గ్రామ బహిష్కరణకు గురైన వలంటీర్ కుటుంబం
చొప్పరమెట్ల(ఆగిరిపల్లి, నూజివీడు): గతంలో గ్రామం నుంచి వెలివేసిన వ్యక్తితో కలసి వలంటీర్ కుటుంబం ఆటోలో ఊరిలోకి రావడాన్ని జీర్ణించుకోలేని ఓ సామాజిక వర్గానికి చెందిన కులపెద్దలు వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల శివారు గొల్లగూడెంలో చోటు చేసుకున్న ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గొల్లగూడెంకు చెందిన గంపా పంగిడేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులు వలంటీర్‌గా పనిచేస్తున్న కొడుకు ప్రవీణ్‌కుమార్, కుమార్తె మానసతో కలిసి గత నెల 7న గుంటూరు జిల్లా గోరంట్లలో చర్చికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో అదే గ్రామం నుంచి ఏడేళ్ల క్రితం వెలివేయబడ్డ జువ్వనబోయిన విజయ్‌బాబు కూడా వీరితో కలసి ఆటోలో గ్రామానికి వచ్చాడు. దీన్ని ఫొటో తీసిన అదే సామాజిక వర్గానికి చెందిన గంపా రత్తయ్య కులపెద్దలకు చెప్పడమేగాక వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. మరుసటిరోజు కులపెద్దలు సమావేశమై వలంటీర్ ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యులను పిలిపించి వెలివేసిన కుటుంబంతో కలసి ఒకే ఆటోలో ఎందుకొచ్చారని నిలదీశారు. కిరాయి ఆటోలో వచ్చాం తప్ప వెలివేసిన కుటుంబానికి, తమకు సంబంధం లేదని వారు చెప్పారు.
అయితే దీన్ని తప్పుగా పరిగణించిన కులపెద్దలు రూ.5 వేలు కట్టాలని, లేకుంటే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాలని తీర్మానించారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించబోయిన ధనలక్ష్మిపై దాడికి సైతం దిగారు. చేసేది లేక ఆ కుటుంబం వెనుతిరిగింది. తర్వాత గత నెల 28న దేవర జాతరను పురస్కరించుకుని ప్రవీణ్‌కుమార్ రూ.5 వేలు తీసుకెళ్లి ఇవ్వబోగా ఇంకా ఊర్లో నుంచి ఎందుకు వెళ్లలేదు? అంటూ కులపెద్దలు ప్రశ్నించారు. అంతేగాక గ్రామంలో ఎవరైనా వలంటీర్ కుటుంబంతో మాట్లాడినా, వారికి మంచినీళ్లు ఇచ్చినా రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో పొరుగునున్న వడ్లమాను గ్రామంలోని బంధువుల ఇంట్లో ఆ కుటుంబం తలదాచుకుంటోంది. బంధువుల సాయంతో ధనలక్ష్మి ఈ అమానుషంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.
చదవండి:
జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు
పాపం ఆ పిల్లలేం చేశారు?
Comments
Please login to add a commentAdd a comment