‘అమ్మహస్తం’లో తొలగిన బొమ్మలు
రాయవరం, న్యూస్‌లైన్ :నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో పేదలను ఆదుకొంటామంటూ గత ఉగాది నాడు ‘అమ్మహస్తం’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెల్ల రేషన్‌కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, కందిపప్పు, పసుపు, కారం, చింతపండు, ఉప్పు, గోధుమపిండి, మంచినూనె, పంచదారలను రూ.185కే అందజేస్తామని ప్రకటించింది. అయితే ‘పావలా కోడికి ముప్పావలా మషాళా’ అన్నట్టు.. ఈ పథకం కింద అందించే సరుకుల నాణ్యత ఎలా ఉన్నా.. ప్రచారార్భాటం మాత్రం ‘రంగుల బొమ్మ’లతో ఘనంగా చేసుకుంది సర్కారు. నిత్యావర వస్తువుల ప్యాకెట్లపై దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుల రంగుల ఫొటోలను ముద్రించారు.
అంతేకాక.. పథకం ప్రారంభమైనప్పుడు అవే బొమ్మలతో కూడిన చేతి సంచులనూ పంపిణీ చేశారు. అయితే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ‘అమ్మహస్తం’ సరుకుల ప్యాకెట్లపై నాయకుల బొమ్మలను తొలగించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే నియమావళి అమల్లోనికి రానున్నందున.. రాబోయే మూడునెలలూ పేదలకు అందించే నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్న ఎన్నికల కమిషన్ సూచన మేరకే బొమ్మలను తొలగించినట్టు సమాచారం. అయితే పథకం అమలుకు ఇబ్బంది కలగరాదన్న ముందు చూపుతోనే నాయకుల బొమ్మలను తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.