సీడీపీఓల సస్పెన్షన్
పెనుకొండ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐసీడీఎస్ పెనుకొండ సీడీపీఓ ప్రభావతమ్మ,గతంలో పెనుకొండలో పనిచేసి ప్రస్తుతం హిందూపురం అడిషనల్ సీడీపీఓగా ఉన్న లీలా విజయకుమారి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013–14 మధ్యకాలంలో ఇందిరమ్మ అమృత హస్తం పథకం కింద గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించకుండా లీలావిజయకుమారి అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
కమిషనర్, కలెక్టర్, ఐసీడీఎస్ పీడీలకు ఫిర్యాదులు వెళ్లగా ఇటీవల విచారణ చేయించారు. అలాగే ప్రస్తుత పెనుకొండ సీడీపీఓ ప్రభావతమ్మ పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోని అంగన్వాడీ అద్దె భవనాలకు సంబంధించి బాడుగ డబ్బు డ్రా చేసి.. రూ. 3.15లక్షలు స్వాహా చేసినట్లు పుట్టపర్తికి చెందిన చెన్నకేశవులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కడప ఐసీడీఎస్ పీడీ రాఘవరావు విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా రెండు నెలల క్రితం పెనుకొండ కార్యాలయానికి వచ్చిన ఆయన పూర్తి స్థాయిలో రికార్డులు తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.