డీమ్యాట్ ఖాతాలు తెరిపించండి
ఖాతాదారులను బ్యాంకులు ప్రోత్సహించాలి ఆర్థిక నిపుణుల సూచన గుంటూరులో ‘సాక్షిమైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ అవగాహన సదస్సు
సదస్సులో మాట్లాడుతున్న సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ వెనిశెట్టి శివప్రసాద్
గుంటూరు ఈస్ట్: మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కోసం వినియోగదారులు డీమ్యాట్ ఖాతాలను తెరిచేలా బ్యాంకులు ప్రోత్సహించాలని సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ వెనిశెట్టి శివప్రసాద్ సూచించారు. గుంటూరు అరండల్‌పేటలోని వైన్స్ డీలర్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో ఆదివారం సాక్షిమైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు ఆర్థిక నిపుణులు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలు తదితర అంశాలపై ఔత్సాహిక మదుపరులకు అవగాహన కల్పించారు. స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మదుపరులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలన్నారు. దేశంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, బ్రోకరైజ్ సంస్థలు దాదాపు 600 వరకు ఉన్నాయని, మంచి సంస్థను ఎంపిక చేసుకుని ఖాతా ప్రారంభించాలని సూచించారు. డీమ్యాట్ ఖాతా నుంచి మదుపరులకు తెలియకుండా ఒక్క రూపాయి బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఆ కంపెనీ పనితీరు, ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుకోవాలన్నారు.
నగదు దాచుకుంటే సంపద వృద్ధి చెందదు..
ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రాజేష్‌గుప్తా మాట్లాడుతూ దేశంలో 10 శాతం మంది ఎందులోనూ ఎక్కడా పెట్టుబడి పెట్టకుండా నగదు రూపంలో పొదుపు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సంపద వృద్ధి చెందదన్నారు. పదవీ విరమణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేనివారు రిస్క్ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ రీజనల్ మేనేజర్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి కంపెనీని ఎన్నుకోవాలన్నారు. మూడు నాలుగేళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తే లాభాలు పొందగలరన్నారు. పెట్టుబడి మొత్తం ఒక కంపెనీలోనే కాకుండా మంచి పేరున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలన్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కన్సల్టెంట్ యూఎస్ వర్మ మ్యూచువల్ ఫండ్ ప్రాముఖ్యతను వివరించారు.