి కాకుండా ప్రభుత్వ శాఖల వారీగా నగదు రహిత సేవలు చేపట్టనున్నారు. ముందుగా వ్యవసాయ శాఖ నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ షాపుల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా నగదు రహిత సేవలను రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ మేరకు పేనియర్ సంస్థకు స్వైప్ మిషన్లు ఏర్పాటు, బ్యాంకులతో లింకేజీ ఏర్పాటు చేసే పనులు అప్పగించారు. పేనియర్ సంస్థ ఇప్పటికే సిద్దిపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఆ జిల్లాలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దుకాణాల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు, బ్యాంకులతో లింకేజీ సౌకర్యం పేనియర్ సంస్థ కల్పిస్తుంది. దీని కోసం ప్రత్యేక డివైస్‌ను రూపొం దించారు. పేనియర్ స్వైప్ మిషన్ మొబైల్ ఫోన్ సహాయంతో పని చేస్తుంది. మొబైల్ ఫోన్లో కనీసం 2జీ ఇంటర్ నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. స్వైప్ మిషన్‌ను మొబైల్ ద్వారా బ్యాంకులకు అనుసంధానిస్తారు. దీంతో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తానాలు కొనుగోలు చేసుకోవచ్చు. డీవైస్ సమస్య ఉత్పన్నమైతే ఏర్పాటు చేసిన నాటి నుంచి సంవత్సరం పాటు పేనియర్ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలు 229 ఉన్నాయి.
ముందుగా ఈ దుకాణాల్లో పేనియర్ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసి నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రమంగా ఇతర దుకాణాల్లోను నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ సేవలు పొందడానికి దుకాణదారులు ఆధార్ కార్డు, పాన్‌కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు కరెంట్ ఖాతాదారులైతే షాపు లైసెన్స్ అందించాల్సి ఉంటుందని పేనియర్ సంస్థ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా ఏరియా మేనేజర్ మణికంఠ తెలిపారు. సేవింగ్ ఖాతాదారులకు షాప్ లైసెన్స్ అవసరం లేదన్నారు. స్వైప్ మిషన్లకు 9866444292 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.