'2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్'
హైదరాబాద్: ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తొలి విడతలో 5,200 గ్రామాల్లో అమలు చేస్తామని ఆయన అన్నారు. అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తామని ఓ ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు.
ఈ పథక విధివిధానాలపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతి పల్లెలో సురక్షిత తాగునీటిని తక్కువ ధరకే అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామంలో రూ.2కే 20 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆధికారులకు అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు.