caste boycott
-
ఎంత అమానుషం!.. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ
సాక్షి, ఖమ్మం: దేవుడి ఉత్సవానికి చందా ఇవ్వలేదనే కారణంతో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన కూసుమంచి మండలంలోని నేలపట్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని దళిత వాడలో పది రోజుల క్రితం బంగారు మైసమ్మ ఉత్సవ నిర్వహణ కోసం ఉత్సవ కమిటీ సభ్యులు, కులపెద్దలు చందాలు వసూలు చేశారు. కులస్తులంతా ఇంటికి రూ.1,500 చొప్పున వేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలకొండ వీరబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి చందా అడగగా, తాను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని, చందా ఇవ్వలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు వీరబాబుకు కులస్తులు ఎవరూ సహాయం చేయవద్దని హుకుం జారీ చేశారు. దీంతో కులానికి చెందిన వారు ఎవరూ సహకరించకుండా ఉండడంతో వీరబాబు, అతడి తల్లి సుగుణమ్మ కులపెద్దల వద్దకు వెళ్లి రూ.1,500 ఇస్తామని చెప్పగా.. తాము అడిగినప్పుడు ఇవ్వనందున ఇప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని కులపెద్దలు అన్నారు. దీంతో చేసేదేమీలేక వీరబాబు కుటుంబసభ్యులు మిన్నకుండి పోయారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి కిరాణ సరుకులు అమ్మకపోవటం, వీరబాబు భార్య వీరకుమారికి నలతగా ఉంటే మందుల కోసం అదే కులానికి చెందిన ఆశ కార్యకర్త వద్దకు వెళ్లినా ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయమై వీరబాబు, అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు. చదవండి: కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్ -
వివాహేతర సంబంధం: నాలుగు కుటుంబాలకు నిలువనీడ లేకుండా చేసింది
సాక్షి,జయపురం: వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణపై ఓ యువకుని కుటుంబంతో పాటు వారి బంధువులపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేసి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ సంఘటన నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి అకడహిల్ గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు కుటుంబాలు గ్రామ బహిష్కరణ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అకడహిల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో మూడు నెలల కిందట మహిళ కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తాళ్లతో కట్టేసి దండించారు. అనంతరం ఓ ఇంట్లో బంధించారు. సమాచారం అందుకున్న ఉమ్మరకోట్ పోలీసులు గ్రామంలో విచారణ చేసేందుకు రాగా, వివాహితపై ఆ యువకుడు అత్యాచారం చేశాడని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ బంధువులు అక్కడితో ఆగకుండా..యువకుని కుటుంబంతో పాటు వారి కులానికి చెందిన మరో మూడు కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారు. ఇళ్లు ధ్వంసం చేశారు. వారందరినీ గ్రామం నుంచి తరిమేశారు. ప్రాణభయంతో వారంతా గ్రామం విడిచిపెట్టి సమీపంలోని బాగడియా గ్రామానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ..యువకుడు తప్పు చేసి ఉంటే అతిడిని శిక్షించాలి. కానీ ఆ కులస్తులందరినీ హింసించి గ్రామం నుంచి బహిష్కరించడం, వారి ఇళ్లు ధ్వంసం చేయడం, ఆస్తులు దోచుకోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీసు అధికారి నరేష్ కుమార్ ప్రధాన్‌ను సంప్రదించగా..యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని..
