మోదీ దగ్గరున్న నగదు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద పెద్దగా ఆస్తులు లేవన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో 13 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఓ బంగ్లా మాత్రమే ఆయన దగ్గరున్న ప్రధాన ఆస్తి. దీని ధర కాలక్రమంలో 25 రెట్లు పెరిగిపోయి.. దీనివల్లే ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.41 కోట్లకు చేరుకుంది. అయినా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా తన దగ్గర ఉంచుకున్న నగదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 4,700 మాత్రమే. గడిచిన ఆర్థిక సంవత్సరాంతనికి మోదీ వద్ద నున్న చేతిలో నగదు రూ. 4,700 మాత్రమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆయన ఆస్తుల వివరాలను పీఎంవో సోమవారం వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మోదీ వద్ద చేతిలో నగదు 2014 ఆగస్టు 18 నాటికి రూ. 38,700 ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసిపోయేసరికి రూ. 4,700లకు పడిపోయిందని పీఎంవో వెల్లడించింది.
మొత్తానికి ప్రధాని మోదీ స్థిర, చరాస్తులు 2015 మార్చ్ 31 నాటికి కొద్దిగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే రూ. ఒక కోటి 26 లక్షల 12 వేల 288 నుంచి రూ. ఒక కోటి 41 లక్షల 14వేల 893కు పెరిగాయి. మోదీ 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనాలు లేవు. ఇప్పటికీ మోదీకి గుజరాత్ లోనే బ్యాంకు ఖాతా ఉంది. ఢిల్లీలో బ్యాంకు ఖాతా లేదు.
మోదీ వద్ద 45 గ్రాముల బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ గత ఏడాదికాలంలో రూ. 1.21 లక్షల నుంచి రూ. 1.19 లక్షలకు పడిపోయింది. ఆయనకు ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్ (పన్ను మినహాయింపు ఉంటుంది) లో రూ. 20 వేల విలువైన పెట్టుబడులు, రూ. 5.45 లక్షల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, రూ. 1.99 లక్షల జీవిత బీమా, మొత్తంగా రూ. 41.15 లక్షల చరాస్తులు మోదీ వద్ద ఉన్నాయి. మోదీకి ఎలాంటి అప్పులు, రుణాలు లేవు. ఈ మేరకు మోదీ ఆస్తుల వివరాలను 2016 జనవరి 30వ తేదీ నాటికి పీఎంవో వెబ్ సైట్ లో అప్ డేట్ చేశారు.
ఇక స్థిరాస్తి విషయానికొస్తే గాంధీనగర్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మాత్రమే మోదీ వద్ద ఉంది. ఈ నివాస ఆస్తిలో 3,531.45 చదరపు అడుగుల స్థలం మోదీ పేరిట ఉంది. ఇందులో 169.81 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి ఉంది. దీనిని అప్పట్లో మొత్తంగా రూ. 2,47,208లకు కొనుగోలు చేయగా దాని మార్కెట్ విలువ 25 రెట్లు పెరిగిపోయి రూ. కోటికి చేరింది.