అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప సెంట్రల్ జైల్ సమీపంలో అనుమానాస్పదంగా వెళుతున్న బీఆర్ ధనుంజయ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ సీఐ ఆర్.పురుషోత్తంరాజు తెలిపారు. శనివారం సీఐ నిందితుని వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా బండహ ల్లికి చెందిన బీఆర్ ధనుంజయ(34) ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరిలో నివాసముంటున్నాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో గొడవపడి పారిపోయి హైదరాబాద్‌లో ఉంటూ హోటళ్లలో పని చేస్తూ నేరగాళ్లతో పరిచయం పెంచుకున్నాడు.
హైదరాబాద్, బెంగుళూరు, ప్రొద్దుటూరు, కడప, పులివెందుల, వేంపల్లె, బళ్లారిలో రాత్రి పూట దొంగతనాలు చేస్తూ చాలాసార్లు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు జైల్లో ఉండగా కాలువ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో తరచుగా కుమార్‌తో ఫోన్లో మాట్లాడేవాడు. కుమార్ కూడా గతంలో సంబటూరులో జరిగిన ఏడు హత్యల కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం కుమార్ నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లెలో ఉంటూ ఎర్రచెర్లోపల్లెకు చెందిన పిచ్చిరెడ్డితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో పిచ్చిరెడ్డి తనకు వరుసకు చెల్లెలైన లక్ష్మిదేవిని చంపించడానికి కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుమార్ తనకు పరిచయం ఉన్న ధనుంజయతో ఫోన్లో మాట్లాడి తాను కుదుర్చుకున్న ఒప్పందం గురించి చెప్పాడు. ధనుంజయ తన మిత్రుడు అశోక్‌ను వెంట బెట్టుకుని రాజంపేటకు వచ్చాడు. పిచ్చిరెడ్డి, కుమార్ల ద్వారా లక్ష్మిదేవి ఆచూకీ తెలుసుకున్నారు. రూ.3 లక్షలకు మహిళను చంపేందుకు ఒప్పందం కుదిరింది. ఆమెను గత నెల 31వ తేదీ రాత్రి లక్ష్మిదేవి ఇంట్లోనే హత్య చేశారు. ఈ కేసుతోపాటు జిల్లాలో జరిగిన వివిధ షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాలలో ధనుంజయ ప్రమేయం ఉండడంతో అరెస్ట్ చేశారు.