చొప్పరమెట్ల(ఆగిరిపల్లి, నూజివీడు): గతంలో గ్రామం నుంచి వెలివేసిన వ్యక్తితో కలసి వలంటీర్ కుటుంబం ఆటోలో ఊరిలోకి రావడాన్ని జీర్ణించుకోలేని ఓ సామాజిక వర్గానికి చెందిన కులపెద్దలు వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల శివారు గొల్లగూడెంలో చోటు చేసుకున్న ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గొల్లగూడెంకు చెందిన గంపా పంగిడేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులు వలంటీర్‌గా పనిచేస్తున్న కొడుకు ప్రవీణ్‌కుమార్, కుమార్తె మానసతో కలిసి గత నెల 7న గుంటూరు జిల్లా గోరంట్లలో చర్చికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అదే గ్రామం నుంచి ఏడేళ్ల క్రితం వెలివేయబడ్డ జువ్వనబోయిన విజయ్‌బాబు కూడా వీరితో కలసి ఆటోలో గ్రామానికి వచ్చాడు. దీన్ని ఫొటో తీసిన అదే సామాజిక వర్గానికి చెందిన గంపా రత్తయ్య కులపెద్దలకు చెప్పడమేగాక వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. మరుసటిరోజు కులపెద్దలు సమావేశమై వలంటీర్ ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యులను పిలిపించి వెలివేసిన కుటుంబంతో కలసి ఒకే ఆటోలో ఎందుకొచ్చారని నిలదీశారు. కిరాయి ఆటోలో వచ్చాం తప్ప వెలివేసిన కుటుంబానికి, తమకు సంబంధం లేదని వారు చెప్పారు. అయితే దీన్ని తప్పుగా పరిగణించిన కులపెద్దలు రూ.5 వేలు కట్టాలని, లేకుంటే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాలని తీర్మానించారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించబోయిన ధనలక్ష్మిపై దాడికి సైతం దిగారు. చేసేది లేక ఆ కుటుంబం వెనుతిరిగింది. తర్వాత గత నెల 28న దేవర జాతరను పురస్కరించుకుని ప్రవీణ్‌కుమార్ రూ.5 వేలు తీసుకెళ్లి ఇవ్వబోగా ఇంకా ఊర్లో నుంచి ఎందుకు వెళ్లలేదు? అంటూ కులపెద్దలు ప్రశ్నించారు. అంతేగాక గ్రామంలో ఎవరైనా వలంటీర్ కుటుంబంతో మాట్లాడినా, వారికి మంచినీళ్లు ఇచ్చినా రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో పొరుగునున్న వడ్లమాను గ్రామంలోని బంధువుల ఇంట్లో ఆ కుటుంబం తలదాచుకుంటోంది. బంధువుల సాయంతో ధనలక్ష్మి ఈ అమానుషంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. చదవండి: జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు పాపం ఆ పిల్లలేం చేశారు? -
గ్రామపెద్దల ఆటవిక తీర్పు..
హత్యకు గురైన యువతి తండ్రికి కుల బహిష్కరణ - గతేడాది అత్యాచారం.. హత్యకు గురైన కూతురు - పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి - హంతకుడితో రాజీపడాలన్న గ్రామ పెద్దలు - జంగరాయి గ్రామ పెదరాయుళ్ల తీరు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/చిన్న శంకరంపేట: ఆ తండ్రి ఒక్కగానొక్క కూతురును అత్యంత పాశవికంగా ఓ మృగాడు హత్యచేశాడు.. ఆమె పై అత్యాచారం చేసి, ఆపై కత్తులతో పొడిచి.. పొడిచి చంపేశాడు. శవాన్ని డ్రమ్ములో కుక్కి అడవిలో విసిరేశాడు. తన కూతుర్ని చంపిన కిరాతకుడిని శిక్షపడాలని ఆ తండ్రి కోర్టులు, ఠాణాల చుట్టూ తిరుగుతుంటే, గ్రామ పెదరాయుళ్లు మాత్రం రివర్స్‌లో వచ్చారు. హంతకుడితో రాజీపడాలంటూ మృతురాలి తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. లెక్కచేయని మృతురాలి తండ్రిని కుల బహిష్కరణ చేశారు. తీర్పును ఉల్లంఘించిన వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన చెరుకు దుర్గారెడ్డి కూతురు మౌనిక (22) గతేడాది మేలో ఇంటికి వచ్చింది. మూడు రోజులపాటు ఇంట్లోనే ఉన్న మౌనిక అదేనెల 13న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అదేనెల 16న మెదక్ మండలం రాయిన్‌పల్లి అటవీప్రాంతంలో శవమై కన్పించింది. మౌనికపై అత్యాచారం చేసి, కత్తులతో పొడిచి, మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో కుక్కి అటవీప్రాంతంలో విసిరేసి పోయారు. ఈ కేసుపై విచారణ జరిపిన మెద క్ రూరల్ పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం. రాంరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి, అతనిపై హ త్యానేరం కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పిం చుకు తిరగుతున్న రాంరెడ్డిని ఏపీ గుంటూరు జిల్లాలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హంతకుడికి భార్య, ఇద్దరు పిల్లలు, జంగరాయిలో 4 ఎకరాల పొలం ఉంది. బెయిల్‌పై బయటికి వచ్చినప్పటికీ రాంరెడ్డి ఊరుకు దూరంగానే ఉన్నాడు. పొలాన్ని దున్నటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో బీడుపడింది. కాగా ఇటీవల రాంరెడ్డి కొంతమంది గ్రామ పెద్దలను కలిసి మృతురాలు తండ్రి దుర్గారెడ్డికి, తనకు మధ్య రాజీ కుదర్చాల న్నాడు. కులపెద్దలు దుర్గారెడ్డిని పిలిచి పంచా యితీ పెట్టారు. పంచాయితీలో రాంరెడ్డి తప్పు చేశాడని నిర్ధారించారు. అతను చేసిన తప్పుకు శిక్షగా రూ 1.5 లక్షలు జరిమానా విధిస్తామని, కేసులో రాజీపడాలని కులపెద్దలు దుర్గారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. తన కూతురును హత్య చేసిన వ్యక్తితో రాజీపడేదిలేదని చెప్పి గ్రామపెద్దల మాటను దుర్గారెడ్డి తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు దుర్గారెడ్డి కుటుం బాన్ని కుల బహిష్కరణ చేశారు. ఊరిలో ఆయన కుటుంబానికి ఎవరైనా సహకరిస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తీర్పు తక్షణమే అమల్లోకి... ఈ తీర్పుతో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు దుర్గారెడ్డి భార్య లక్షి బతుకమ్మను తీసుకొని వెళ్లగా.. తోటి మహిళలు ఆమెను కలవనివ్వలేదు. మరోవైపు దుర్గారెడ్డి కొడుకు పెళ్లికి ముహుర్తం కూడా పెట్టుకున్నాడు. గ్రామపెద్దల తీర్పుతో ఈ పెళ్లి పనులకు గ్రామస్తులు ఎవరూ సహకరించడం లేదు. సంపినోడికి శిక్షపడాల్సిందే నా బిడ్డను చంపిన హంతకుడితో రాజీపడితే నాకు రూ. 1.5 లక్షలు ఇప్పిస్తామని మా గ్రామ పెద్దలు నాపై ఒత్తిడి తెచ్చారు. నా బిడ్డే పోయినంక.. ఇక ఈ డబ్బు నాకు ఎందుక న్నా.. నా బిడ్డను చంపిన హంతకుడు వాడు, వానికి శిక్ష పడాలని చెప్పిన.. నా మాటలు త ప్పట.. అంతా కలిసి నన్ను, నా కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. - దుర్గారెడ్డి కౌన్సిలింగ్ చేశాం : ఎస్ఐ గ్రామ పెద్దల తీర్పుపై దుర్గారెడ్డి చిన్నశంకరంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్సైను వివరణ కోరగా.. ఫిర్యా దు అందిన మాట నిజమేనన్నారు. గ్రామంలోని కులపెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. అయినా వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని అన్నారు. -
కులబహిష్కరణ చేశారని.. ఆత్మహత్యాయత్నం!
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. దుబ్బాక మండలం పోతిరెడ్డిపేటలో కుల బహిష్కరణకు గురయ్యామన్న ఆవేదనతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొడుకు చనిపోతాడన్న బాధతో కిందే ఉన్న తండ్రి పురుగుల మందు తాగేశాడు. పోతిరెడ్డిపేటకు చెందిన మురళీగౌడ్ స్థానికంగా ఉన్న కల్లు సొసైటీలో సభ్యుడు. అక్కడ కల్లు సీసా పది రూపాయలకు అమ్మాలని ఓ కట్టుబాటు ఉంది. అయితే మురళీగౌడ్ దాన్ని ఉల్లంఘించి ఐదు రూపాయలకే అమ్ముతున్నాడంటూ అతడిని అటు సొసైటీ నుంచి, ఇటు కులం నుంచి కూడా బహిష్కరించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి చెందిన మురళీగౌడ్.. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొడుకు పడిపోతాడేమోనని ఆందోళన చెందిన తండ్రి నర్సాగౌడ్ అక్కడే పురుగుల మందు తాగేశాడు. దాంతో స్థానికులు అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తండ్రి విషయం తెలిసిన మురళీగౌడ్ కూడా టవర్ దిగాడు. అయితే, అసలు కల్లు దుకాణంలో ఇలా తీర్మానం చేయడం, కులబహిష్కరణ చేయడం చట్ట విరుద్ధమని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే తాము చర్యలు తీసుకుంటామంటున్నారు.