క్యాష్ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడనుందా?
న్యూఢిల్లీ: నల్లధనాన్ని నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ట్రైలర్ మాత్రమే అని.. ముందుముందు అసలు సినిమా ఉంటుందని చెబుతూ వస్తున్న కేంద్రం.. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నల్లధనాన్ని నిర్మూలించడం కోసం ఓ వైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే.. మరో వైపు నగదు చెల్లింపులపై ఆంక్షలు, పన్నులు విధించాలని కేంద్రం యోచిస్తోంది.
క్యాష్ ట్యాక్స్ రాబోతోంది!
పెద్ద నోట్లను రద్దుతో ఏర్పడిన నగదు కొరతతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. దీంతో డిసెంబర్ నెలలో జరిగిన డిజిటల్ చెల్లింపులు అంతకుముందు నెలతో పోల్చినప్పుడు 43 శాతం ఎక్కువగా ఉంది. ఈ డిజిటల్ లావాదేవీలను మరింత పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాష్ ట్యాక్స్‌ను తీసుకురాబోతుందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్లో క్యాష్ ట్యాక్స్ ప్రస్థావన ఉండే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. దీని ప్రకారం బ్యాంకు అకౌంట్ల నుంచి నిర్దేశించిన పరిమితిని మించి నగదును విత్ డ్రా చేసే వారిపై కొంతమేర పన్ను పడే అవకాశం ఉంది.
నల్లధనంపై వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్).. 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను, వ్యక్తిగతంగా 15 లక్షల కంటే ఎక్కువగా నగదు కలిగి ఉండటంపై నిషేధం విధించాలని సూచించింది. పార్థసారధి షోమ్ అధ్యక్షతన ఏర్పాటైన ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫామ్ కమిషన్(టార్క్) సైతం బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను విధించాలని రికమండ్ చేసింది. అలాగే సేవింగ్ ఖాతాల నుంచి తప్ప మిగిలిన ఖాతాల నుంచి ఎంత మేర బ్యాంకుల నుంచి విత్ డ్రా అవుతుందో స్పష్టమైన సమాచారం లేదని అది తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాష్ ట్యాక్స్ తీసుకురావడం మూలంగా నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడమే కాకుండా డిజిటల్ వైపు మళ్లించడానికి ఈ చర్య దోహదపడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.