అవతరణ దినోత్సవాలకు అంతా సిద్ధం..!
సాక్షి, ముంబై: సంయుక్త మహారాష్ట్ర అవతరించి నేటితో 54 సంవత్సరాలు పూర్తయ్యాయి. 55వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అవతరణ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ముంబై నగరంలోని శివాజీ పార్క్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భద్రతా దళాల కవాతు ప్రదర్శనతోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను అలరించనున్నాయి. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు అవతరణ వేడుకల కోసం అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశాయి. ప్రభుత్వంతోపాటు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పేదల కోసం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతోపాటు పలు సేవాకార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి.
పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
అవతరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం పలు ఆంక్షలు విధించింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా దాదర్‌లోని శివాజీపార్క్‌లో భారీ ఎత్తున మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా లాంగ్‌మార్చ్(పరేడ్) తీయనున్నారు. దీంతో ఈ పరేడ్ కోసం గురువారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ను దారిమళ్లించనున్నారు. శివాజీపార్క్ మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరేడ్ గేట్ నంబర్ 4 నుంచి బయటకు రానుంది. అనంతరం అక్కడి నుంచి కెలూస్కర్ మార్గ్, గడ్కరీ చౌక్, ఎన్.సి. కేల్కర్ మార్గ్, కొత్వాల్ గార్డెన్, తిలక్ బ్రిడ్జీ, దాదర్ టీటీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డు, డాక్టర్ అశోక్ తుల్పులే చౌక్, లేడీ జహంగీర్ మార్గ్‌ల మీదుగా సాగుతూ ఫైవ్ గార్డెన్ మాటుంగాలో ముగియనుంది.
దీంతో ఎన్.సి. కేల్కర్ మార్గ్, ఎల్.జె. రోడ్డు జంక్షన్ నుంచి కేలూస్కర్ మార్గ్, దక్షిణ, ఉత్తర జంక్షన్ల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేదించారు. కేలుస్కర్ మార్గ్ దక్షిణం నుంచి తూర్పు వైపు వెళ్లే మార్గాన్ని వన్‌వేగా మార్చనునున్నారు. ఇలా పరేడ్ వెళే ్లమార్గాల్లో పలు మార్పులు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ముక్కలు ముక్కలుగా ఉన్న ప్రాంతాలన్నింటిని సంయుక్త మహారాష్ట్రగా చేసేందుకు అనేకమంది ప్రాణాలర్పించారు. 1938 నుంచి ప్రారంభమైన ఈ పోరాటం సుదీర్ఘ కాలంపాటు కొనసాగింది. ఫలితంగా 1960, మే 1న సంయుక్త మహారాష్ట్ర అవతరించింది. గడచిన 54 సంవత్సరాల్లో రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం మరింత తీవ్రమైంది. ముంబై రాష్ట్రంతోపాటు వర్హాడ్, నాగపూర్ తదితర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్నింటిని ఒక్కటి చే సి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ పోరాటంలో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగువారు కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ 105 మంది అమరవీరుల స్మృతి చిహ్నంగా ఫోర్ట్ ప్రాంతంలో హుతాత్మ(అమరవీరుల) చౌక్‌ను నిర్మించారు.
మన రాష్ట్రం గురించి...
రాష్ట్ర విస్తీర్ణం 3,07,670 చదరపు కిలోమీటర్లు.
రాజధాని ముంబై జిల్లాలు 35
పట్టణాలు 378 గ్రామాలు 43,723
{పముఖ నగరాలు: ముంబై, నాగపూర్, పుణే, ఔరంగాబాద్, ఠాణే, కొల్హాపూర్, షోలాపూర్, నాసిక్
{పముఖ విమానాశ్రయాలు: ముంబై, నాగపూర్, పుణే, ఔరంగాబాద్
2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 11.23 కోట్లు.
దేశంలోనే అత్యధిక జనాభా(1,10,54,131) కలిగిన జిల్లా ఠాణే.