టీఎన్‌సీఏ లీగ్‌కు ‘క్యాట్’ ఆటగాళ్లు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సీఏ) నిర్వహించే లీగ్ టోర్నమెంట్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్)కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు శ్రావణ్ కుమార్, రోహన్ కుమార్‌లు ఎంపికయ్యారు. టీఎన్‌సీఏ లీగ్ సభ్యులు బాలాజీ, శివకుమార్, సంతోష్ గోపీలు బుధవారం నగరంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 35 మంది కుర్రాళ్లు పాల్గొనగా రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రావణ్, రోహన్‌లను టీఎన్‌సీఏ వర్గాలు ఎంపిక చేశాయి. దేశంలో ఇతర రాష్ట్రానికి చెందిన అసోసియేషన్ నేరుగా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయడం ఇదే మొదటిసారని క్యాట్ సెక్రటరీ సునీల్‌బాబు తెలిపారు.
తమ ఆటగాళ్లు తమిళనాడు లీగ్‌కు ఎంపికవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం క్యాట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డివిజన్–4 లీగ్స్‌కు వీరిద్దరు ఎంపికయ్యారని, ఈ నెల 24 నుంచి చెన్నైలో జరిగే టీఎన్‌సీఏ లీగ్ ఆడతారని చెప్పారు. వీరికి వచ్చే ఏడాది నుంచి రూ. లక్ష పారితోషికం లభించనుందని సునీల్ చెప్పారు. త్వరలో తమిళనాడుకు చెందిన 30 క్లబ్‌లు క్యాట్ ఆటగాళ్లను సెలెక్ట్ చేసేందుకు నగరానికి రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎల్ డైరెక్టర్ పదం పారక్ పాల్గొన్నారు.