ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డు స్కీమ్!
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా ఉచిత హెల్త్ కార్డు స్కీమ్ ను ప్రారంభిస్తున్నట్టు ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద సుమారు 14 లక్షల మంది ఉద్యోగులకు, పెన్సన్ దారులకు, వారి కుటుంబ సభ్యులకు లబ్ది చేకూరుతుంది అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉచిత హెల్త్ కార్డు స్కీమ్ కోసం ఏటా 400 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. 60 శాతం ప్రభుత్వం భరిస్తుందని.. 40 శాతం ఉద్యోగులు, పెన్షన్ దారులు భరిస్తారని వెల్లడించారు. ఈ పథకం కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో 1885 వ్యాధులు కవర్ అవుతాయన్నారు. జీతాన్ని బట్టి ప్రతి ఉద్యోగి వద్ద నుంచి నెలకు 90 నుంచి 120 రూపాయలు వసూలు చేయనున్నట్టు అధికారులు చెప్పారు.
నేడు జరిగిన మంత్రివర్గ సమీక్ష సమావేశంలో ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెన్సన్ దారులకు, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హెల్త్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.