వేసవి లోతు దుక్కులు, ప్రయోజనాలు
కృత్తిక కార్తె ( మే 11 నుంచి )
ఈ వారం వ్యవసాయ సూచనలు
తొలకరిలో మొదటగా వచ్చే వర్షాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వేసవి దుక్కులు చేయాలి.
భూమిని 15-30 సెం. మీ.ల లోతు దున్నడం వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. వాలుకు అడ్డంగా దుక్కులు దున్నడం వలన నేల కోతకు గురికాకుండా ఉంటుంది.
చేలలో ఉండే మొండి జాతి కలుపు మొక్కల దుంపలతో సహా పెకలించేలా లోతు దుక్కి దున్నడం వల్ల కలుపు బెడద ఉండదు.
భూమిలో నిద్రావస్థలో ఉన్న పలు కీటకాల కోశస్థ దశలు నశింపబడి తదుపరి వేసే పంటల మీద చీడపీడల ఉధృతి తగ్గించవచ్చు.
తొలకరిలో దున్నటం వలన నేలలోకి నీరు బాగా ఇంకి భూమి బాగా గుల్లబారి.. తరువాత వేసే పంటకు ఉపయోగపడుతుంది.
పంట మొక్కల వేర్లు లోనికి పోయి తేమను, పోషకాలను ఎక్కువ శాతం అందుకొని దిగుబడులు, నాణ్యత పెరుగుతాయి.
వేసవిలో దున్నటం వలన గత పంటకు చెందిన ఆకులు, చెత్త నేలలో కలిసి సేంద్రియ పదార్థంగా మారతాయి.
ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో వేసవి దుక్కులు చేస్తే.. భూమిలోని శిలీంధ్రాలు నశించి తర్వాత పంటకాలానికి ఆ తెగులు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
ముందుగానే దుక్కి చేసుకోవడం వలన వర్షాలు కురవగానే ఖరీఫ్ పంటలను సరైన అదనులో వేసుకోవచ్చు.
రేపు విత్తన దినోత్సవం: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని విత్తన పరిశోధన, సాంకేతిక సంస్థలో ఈ నెల 13న విత్తన దినోత్సవం జరుగుతుంది. అధికారులు, శాస్త్ర వేత్తలతో రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన రైతుల ఇష్టాగోష్టి జరుగుతుంది. వివిధ పంటలకు సంబంధించిన మేలు రకం విత్తనాలను ప్రదర్శిస్తారు. వరి మూల విత్తనాలను రైతులకు విక్రయిస్తారు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551
పశువులకు టీకాలు వేయించే కాలం ఇదే..
పాడి పశువుల ఆరోగ్య రక్షణకు టీకాలు వేయించడం ఉపయోగకరం.
ఒక్కో పశువుకు రూ. 2, 3ల ఖర్చుతోనే టీకాలు వేయొచ్చు. ఏడాది వరకు పనిచేస్తుంది. గొంతువాపు, జబ్బవాపులకు ఒకే టీకా చాలు.3 నెలల నుంచి మూడేళ్ల వయసు పశువుల వరకు గొంతువాపు సోకే అవకాశం ఉంది. గొంతు కింద వాపొస్తుంది. తీవ్ర జ్వరం వస్తుంది.తెల్ల గొడ్లకు ఎక్కువగా జబ్బవాపు వస్తుంది. జబ్బ దగ్గర వాయడం వల్ల పశువులు కుంటుతుంటాయి. ఖరీదైన చికిత్స కన్నా నివారణే మిన్న.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స,6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com