జీడీపీలో 15%కు బాండ్ల మార్కెట్
ముంబై: వివేకవంతమైన నియంత్రణ విధానాలు, సంస్కరణలు అమలు చేస్తే దేశ కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరిస్తుందని సీఐఐ నిర్వహించిన సర్వే పేర్కొంది. తద్వారా ప్రస్తుత పంచవర్ష ప్రణాళికా కాలం(2012-17)లో కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌ను జీడీపీలో 15%కు చేర్చవచ్చునని తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ వాటా 5%కు దిగువనే ఉంది. సరైన సంస్కరణలు, విధానాల ద్వారా ఐదేళ్ల కాలంలో జీడీపీలో 15% వాటాను ఆక్రమించేందుకు అవకాశమున్నదని తెలిపింది.
కార్పొరేట్ బాండ్ల మార్కెట్ సంస్కరణల(సీబీఎం)కు సంబంధించిన ఈ సర్వేను బాండ్ల జారీదారులు, ఇన్వెస్టర్లు, మార్కెట్ మేకర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు, సాంకేతిక నిపుణులతో నిర్వహించింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ వృద్ధి చెందితే భారత్ వంటి వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిధుల సమీకరణకు వీలు చిక్కుతుందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకు తగిన రీతిలో నియంత్రణ విధానాలు, సంస్కరణలను తీసుకురావలసి ఉన్నదని చెప్పారు. 12వ ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల రంగ పెట్టుబడులకు సంబంధించి 47% వాటా లక్ష్యాన్ని ప్రైవేట్ రంగం సాధించాల్సి ఉన్నదని, ఇందుకు సీబీఎం వృద్ధి కీలకమని వివ రించారు.