ఆధార్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు
హాంబర్గ్ : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ పథకం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బ్యాంకింగ్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయడానికి, నగదు వ్యవహారాలను తగ్గించడానికి భారత్ ఆధార్‌ను వినియోగిస్తోందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్(ఎఫ్ఎస్బీ) అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ఆధార్ వినియోగం వల్ల రెమిటెన్స్ చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక విధానాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ కోఆర్డినేషన్ గ్రూప్(సీబీసీజీ)ను ఎఫ్ఎస్బీ ఏర్పాటుచేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర దేశాధినేతలు శుక్రవారం నాడిక్కడ జీ–20 సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో ఎఫ్ఎస్బీ తన కార్యాచరణను సమర్పించింది.