నా వ్యాఖ్యలు వక్రీకరించారు
‘దావూద్ లొంగుబాటు’ వార్తలకు సీబీఐ మాజీ అధికారి నీరజ్ కుమార్ ఖండన
దావూద్ లొంగిపోతాడన్న సమాచారం ఎవరూ ఇవ్వలేదు: విజయరామారావు
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం 1993 ముంబై బాంబు పేలుళ్ల అనంతరం లొంగిపోతానని తనతో సంప్రదింపులు జరిపారని, అయితే అప్పటి ప్రభుత్వం చివరి క్షణంలో ఆ ప్రయత్నాలను వమ్ముచేసిందని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్, నాడు సీబీఐ డీఐజీగా ముంబై పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన నీరజ్‌కుమార్ ఖండించారు. ముంబై పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దావూద్.. తనతో సంప్రదింపులు జరిపాడని, లొంగిపోవటానికి సంసిద్ధత తెలిపాడని, అయితే అప్పటి తన రాజకీయ బాసులు ఈ ప్రణాళికను చివరి క్షణంలో అడ్డుకున్నారని నీరజ్ తమకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు జాతీయ ఆంగ్ల దినపత్రిక శనివారం ఒక కథనం ప్రచురించింది. దీనిపై నీరజ్ స్పందిస్తూ.. తాను ఆ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, సదరు విలేకరి తనకు తెలుసునని, ఆయనతో మాట్లాడిన మాటలను వక్రీకరించారని.. అవి సరికాదని, దురదృష్టకరమైనవని శనివారం మీడియాతో అన్నారు. అయితే.. తాను సీబీఐ డీఐజీగా ముంబై పేలుళ్ల కేసును దర్యాప్తు చేసినపుడు దావూద్ తనతో మాట్లాడాడని, అది పేలుళ్లలో తన పాత్ర లేదని చెప్పటం కోసమే మాట్లాడాడని తెలిపారు.
లొంగిపోతాడంటే వద్దని ఎవరంటారు?
ఇదిలావుంటే.. దావూద్ లొంగిపోవటానికి సిద్ధపడినప్పటికీ, అప్పటి ప్రభుత్వం అడ్డుకుందని నీరజ్ అన్నట్లు వచ్చిన కథనాన్ని నాడు సీబీఐ డెరైక్టర్‌గా ఉన్న విజయరామారావు ఖండించారు. ‘ముంబై పేలుళ్లు జరిగిన 4 నెలలకు నేను సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నా. నేను ఉన్న మూడేళ్లు దావూద్‌ను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. అప్పుడు దావూద్ కేసులో నీరజ్ సీబీఐలో చీఫ్ ఇన్వెస్టిగేటివ్ అధికారి. ఆయనపైన మరో అధికారి జాయింట్ డెరైక్టర్ హోదాలో ఉన్నారు. దావూద్ సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం.. ఏ అధికారీ నాకు చెప్పలేదు. దావూద్ లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తే.. చేసి ఉండొచ్చు. లొంగిపోతాడంటే.. వద్దని ఎవరు చెప్తారు? అతడు లొంగిపోతాడనే సమాచారం నాకు ఎవ్వరూ ఇవ్వలేదు. నేను ఉన్న మూడేళ్ల కాలంలో ఎప్పుడూ దావూద్ లొంగిపోతాడన్న సమాచారం రాలేదు. ఒకవేళ లొంగిపోతానంటే.. పట్టుకోడానికి మాకేం అభ్యంతరం? ఎలాంటి సమాచారం వచ్చినా.. అది సీబీఐలో రికార్డు అవుతుంది. దావూద్గురించి అనేక సమాచారం వచ్చింది... కాని సరెండర్ సమాచారం మాత్రం రాలేదని కచ్చితంగా చెప్పగలను’ అని ఆయన శనివారం హైదరాబాద్‌లో ‘సాక్షి’ టీవీకి చెప్పారు.