చిన్న కథల పెద్దాయన
చాసో శతజయంతి ముగింపు- జనవరి 17
తెలుగు కథ వల్ల కొంత మంది వెలిగారు. తెలుగు కథను కొంతమంది వెలిగించారు. చాసో రెండో కోవకు చెందిన సృజనకారుడు. ఆయన వల్ల కథ వెలిగింది కానీ కథ ద్వారా ఆయన వెలగలేదు. వస్తువు, శైలి, శిల్పం, స్థానికత వీటన్నింటి గురించి శ్రద్ధ పెట్టిన కథకుడు ఆయన. ఏ విధంగా చూసినా చాసో తన జీవితంతోనూ రచనా జీవితంతోనూ భావితరాలకు ఒక మార్గం వేశారు. ఆ మార్గంలో నడవడంలోనే భవిష్యత్తు ఉంది.
‘తొమ్మిదేళ్లవాడు. సామ్యం చెప్పినట్టొచ్చింది నీ మూడుమూర్తులు. వచ్చాక చూద్దువుగాని. ఎలాగో నన్నుద్ధరించేవు. నీ వరప్రసాదం ఉండబట్టి ఆయన గణించిన డబ్బు, పిత్రార్జితం దఖలు పడ్డాయి. లేకపోతే నా మరుదులు ముండను చేసి మూల కూర్చో బెడుదురు’...
‘పోనీయ్యండి. నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలుండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లి తల్లిగుణాన్ని చూపించుకుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్లిపోతూ నాకో చీర రవికెల గుడ్డా పెట్టింది’...
‘నాయుడు పెట్టిన డబ్బుతో చదువుకున్నావు. అందుకే ఆ వెధవ ఉద్యోగమైనా చేస్తున్నావు. అతని అన్నమే తిని, అతని బట్టే కడుతున్నావు. నేనేం ద్రోహం నీకు చేశాను? వాణ్ణి దోచి నీకు పెడుతున్నాను, పుస్తె ముడి వేసిన మొగుడివి కదా అని. నాకే ద్రోహబుద్ధి ఉంటే వాడితో లేచి పోనూ? ’....
గుర్తొచ్చాయా పై మూడు మాటలు ఏ కథల్లోవో? నాలుగు ముక్కల్లో లోకరీతిని మన ముందుంచిన ఈ మాటలు చాసోగా మనం పిలుచుకునే చాగంటి సోమయాజులు రాసిన వివిధ కథల్లోవి. ఈ జనవరి 17 నాటికి చాసో పుట్టి వందేళ్లు అవుతుంది. కొత్తల్లో చాసో ఇంగ్లిష్లో కవిత్వం రాశారు. చక్కటి మీటరు, వర్డ్స్వర్త్ డిక్షన్లా ఉన్న చాసోగారి కవిత్వానికి ఇంగ్లిష్, ఫ్రెంచ్ పండితుడు, ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఆచార్య రోణంకి అప్పలస్వామి 1930ల్లో పడిపోయారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారి చాసోగారి మేడగదికి తీసుకువెళ్లింది. తోడు కవి నారాయణబాబు. అడపా దడపా శ్రీశ్రీ. మధ్యలో మరీ కుర్రకవి ఆరుద్ర. ఇక సాహిత్యం, ప్రపంచ సాహిత్యం, సర్రియలిజం లాంటి కొత్తరీతులు... అవే తిండి, తాగుడు, ఊపిరి, ప్రాణం. వీటికి తోడు అరసంతో అనుబంధం. ఈ అనుభవాలన్నీ చాసోని గొప్ప ప్రపంచస్థాయి కథకుణ్ణి చేశాయి. అన్ని రకాల మనుషుల్ని దగ్గరగా చూడటం, వారి రీతుల్ని, పోకడలని, భాషని, భావాల్ని అవగాహన చేసుకుని కథలుగా మలిచారు. కథలు కల్పితాలు కావచ్చు. కాని కథల్లోని పాత్రలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సజీవాలే.
చాసో తాను రాసిన కథల్లో తనకు నచ్చిన కథలు ఇవీ అని ఎంచుకున్నవి నలభై. అందులో మనల్ని కట్టి పడేసేవి ఓ ముప్పై. కవిత్వంలో హైకూల్లా ఆయన కథలు చిన్నగా ఉండి, జీవిత సారాన్ని నాలుగు ముక్కల్లో మన ముందు ఉంచుతాయి. ఏ కథలోనైనా ఈ వాక్యం, ఈ పదం, ఈ వర్ణన అనవసరం అనే ఉదాహరణ లేదు. ఆయన కథలు ‘ఇదీ సంగతి’ అని విషయాన్ని మన ముందుంచుతాయి. అంతేకాని రచయిత పాత్రలో దూరిపోయి ఉపన్యాసాలు ఇవ్వడం, నీతులు చెప్పటం చెయ్యడు. చాసో కింది వర్గాల గురించి రాసిన కథల్లో ‘కుంకుడాకు’ ఒక చక్కటి కథ. కటిక బీదరికం. రాలిన కుంకుడాకులు ఏరుకుని వెళితేగాని పొయ్యి వెలగదు. పొయ్యి మీదికి వాళ్ల అయ్య ఏదైనా తెస్తేనే ఆ రోజుకి తిండి. కుంకుడాకులతో పాటు చింత తోపులలో దొరికిన ఎండుపుల్లల్ని కూడా ఏరుకుంటుంది గౌరి. దొంగతనం అంటగట్టి చావగొడతాడు చింతతోపు యజమాని. గౌరి ఆత్మాభిమానంతో పుల్లల్ని అక్కడే పడేసి కుంకుడాకులు మాత్రం తీసుకెళ్తుంది. ఈ కథ ఇంగ్లిష్లో అనువదింపబడి చాలా పేరు తెచ్చుకుంది. పస్తులున్న పిల్లల కోసం పర్మిట్ లేకుండా బియ్యం పట్టుకెళుతోందని ముసలిదాని వెంటపడతాడు రైల్లో టి.సి. ‘కుక్కుటేశ్వరం’ కథలో. రాసేటప్పుడు శిల్పం ఎలా ఉండాలి అని తెల్సుకోవాలంటే ఈ కథని ఒక పాఠంలా చదవాల్సిందే. ‘కుంటాణ్ణి’ కట్టుకుంటే ఏముంది? ‘గుడ్డాడు’ అయితే నలుగురూ జాలిపడి ఇంత పడేస్తారు. వాడు గుడ్డాడు కాబట్టి ‘ఎర్రి’ తన ముచ్చట్లు తీర్చుకోవచ్చు. ఇంతటి జీవన సత్యాన్ని చెప్పిన కథ ‘ఎంపు’.
మధ్యతరగతి జీవితాన్ని తడిమే కథల్లో ‘ఏలూరెళ్లాలి’ ఎప్పటికీ మర్చిపోలేని కథ. ఆ అభాగ్యురాలికి అంత లోకజ్ఞానం ఉండబట్టే బట్టకట్టి నిలబడగలిగింది. లేకపోతే విధవరాళ్ల విషాదగాథల్లో చేరుపోను. ‘వాయులీనం’ కథలో చాలీచాలని జీతపురాళ్లతో కాలం వెళ్లదీసే భర్త, భార్యకు రోగం వస్తే ఆవిడ ప్రాణంగా దాచుకున్న ఫిడేల్ని స్నేహితుని సలహాతో అమ్మేసి ఆ డబ్బులతో ఆవిడ ప్రాణం కాపాడుకున్న తీరు మనల్ని కన్నీటి పొరలలో ముంచుతుంది. కొడుకు చదువు కోసం చుట్టలు తాగడం మానేసిన తండ్రి కథ ‘ఎందుకు పారేస్తాను నాన్నా’.. మనల్ని ఎంతో గాయపరుస్తుంది.
చెప్పేదేమంటే ఆయన కథలు సమయాన్ని బట్టి ‘కోట్’ చేయాల్సిందే. దశాబ్దాలు గడిచినా ఇది తప్పదు. ఇవేనా- స్కూలు రోజుల్లో అల్లరి పనుల్ని గుర్తు తెచ్చే ‘బ్బబ్బబ్బా’, కుమిలిఘాట్కి వెన్నెల్లో సౌందర్యాధన కోసం వెళ్లి భయంతో రాత్రిని చీకటి చేసుకున్న మిత్రబృందం కథ ‘దుమ్ముల గొండి’, కూలికి కుదిరి మల్లెపొదలకి డబ్బులు పండించినా జబ్బు పడి తినడానికి తిండి లేక చచ్చిపోయిన ముసలాడి కథ ‘బొండు మల్లెలు’. బండలు కొట్టే కూలీ ప్రమాదంలో పోతే డబ్బుతో చావు సర్దుబాటు చేసి పంచుకున్న కథ ‘బండపాటు’. కొడుకుని బట్టల షావుకారికి పెంచుకోవడానికి ఇచ్చి, ఆఖరి చూపు కోసం వచ్చి షాపు మెట్ల మీదే చనిపోయిన గుడిశేటి గున్నమ్మ కథ ‘పోనీ తిను’.. ఇలా మరిన్ని కథలు. దేని గొప్పతనం దానిదే.
తెలుగు కథకు ఒంపుసొంపుల్ని దిద్ది కథ అంటే ఇలా ఉండాలి అని నిర్వచించిన చాసో చిన్న కథల పెద్దాయన. మన భాష ప్రాంతీయభాష కావచ్చు. కాని మన కథలు అంతర్జాతీయ స్థాయివి అని నిరూపించిన వ్యక్తి. మీ దగ్గర ఎప్పుడో కొన్న చాసో కథల పుస్తకం ఉంటే తీసి మళ్లీ చదవండి. కాకపోతే కొత్తగా వచ్చిన ఎడిషన్లో పెద్ద అక్షరాలతో ఉన్న ఆ కథల్ని మరోసారి చదివి భుజానికెత్తు ్తకోండి. మన ‘మపాసా’, ‘మన చెహోవ్’ అని కొత్త తరాల వారికి అరచి మీరే చెప్పండి. మిమ్మల్ని మీరే గౌరవించుకోండి.
- కృష్ణమోహన్బాబు 9848023384