కుల దూషణ కేసులో సర్పంచికి జైలు
గుంటూరు లీగల్: అంగన్వాడీ కార్యకర్తను కులంపేరుతో దూషించి అవమాన పరచిన కేసులో నిందితుడైన ఓ పంచాయతీ సర్పంచ్‌కు జైలు శిక్ష ఖరారైంది. కోర్టు రెండేళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 25 వేలు జరిమాన విధిస్తూ జరిమానలో రూ. 20 వేలు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 4 వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పెదనందిపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన దీపల నాగవేణి అలియాస్ గేరా నాగవేణి అదే గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఏసుపాగ అంజలి అంగన్వాడీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. 2014 జనవరి 24న అంజలి తనకు రెండు నెలలు సెలæలవు కావాలని నాగవేణిని అడిగింది. అన్ని రోజులు సెలవులు ఇచ్చే అధికారం తనకు లేదని చైల్డ్ డెవలెప్ మెంట్ ఆఫీసర్ (సి.డి.పి.ఒ) బిల్లా మాణిక్యరావుకు ఆ అధికారం ఉందని ఆయనను అడగమని చెప్పింది. ఆయా ఆ పని చేయకుండా గ్రామ సర్పంచి నాగినేని శివశంకరరావు ఫిర్యాదు చేసింది. సర్పంచి సెలవు ఇవ్వాలని కోరగా అంగన్వాడీ సీడీపీవోను అడగమని సూచించింది. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచి నాగవేణిని కులంపేరుతో దూషించి అవమాన పరచాడు. ఘటనపై నాగవేణి భర్త 2014 నవంబర్ 8న పెదనందిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం శివశంకరరావుపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు. ఏపీపీ నక్కా శారదామణి ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి బాపట్ల డీఎస్పీ కె.సుధాకర్ కేసు దర్యాప్తు చేశారు.