తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న వీరబాబు దంపతులు
సాక్షి, ఖమ్మం: దేవుడి ఉత్సవానికి చందా ఇవ్వలేదనే కారణంతో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన కూసుమంచి మండలంలోని నేలపట్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని దళిత వాడలో పది రోజుల క్రితం బంగారు మైసమ్మ ఉత్సవ నిర్వహణ కోసం ఉత్సవ కమిటీ సభ్యులు, కులపెద్దలు చందాలు వసూలు చేశారు. కులస్తులంతా ఇంటికి రూ.1,500 చొప్పున వేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలకొండ వీరబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి చందా అడగగా, తాను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని, చందా ఇవ్వలేనని చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన కులపెద్దలు వీరబాబుకు కులస్తులు ఎవరూ సహాయం చేయవద్దని హుకుం జారీ చేశారు. దీంతో కులానికి చెందిన వారు ఎవరూ సహకరించకుండా ఉండడంతో వీరబాబు, అతడి తల్లి సుగుణమ్మ కులపెద్దల వద్దకు వెళ్లి రూ.1,500 ఇస్తామని చెప్పగా.. తాము అడిగినప్పుడు ఇవ్వనందున ఇప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని కులపెద్దలు అన్నారు. దీంతో చేసేదేమీలేక వీరబాబు కుటుంబసభ్యులు మిన్నకుండి పోయారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి కిరాణ సరుకులు అమ్మకపోవటం, వీరబాబు భార్య వీరకుమారికి నలతగా ఉంటే మందుల కోసం అదే కులానికి చెందిన ఆశ కార్యకర్త వద్దకు వెళ్లినా ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయమై వీరబాబు, అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు.
చదవండి: కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment